Thursday, April 25, 2024

4 నుంచి యాదాద్రి బ్రహ్మోత్సవాలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్స వాలు ఈనెల 4 నుంచి 14వ తేదీ వరకు జరగనున్నాయి. మొత్తం 11 రోజులు పాటు ఉత్సవాలను నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి ఎన్‌. గీత తెలిపారు. పాంచరాత్ర ఆగమ సిద్ధాంతానుసారంగా భగవద్రామానుజ సాంప్రదాయ సిద్ధంగా బాలాలయంలో బ్రహ్మోత్సవాల నిర్వహణకు ఏర్పాటు చేసినట్లు ఆమె వెల్లడించారు. నాల్గొవ తేదీ ఉదయం పది గంటలకు విష్వక్సేన ఆరాధన, స్వస్తివాచనం, రక్షాబంధనంతో మొదలై ఫాల్గున శుద్ధ ద్వాదాశి 14వ తేదీ రోజున ఉదయం పది గంటలకు స్వామివారి అష్టోత్తర శతఘటాభిషేకం, అదే రోజు రాత్రి శృంగార డోలోత్సవంతో ఉత్సవాలు పరిసమాప్తమవుతాయని ఆమె పేర్కొన్నారు. ఈనెల 11వ తేదీ శుక్రవారం ఉదయం 11 గంటలకు బాలాలయంలో నిర్వహించే స్వామి వారి తిరుకళ్యాణ మహోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున, తిరుమల తిరుపతి దేవస్థానం తరపున , పోచంపల్లి చేనేత సంఘం తరపున పట్టువస్త్రాలు సమర్పిస్తారన్నారు. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుకళ్యాణ మహోత్సవంలో పలువురు మంత్రులు సహా ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు పాల్గొనే అవకాశముందని ఆమె తెలిపారు. కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ స్వామి వారి బాలాలయంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తమన్నారు. ఈనెల 10 నుంచి 12వ తేదీ వరకు భక్తులతో జరిపించే నిత్యకళ్యాణోత్సవం, శాశ్వత కళ్యాణం, శ్రీ సుదర్శన నారసింహా హోమం కైంకర్యములను రద్దు చేశామని, అలాగే 13వ తేదీ నుచి 14వ తేదీ వరకు భక్తుల చేత జరిపించే అభిషేకములు, అర్చనలు రద్దు చేశామని ఆమె వెల్లడించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా హైదరాబాద్‌ బర్కత్‌పుర యాదాద్రి భవన్‌ నుంచి అఖండజ్యోతి పాదయాత్ర బయలుదేరి బ్రహ్మోత్సవాల ప్రారంభం రోజైన 4వ తేదీ సాయింత్రం 6గంటలకు యాదాద్రి చేరుతుందని ఆమె తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement