Saturday, April 20, 2024

నివాస యోగ్యం.. ఓ యోగం!

నివాస యోగ్యం ఎక్కడుంది? పెద్ద నగరాలను టెలివిజన్‌లలో చూసి అవి భూతల స్వర్గాలని అనుకుంటూ ఉంటాం. అక్కడుండే సమస్యలు అక్కడా ఉన్నాయి. ఆధునికకాలంలో నివాస యోగ్యానికి ప్రామాణికంగా కాలుష్య రహితాన్నితీసుకుంటే అలాంటివి మన దేశంలో రానురాను తగ్గిపోతుండటంతో ప్రపంచ వ్యాప్తంగా అత్యుత్తమ నివాస యోగ్య నగరాలు పదింటిలో మన దేశానికి స్థానం దక్కలేదు. ప్రపంచంలో అత్యుత్తమ నివాస యోగ్య నగరం హోదాను ఉక్రెయిన్‌ రాజధాని కీవ్స్‌ ఈ ఏడాది కోల్పోయింది. రష్యా దాడి కారణంగా కీవ్స్‌ నగరం శవాల దిబ్బగామారింది.కూలిన భవనాల తో శిధిలాలు మేట వేయడంతో ఈ నగరం కళావిహీనంగా మారింది. రష్యా జరిపిన దాడి వల్ల ఉక్రెయిన్‌కి వాటిల్లి న నష్టాలన్నీ ఒక ఎత్తు అయితే, భూతల స్వర్గంగా పేరొందిన కీవ్స్‌ నగరం తన ప్రాభవాన్ని కోల్పోవడం మరో ఎత్తు. ప్రముఖ అంతర్జాతీయసంస్థ ఎకానమిస్టు ఇంటిలిజెన్స్‌ యూనిట్‌ (ఈఐయూ) విడుదల చేసిన తాజా నివేదికలో ప్రపంచంలో అత్యుత్తమ నివాస యోగ్య నగరంగా ఆస్ట్రియానుఎంపిక చేసింది. వియన్నాకు అనేక విధాల అంతర్జాతీయ ప్రాశస్త్యం ఉంది. కోవిడ్‌ కారణంగా రెస్టారెంట్లు, మ్యూజియంలు, ఇతర సందర్శక ప్రాంతాలు మూత పడటంతో 2021లో వియన్నా 12వ స్థానాలో నిలిచింది. అత్యుత్తమ నగరం గా ఎంపిక చేయడానికి పర్యావరణ పరిరక్షణ,వైద్య ఆరోగ్య సౌకర్యాలు, విద్యావసతులు, మౌలిక సదుపాయాలు, మొదలైన అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. వియన్నా ఈ అంశాలన్నింటిలో పరిపూర్ణత్వాన్ని కలిగి ఉండటంతో ప్రపంచ వ్యాప్తంగా 173 నగరాల నివాస యోగ్యతలను ప్రాతిపదికగా తీసుకుని అత్యుత్తమ నివాస యోగ్య నగరాన్ని ఎంపిక చేశారు. తొలి పది స్థానాలలో భారత్‌కి ఒక్క స్థానం కూడాదక్కకపోవడం విచారకరమే. నివాస యోగ్యమైన నగరంగా ఎదిగేందుకు మన దేశంలో చాలా నగరాలు పోటీ పడుతున్నాయి. అయితే, కాలుష్యం ప్రభావంవల్ల అవి వెనకబడిపోతున్నాయి. దేశ రాజధాని ఢిల్లి ఆర్థిక రాజధాని ముంబాయి లలో వాహన కాలుష్యం బాగా పెరిగిపోయింది.దీన్ని తగ్గించేందుకు వాహనాల సంఖ్య తగ్గించే ధైర్యాన్ని ప్రభుత్వాలు చేయలేకపోతున్నాయి. సరి-బేసి పద్దతిలో వాహనాలను అనుమతి ఇస్తున్నాయి. సిటీ ఆఫ్‌ గార్డెన్స్‌ గా పేరొందిన బెంగళూరు కూడా క్రమంగా తన ప్రాభవాన్ని కోల్పోతోంది. ఆ నగరానికి వాహనాలే పెను శాపాలు. దాంతో కాలుష్య ప్రమాదం తప్పడం లేదు. బెంగళూరు లో ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ సంస్థలు పెరిగి పోవడంవల్ల భారత్‌ సిలికాన్‌గా పేరొందింది.

ఇప్పుడు ఆ స్థానాన్ని అధిష్టించేందుకు హైదరాబాద్‌ పోటీ పడుతోంది. జీవన వ్యయం పెరుగుదల విషయంలో కూడా మన దేశంలో అన్ని నగరాలు పోటీ పడుతున్నాయేమోనిపిస్తోంది. నివాస యోగ్యంలో మొదట పరిగణనలోకి తీసుకోవా ల్సిన అంశంగా జీవనవ్యయాన్ని గతంలో భావించే వారు. ఇప్పుడు అలాంటి హెచ్చ తగ్గులు లేవు.అన్ని నగరాలో పరిస్థితి దాదాపు ఒకే రీతిలో ఉంది.ఇప్పుడు ప్రామాణికంగా తీసుకుంటున్న ప్రధానాంశం కాలుష్యం. కాలుష్యంలో ఢిల్లి నగరం అన్ని నగరాల కన్నా ప్రథమ స్థానంలో ఉంది. ఢిల్లి లో నానాటికీ పెరిగి పోతున్న కాలుష్యం విషయం సుప్రీం కోర్టు దృష్టికి పలు సార్లు వెళ్ళింది. పొరుగు రాష్ట్రాల్లో పొలాల్లో వ్యవ సాయ వ్యర్ధాలు, గడ్డివాములు కాల్చడం వల్ల పొగ దట్టం గా వ్యాపిస్తోందని ప్రభుత్వం వివరణ ఇచ్చింది.ఇందుకు తగిన పరిష్కారాన్ని కనుగొనాలని సర్వోన్నత న్యాయ స్థానం సూచించింది.ముంబాయిలో మురికి వాడలు ఎక్కువగా ఉండటంవల్ల కాలుష్య ప్రమాదం ఏర్పడు తోంది. పారిశ్రామిక నగరాలన్నింటిలో మురికి వాడలు నానాటికీ పెరుగుతూనే ఉన్నాయి.ఇందుకు కారణం పరి శ్రమలు స్థాపించే వారు ప్రభుత్వం నిర్దేశించిన నియమ నిబంధనలకూ, ప్రమాణాలకూ కట్టుబడి ఉండకపోవ డమే. దీనిపైన కూడా పలు సార్లు కోర్టులలో వ్యాజ్యాలు దాఖలయ్యాయి. పర్యావరణ శుభ్రత అనేది ప్రభుత్వాలు హూంకరిస్తే వచ్చేది కాదు.ఎవరి మటుకు వారు తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. ముఖ్యంగా, గ్రామాల్లో వ్యవసాయ పనులు తగ్గిపోవడం, పట్టణాలు, నగరాల్లో ఉపాధి కోసం గ్రామీణు లు తరలిరావడంతో జనసాంద్రత పెరుగుతోంది. లెక్క లేకుండా తరలి వస్తున్నవారందరికీ వాస యోగ్యమైన నివాసాలను కల్పించడం ఏ ప్రభుత్వానికైనా కష్టమే. దానికి తోడు ప్రభుత్వాలు చేపట్టే ఇళ్ళ నిర్మాణ కార్యక్ర మాలు ఆరంభ శూరత్వం అవుతున్నాయి. అలాగే, పెద్దనగరాల్లో నేరాల సంఖ్య కూడాబాగా పెరుగుతోంది. వీటిని అరికట్టడం శాంతిభద్రతల యంత్రాంగానికి పెను సవాల్‌గా తయారైంది.నివాస యోగ్యమైన నగరాలను తీర్చిదిద్దడానికి ప్రజలే పూనుకోవాలి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement