Thursday, April 25, 2024

ఉద్యోగ వృద్ధి తర్వాతే ఏదైనా..

పెట్టుబడులను సమీకరించేందుకు ప్రధానమంత్రి నుంచి మంత్రుల వరకూ వివిధ దేశాల్లో పర్యటిస్తున్నారు. ఆర్థిక కూటముల సదస్సుల సీజన్‌ కావడంతో వారంతా ఆ పర్యటనలు చేయడం తప్పేమీ కాదు. అయితే, దేశంలోఉన్న పరిశ్రమలు కరోనా ప్రభావం వల్ల ఉక్రెయిన్‌-రష్యా యుద్దం వల్ల మూత పడుతున్నాయి. 2022 మొదటి త్రైమాసికంలో 11.2 కోట్ల మంది ఉపాధి కోల్పోయినట్టు అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) ఒక నివేదికలో పేర్కొంది. ఉపాధి కల్పించే సంస్థలు పెట్టుబడులు లేక,తయారు చేసిన ఉత్ప త్తులకు మార్కెటింగ్‌ లేక లే ఆఫ్‌లను ప్రకటిస్తున్నాయి. ముఖ్యంగా, మన ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా అభివర్ణించబడే చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ)లలో చాలా మటుకు మూతపడ్డాయి.కరోనా దెబ్బ నుంచి ఎంఎస్‌ఎంఈలు ఇంకా కోలుకోలే దని ఈ రంగానికి చెందిన ప్రముఖులు పేర్కొంటున్నారు. గతంలో తీసుకున్న రుణాలు తీర్చలేక పోవడం వల్ల కొత్త రుణాల కోసం తాము చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదని వారు చెబుతున్నారు. మన దేశంలోనే కాదు,ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ ఇదే పరిస్థితి.అగ్రరాజ్యంగా పేర్కొనబడుతున్న అమెరికాలో కూడా ద్రవ్యోల్బణం చాలా ఎక్కువగా ఉంది. 2019లో ప్రపంచ వ్యాప్తంగా నిరు ద్యోగులు 187 మిలియన్‌ల మంది మాత్రమే ఉన్నారనీ, 2022లో ఆ సంఖ్య 207 మిలియన్‌లకు చేరుకోవచ్చని ఐఎల్‌ఓ లెక్కగట్టింది. ఉక్రెయిన్‌ యుద్ధం వల్ల సాధారణ జీవనం సాగించే దేశాల్లో వారు కూడా వలసలు పట్టి పెక్కు దేశాల్లో శర ణార్దులు కావడంతో ఆ దేశాల్లో ఉపాధి దొరకక నానా అవస్థలు పడుతున్నారు. అంతేకాక, మన దేశంలో చిన్న, లఘుపరిశ్రమలు తయారు చేసే ఉత్పత్తు లకు మార్కెటింగ్‌ లభించడం లేదు. ప్రఖ్యాత ఆర్థిక శాస్త్రవేత్త,మాజీ ప్రధాని డాక్టర్‌ మన్మోహన్‌సింగ్‌ ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక స్థితులు ఇంత దారుణంగా మారడం తాను ఎన్నడూ చూడలేదనీ, ముఖ్యంగా ఆహారధాన్యాల కొరత పలు దేశాల్లో పరిస్థితులను క్షీణింప జేసిందనీ తిండి కోసం ప్రజలు యుద్ధాలకు తలపడే పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చ రించారు.

ఈ సమయంలో అన్ని దేశాలూ మానవీయ దృక్పధాన్ని అను సరించాలని ఆయన పిలుపు ఇచ్చారు. శ్రీలంకలో పరి స్థితిని దృష్టిలో ఉంచుకుని ఆయన ఈ హెచ్చరిక చేసినట్టు కనిపిస్తోంది.శ్రీలంకకు గతంలో ఓ సారి సాయం అందించినా, ప్రస్తుతం పరిస్థితి తీవ్రత దృష్ట్యామళ్ళీ ఆహార ధాన్యాలు,చముురు, కూరగాయలు పండ్లు మన దేశం పంపడం తరతరాలుగా భారత్‌ అనుసరిస్తున్న ఔదార్య గుణానికి నిదర్శనమని ఆయన అన్నారు. ఉక్రెయిన్‌ యుద్ధాన్ని గురించి కూడా ఆయన ప్రస్తావించారు. ఈ యుద్ధం అన్ని దేశాలకు మాదిరిగానే మన దేశానికి తీవ్ర సంక్షోభాలను తెచ్చి పెట్టిన మాట నిజమే అయితే,దీనిని ఒక అవకాశంగా తీసుకుని ఎగుమతులు పెంచుకోవాలని ఆయన సలహా ఇచ్చారు. దేశంలో ఉత్పత్తులను పెంచడానికి కేంద్రం సరైన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. రైతులకు గిట్టుబాటు ధర చెల్లించడమే కాకుండా,వారి వద్ద ఉన్న ఆహార ధాన్యాల నిల్వలను కొనుగోలు చేయాలని సూచించారు. పెద్ద పారిశ్రామికవేత్తలకు, కార్పొరేట్‌ సంస్థలకు అండగా నిలవడమే కాదు వారి నుంచి ఇలాంటి క్లిష్ట సమయంలో ఫలితాలను రాబట్టాలని ఆయన సూచించారు.ముఖ్యంగా పెద్ద పరిశ్రమలు, కార్పొరేట్‌ సంస్థల్లో ఉపాధి అవకాశాలను పెంచాలని మన్మో హన్‌ సూచించారు. ఆయన ఒక ఆర్థిక వేత్తగా సరైన సూచనలు ఇచ్చారు. ఇతర దేశాల్లో జరిగే ప్రాంతీయ, అంతర్జాతీయ కూటముల శిఖరాగ్ర సమా వేశాలకు మన దేశం క్రమం తప్పకుండా హాజరవుతోంది. అయితే,ఆ దేశాల నుంచి మనకుఅందుతున్న సహకారం ఏ మేరకు ప్రయోజనకరంగా ఉందో బేరీజు వేసుకోవాలి. దావోస్‌లో ప్రపంచ ఆర్థికవేదిక సమావేశాలకుకేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయెల్‌ కాకుండా, తెలుగు రాష్ట్రాల మంత్రులూ, ముఖ్యమంత్రులు హాజరయ్యారు.అక్కడి నుంచి వచ్చే పెట్టుబడుల విషయమై శ్రద్ధ పెట్టాలి. అలా చేస్తే మన దేశంలో ఉద్యోగాల కల్పనకు ఎవరినో అర్థించనక్క రలేదు. అలాగే, ప్రధానమంత్రి జరిపే విదేశీ యాత్రలు మన దేశానికి ఎన్ని పెట్టుబడులను తీసుకువస్తున్నాయన్నది కూడా బేరీజు వేసుకోవాలి.ప్రపంచ దేశాల్లోనే ఉద్యోగ రంగంలో సంక్షోభం నెలకొంది.ఇతర దేశాల వారు మన దేశంలో ఉద్యోగ కల్పనకు పెట్టుబడులు ఏం పెడతారనే ప్రశ్న జనసామాన్యంలో తలెత్తుతోంది.ఈ విషయాన్ని కూడా ప్రభుత్వంలో ఉన్న వారు పరిగణనలోకి తీసుకోవాలి. చిన్న పరిశ్రమలు,కుటీర పరిశ్రమలను పునరుద్ధరించేందుకు పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవాలి.అప్పుడే ఉపాధి , ఉద్యోగ రంగాల్లో సంక్షోభం తొలగిపోతుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement