Thursday, April 18, 2024

EDITORIAL – మ‌ణిపూర్ లో ఎడా పెడా మంట‌లే

మణిపూర్‌లో నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటడంతో ప్రజలు అల్లల్లాడిపోతున్నారు. దేశమంత టా ఉన్న ఎండలకు తోడు,అక్కడ అల్లర్ల వల్ల ప్రజలు వీధు ల్లోకి రాలేక,ఇళ్ళల్లో ఉండలేక మాడిపోతున్నారు. నిత్యా వసరాల ధరలు ఎన్నడూ లేనంతగా పెరిగి పోయాయి. గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.1800 దాటింది. పెట్రోల్‌ 170 రూపాయిలు పలుకుతోంది. కూరగాయల ధరలు కిలో వంద రూపాయిలు పైనే, మాంసం, చేపల ధరలు 200 రూపాయిల పైనే. బయటికి వస్తే కర్ఫ్యూ కారణంగా పోలీసులు, భద్రతాదళాలు తరుముకుని వస్తున్నారు. మణిపూర్‌లో ప్రజా ప్రభుత్వం ఉందా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. మెయిటీలు,కుకీలకు మధ్య ఈనెల 3వ తేదీన ప్రారంభమైన ఘర్షణలు ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల అదుపులోకి వచ్చినట్టు కనిపించినా, మళ్ళీ సోమవారం నాడు మొదలయ్యాయి. ఇంతవరకూ ఈ అల్లర్లల్లో 70 మంది పైనే మరణించారు. స్థానికులు తమకు అందవలసిన సౌకర్యాలను ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు కాజేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఒక్క మాటలో మణిపూర్‌లో ప్రజలు సాగిస్తున్నది అస్తిత్వ పోరాటం. దీనికి రాజకీయ విభేదాలు లేనట్టు పైకి కనిపిస్తున్నా, అంతర్గతంగా రాజకీయ కారణాలే ఘర్షణ లకు దారితీస్తున్నాయని స్థానికులు అంటున్నారు.

మణిపూర్‌లో మెయిటీ తెగ వారు తమను షెడ్యూల్డ్‌ తెగల జాబితాలో చేర్చాలని ఆందోళన చేస్తున్నారు. అలా చేరిస్తే తమకు ఉన్న విద్యా, ఉద్యోగావకాశాలు చేజారిపో తాయని కుకీలు, ఇతర గిరిజన జాతుల వారు ఆందోళన చెందుతున్నారు. వీరి ఆందోళనను పక్కనే ఉన్న మయన్మార్‌ తీవ్రవాదులు ఎగదోస్తున్నారు. మయన్మా ర్‌ సరిహద్దు గ్రామాల్లో ప్రజలు భారత్‌లో ప్రవేశించేందు కు జరుపుతున్న ప్రయత్నాలను అడ్డుకోవడంతో కుకీల ఆందోళనను పురస్కరించుకుని పనిలోపనిగా భారత్‌లో ప్రవేశించేందుకు వారు ప్రయత్నిస్తున్నారు. ఈ ఆందోళ నల్లో విద్యార్ధులు, యువకులు ఎక్కువగా పాల్గొంటు న్నారు. బీజేపీ కి చెందిన వారు ఈ ఆందోళనకు మద్దతు ఇస్తున్నారని కొన్ని వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే, రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన బీజేపీపై ఇప్పుడు కాంగ్రెస్‌, ఇతర పార్టీలు ప్రతీకారం తీర్చుకుంటున్నాయని మరి కొన్ని వర్గాలు పేర్కొంటు న్నాయి. ప్రజల సంగతి ఎవరికీ పట్టడం లేదు. దేశంలో ని ఇతర ప్రాంతాలో సమస్యల కన్నా, మణిపూర్‌లో సమస్యలు భిన్నమైనవి. సరిహద్దు రాష్ట్రం కావడం వల్ల పొరుగుదేశాలకు చెందిన తీవ్రవాదులు ఈ ఆందోళన ల్లో పాల్గొనేందుకు అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుం డా, కేంద్రం అదనపు బలగాలను పంపి చేతులు దులుపు కుంటోంది.

నిజానికి ఇదికేంద్రం పరిష్కరించవల్సిన సమస్య కాగా, పరోక్షంగా కేంద్రంలోని అధికార పార్టీ అంటించిన నిప్పు రవ్వ మంటలను రేపింది. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ముఖ్యమంత్రి బిరేన్‌ సింగ్‌తో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితి తెలుసుకుంటున్నప్పటికీ, సాయుధ దళాల వల్ల ప్రయోజనం ఏమీ ఉండటం లేదు.ఆందోళనకారులను చర్చలకు పిలిచి సముదా యించే ప్రయత్నం జరగడం లేదు. కేంద్రం చర్చలకు పిలిచినా తాము వెళ్ళబోమని ఆందోళన కారులు స్పష్టం చేస్తున్నారు. వారికి నచ్చజెప్పేందుకు స్థానిక నాయకత్వం ముందుకు రావడం లేదు. కుకీలకు సాయంగా నాగా తీవ్రవాదులు కూడా ఆందోళనల్లో పాల్గొంటున్నాయి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు తమ హక్కులను కాజేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

పథకం ప్రకారమే ఈ ఆందోళనలు జరుగుతున్నాయని ఇంటిలి జెన్స్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు సమన్వయంతో పని చేస్తేనే ఈ పరిస్థితులు అదుపు లోకి వస్తాయి. ముఖ్యంగా, నిత్యావసర వస్తువులను కేంద్రం ఇతర ప్రాంతాల నుంచి మణిపూర్‌కి తరలించి స్థానికులకు అందుబాటులో ఉంచితే కొంతైనా ఉపశమ నం లభిస్తుంది. కేంద్రం, రాష్ట్రం కానీ, ఆ ప్రయత్నం చేస్తు న్నట్టుగా లేదు. అదే కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న లోపం. అలాగే, తమ వంతు సాయాన్ని అందించాల్సిన పొరుగు రాష్ట్రాలు దీనిని ఒక అవకాశంగా తీసుకుని బదులు తీర్చు కుంటున్నాయి. అదనపు బలగాలను పంపినంత మాత్రా న తన బాధ్యత తీరిపోయిందని కేంద్రం భావించడం సరైంది కాదు.

- Advertisement -

మణిపూర్‌లో ఇతర రాష్ట్రాలకు చెందిన వారు వచ్చి వ్యాపారాలు చేసుకుంటూ ఆస్తులు సంపా దించారు. స్థానికులపై వారు ఆధిపత్యం చేస్తున్నారు. దాంతో స్థానికులు ఇతర రాష్ట్రాల వారిపై గుర్రు పెంచు కున్నారు. బీహార్‌కు చెందిన వ్యాపారస్తులపై ఆ మధ్య స్థానికులు తిరుగుబాటు చేశారు. ఇప్పడు కూడా నిత్యావసరాల ధరలు పెరగడానికి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యాపారస్తులే కారణమని స్థానికులు అనుమాని స్తున్నారు. కర్ఫూకి జనం అలవాటు పడినా ఈసారి నిత్యావసరాలు దొరక్కపోవడంతో వారిలో ఆగ్రహావేశా లు మిన్నంటాయి. ప్రస్తుత పరిస్థితి తీవ్రమైన ఆందోళన ను రేకెత్తిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement