Thursday, March 30, 2023

పటిష్ట బంధం.. ఉభయతారకం

బ్రిటన్‌ ప్రధానిగా బాధ్యతలను స్వీకరించిన సునాక్‌ కి ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్‌ చేసి శుభాకాంక్షలు తెలపడమే కాకుండా, ఇరుదేశాల మధ్య దౌత్య, ఆర్థిక, వాణిజ్య సంబంధాల వృద్ధికి కలిసి పనిచేద్దామని చెప్పడం ఆయన హుందాతనానికి నిదర్శనం. ప్రధాని మోడీ కన్నా, సునాక్‌ వయసు రీత్యా బాగా చిన్నవాడైనా, ప్రపంచంలో పెద్ద ప్రజాస్వామ్య దేశానికి సారథిగా ఏకగ్రీవంగా ఎన్నికైన వ్యక్తి. సునాక్‌తో జరిపిన ఫోన్‌ సంభాషణలో రెండు ప్రజాస్వామిక దేశాల ఆర్థిక సంబంధాల వృద్ధికి పరస్పరం సహకరించుకోవాలని సూచించడం శుభ సూచికం. ఇండోనేషియాలోని బాలీలో త్వరలోనే సమావేశం కావాలని ఇరువురు నాయకులు అంగీకరించినట్టు బ్రిటన్‌ ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. బాలీలో జి-20 దేశాల శిఖరాగ్ర సమావేశాలు జరగనున్నాయి. ఇరుదేశాల మధ్య స్వేచ్ఛా, వాణిజ్య ఒప్పందాన్ని త్వరగా ముగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రధానమంత్రి మోడీ స్పష్టం చేశారు. ఇరుదేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్యం ఏటా 24.3 బిలియన్‌ పౌండ్లు ఉంది. కరోనా వల్ల రెండు దేశాల వాణిజ్యం బాగా దెబ్బ తింది, మళ్ళీ దానిని పునరుద్ధరించుకోవల్సి ఉంది. అంతేకాక, గత ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా దాడి ప్రభావం ఇండో, యూకె వాణిజ్య సంబంధాలపై పడింది. ఇరుదేశాల మధ్య వాణిజ్యం వృద్ధి చెందడం మనకు ఎంత అవసరమో, అటు బ్రిటన్‌కి కూడా అంతే అవసరం. బ్రిటన్‌ యూరోపియన్‌ యూనియన్‌ నుంచి బయటికి వచ్చిన తర్వాత వాణిజ్యపరంగా, ఆర్థికంగా బాగా దెబ్బతింది.

- Advertisement -
   

ప్రస్తుతం ద్రవ్యోల్బణం పెచ్చుమీరి జీవనవ్యయం బాగా పెరిగిపోయింది. అంతేకాక బ్రెగ్జిట్‌తో బ్రిటన్‌ యూరప్‌లో పెద్దరికాన్ని కోల్పోయింది. ఇప్పుడు దానిని పునరుద్ధరించుకోవల్సిన బాధ్యత సునాక్‌పై ఉంది. అటు అమెరికా, ఇటు రష్యాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం లాంటి వాతావరణం నెలకొన్న ప్రస్తుత పరిస్థితులలో భారత్‌ వంటి అతిపెద్ద ప్రజాస్వామిక దేశంతో సంబంధాలు బ్రిటన్‌కీ అవసరమే. ఇరుదేశాల మధ్య వాణిజ్యంలో సేవారంగం 70 శాతం ఆక్రమించి ప్రధానమైనదిగా స్థిరపడింది. దశాబ్దం ఆఖరుకు ఇరుదేశాల మధ్య వాణిజ్యం వంద బిలియన్‌ డాలర్ల లక్ష్యానికి చేరుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. బ్రిటన్‌లో ఇటీవల చోటు చేసుకున్న మార్పులు, చేర్పుల వల్ల భారత్‌కి ఎటువంటి నష్టమూ వాటిల్లే ప్రమాదం లేదు. పైగా, ప్రవాస భారతీ యుడే బ్రిటన్‌ ప్రధానిగా బాధ్యతలను స్వీకరించిన దృష్ట్యా, సమస్యలను సానుకూల ధోరణిలో పరిష్కరిం చేందుకు కృషి చేయవచ్చు. బ్రిటన్‌ ప్రధాని పదవి ఆయనకు కొత్తది కావచ్చు కానీ, ఆ దేశ ఆర్థిక మంత్రిగా పని చేయడం వల్ల వాణిజ్య, ఆర్థిక అంశాలపై ఆయనకు సమగ్రమైన అవగాహన ఉంది. సుదీర్ఘమైన చరిత్ర కలిగిన బ్రిటిష్‌ ప్రధానమంత్రి పదవికి ప్రవాస భారత కుటుంబం ప్రతినిధి ఎన్నిక కావడం భారతీయులందరికీ గర్వకార ణమని సునాక్‌తో ఫోన్‌ సంభాషణలో మోడీ అన్నారు. అందుకు సునాక్‌ స్పందిస్తూ తాను కూడా ఉత్సాహంతో, ఉత్తేజంతో పని చేసేందుకు సంసిద్ధంగా ఉన్నానని అన్నారు. ఇరుదేశాల మధ్య నెలకొన్న సుహృద్భావ సంబంధాలనూ, సమగ్రమైన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పటిష్ట పర్చేందుకు కృషి చేద్దామని అనడం శుభ సూచికం.

ప్రస్తుతం బ్రిటిన్‌ విదేశాంగ మంత్రి జేమ్స్‌ క్లవర్లీ ముంబాయి పర్యటనకు వచ్చారు. ఆయన రావడానికి ఒక రోజు ముందు ఇరుదేశాల ప్రధానులు టెలిఫోన్‌ సంభాషణ జరిపారు. అంతేకాక, బ్రిటన్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిని గాడిలో పెట్టేందుకు కఠినమైన నిర్ణయాలను తీసుకోవల్సి ఉంటుందని సునాక్‌ గ్రహించారు. భారత ప్రధాని మోడీతో సంభాషణలోఆయన ఆ విషయం కూడా ప్రస్తావించారు. రష్యాపై అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షల కారణంగా యూరప్‌లోని పలు దేశాలు విలవిలలాడుతున్నాయి. సాయం కోసం అవి గతంలో బ్రిటన్‌ వైపు చూసేవి. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. రష్యా నుంచి గ్యాస్‌ సరఫరా స్తంభించడం వల్ల ఇతర యూరప్‌ దేశాల మాదిరిగానే బ్రిటన్‌ కూడా ఇంధన సమస్యను ఎదుర్కొంటున్నది. ప్రజలకు అవసరమైన విద్యుత్‌నీ, గ్యాస్‌నీ సరఫరా చేయ లేని పరిస్థితిలో బ్రిటిష్‌ ప్రభుత్వం ఉంది. ఈ నేపథ్యంలో పాలనా వ్యవహారంలో ఎదురయ్యే సమస్యల పరిష్కారంలో మోడీ వంటి అనుభవజ్ఞుని సలహాలు, సూచనలు సునాక్‌కి కూడా అవసరమే. భారత్‌ తమకు సహజమైన మిత్ర దేశమని బ్రిటిష్‌ విదేశాంగ మంత్రి జేమ్స్‌ క్లవర్లీ భారత్‌ పర్యటనకు బయలుదేరే ముందు అన్నారు. ద్వైపాక్షిక సంబంధాలపై భారత విదేశాంగ మంత్రితో చర్చలు జరుపుతానని, భారత పర్యటన పట్ల ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాననడంలో సందర్భోచితం. బ్రిటిష్‌ ప్రధాని, విదేశాంగ మంత్రి కూడా భారత్‌ పట్ల మైత్రీభావాన్ని ప్రదర్శించడం శుభసూచికం.

Advertisement

తాజా వార్తలు

Advertisement