Tuesday, April 23, 2024

ఊరడింపు కాదు.. ఉపాధి కావాలి!

వ్యవసాయం తర్వాత పేదలకు ఉపాధి కల్పించే రంగమైన జౌళిరంగంలో కొత్త విధానాలు తీసుకుని వచ్చి లక్షలాది కార్మికులను ఆదుకుంటామంటూ కేంద్రం తరచూ ప్రకటనలు చేస్తూ ఉంటుంది. ప్రస్తుత ఎన్‌డీఏ ప్రభుత్వం ఎనిమిది సంవత్సరాలుగా టెక్స్‌టైల్‌ పార్కులను ఏర్పాటు చేస్తామని తెలుగు రాష్ట్రాలను ఊరిస్తోంది. తెలంగాణ మంత్రి కేటీ రామారావు కేంద్ర మంత్రులను కలిసినప్పుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్‌ సందర్శించినప్పుడు పలుసార్లు ఈ విషయం వారి దృష్టికి తెచ్చారు. జౌళి రంగంలో ఉపాధి అవకాశాల ఎక్కువ. తెలంగాణలో సిరిసిల్ల ప్రాంతంలోనూ, ఆంధ్రప్రదేశ్‌లో చీరాల, పేరాల, ఉప్పాడ, కొత్తపల్లి, వెంకటగిరి, తదితర ప్రాంతంలోనూ చేనేత పరిశ్రమపై ఆధారపడి జీవనం సాగించేవారు ఎంతో మంది ఉన్నారు. తినడానికి తిండి ఎంత ముఖ్యమో, కట్టుకోవడానికి బట్ట అంత ముఖ్యం. ఈ విషయంలో ఇతర రాష్ట్రాలు కూడా కృషి చేస్తున్నప్పటికీ తెలంగాణ రాష్ట్రం కృషి స్పష్టంగా కనిపిస్తోంది.

వ్యవసాయ రంగాన్ని పండుగ చేసింది. లక్షలాది టన్నుల ధాన్యాన్ని ఉత్పత్తి చేసే రాష్ట్రంగా అతి స్వల్ప కాలంలోనే తెలంగాణ పేరు గాంచింది. ఇప్పుడు జౌళి వస్త్రాల ఉత్పత్తిలో కూడా రాష్ట్రాన్ని ముందుకు తీసుకుని వెళ్ళేందుకు కృషి జరుగుతోంది. అలాగే, ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఆహార ధాన్యాల ఉత్పత్తి, సేకరణ లక్ష్యాలను మించి సాగుతోంది. చేనేత వస్త్రాల ఉత్పత్తి కోసం క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం చేనేత రంగానికి ఊతం ఇవ్వాలని తెలుగు రాష్ట్రాలు ముక్త కంఠంతో కోరుతున్నా, కేంద్రం పట్టించుకోవడం లేదన్న ఆవేదన నేతపని వారిలో వ్యక్తం అవుతోంది. చేనేత రంగానికి కేంద్రం మొండి చెయ్యి చూపుతోందని నేత కార్మికులు ఆందోళన చెందుతున్నారు. చేనేత రంగానికి చేయూత నివ్వకపోగా మరింత భారాన్ని మోపేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. చేనేత ఉత్పత్తులపైనా, నూలు దారాలపైనా వస్తు సేవా పన్ను (జీఎస్టీ) విధింపును రద్దు చేయాలనీ, సన్నకారు, బడుగు వర్గాలు ఆధారపడిన చేనేత రంగంపై జీఎస్టీ విధించడం ఎంతమాత్రం సమంజసం కాదని నేత పని వారు ఆందోళన చెందుతున్నారు.

ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను కేంద్రం అమలు చేయడం లేదు. దేశంలో అతి పెద్ద టెక్స్‌టైల్‌ పార్కు ఏర్పాటు కోసం కేటీఆర్‌ కృషి చేస్తున్నారు. ఈ పార్కు ఏర్పాటైతే వేలాది మందికి ఉపాధి లభిస్తుంది. చిన్నతరహా, మధ్యతరహా పరిశ్రమల ద్వారానే ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నది అనుభవంలోకి వచ్చిన విషయం. భారీ పరిశ్రమలకు వేలాది ఎకరాల భూములు, కోట్లాది రూపాయిల రుణాలను కేంద్రం కేటాయిస్తోంది. 4,445 కోట్ల రూపాయిల వ్యయంతో దేశంలో ఏడు మెగా టెక్స్‌టైల్‌ పార్కులను ఏర్పాటు చేయనున్నట్టు కేంద్రం ప్రకటించింది. పీఎం మిత్రాపథకం కింద ఈ పార్కులను ఏర్పాటు చేయనున్నట్టు కేంద్రం ప్రకటించి చాలా కాలం అయింది. కానీ, ఇంతవరకూ కార్యాచరణ చేపట్టలేదు. ఈ పార్కులను గ్రీన్‌ ఫీల్డ్‌, బ్రౌన్‌ఫీల్డ్‌ లొకేషన్లలో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. ఇందుకు తోడ్పాటునందిం చందుకు పంజాబ్‌, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, మధ్యప్రదేశ్‌, కర్నాటక రాష్ట్రాలు సంసిద్ధతను వ్యక్తం చేశాయనీ, 200 కోట్ల క్యాప్‌తో 30 శాతం కేంద్రం భరించేట్టుగా సాయం అందిస్తామని కేంద్రం పేర్కొంది. ఈ పార్కులను స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌ (ఎస్‌పీవీ) కింద ఆయా రాష్ట్రాల ఆధ్వర్యంలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) పద్ధతిలో చేపడతామని కేంద్రం గత ఏడాది ప్రకటించింది. కానీ, ఇంతవరకూ కార్యరూపం దాల్చలేదు.

ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రకటిం చిన ఆత్మనిర్భర్‌ భారత్‌ పథకంలో భాగంగా ఈ పార్కులను చేపడతామని జౌళి మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ పార్కుల వల్ల లక్షమందికి ప్రత్యక్షంగానూ, రెండు లక్షల మందికి పరోక్షంగానూ ఉపాధి లభిస్తుంది. రైతుల సమస్యలు భూమి పుట్టినప్పటి నుంచి ఉన్నట్టే, చేనేత కార్మికుల సమస్యలు అదే తీరులో తరతరాలుగా కొనసాగుతు న్నాయి. రైతుల మాదిరిగానే చేనేత కార్మికులు ఆకలి చావులకు పాల్పడుతున్నారు. కేంద్రంలో, రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఎన్ని మారినా నేత కార్మికుల సమస్యల గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. ఎన్నికల ప్రచారం సందర్భంగా చేనేత కార్మికుల సమావేశాల్లో రాజకీయ నాయకులు చేసే వాగ్దానాలన్నీ నీటి మీద రాతలేనని నేతన్నలు ఇప్పటికే తెలుసుకున్నారు. నేత కార్మికులు తమకు ఊరడింపులు కాదు ఉపాధి కావాలని చాలా కాలంగా కోరుతున్నారు. అది అందని మ్రానుపండు అవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement