Friday, March 29, 2024

తిరుప్పావై : పాశురము : 27

ఆండాళ్‌ తిరువడిగలే శరణం

కూడారై వెల్లుమ్‌ శీర్‌ గోవిన్దా! ఉన్దన్నె
ప్పాడి పుగళుమ్‌ పరిశినాల్‌ నన్ఱాక
చ్చూడగమే, తోళ్‌వళైయే, తోడే,శెవి ప్పూవే,
పాడగమే,యైన్ఱనైయ పల్‌కలనుమ్‌ యామణివోమ్‌,
ఆడై యుడుప్పోమ్‌; ఆదన్‌పిన్నే పాల్‌శోఱు
మూడ నెయ్‌ పెయ్‌దు ముళఙ్గై వళివార
క్కూడి యిరున్దు కుళిర్‌న్దేలో రె మ్బావాయ్‌.

ఆండాళ్‌ తిరువడిగలే శరణం

శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్‌ స్వామి వారి మంగళాశాసనములతో…

తాత్పర్యము :
”నిన్నాశ్రయించిన వారిని జయించు స్వభావము కల శ్రీకృష్ణా! నిన్ను స్తుతించి వ్రతసాధనమగు పరయను వాద్యమును పొంది తరువాత పొందు సన్మానము లోకులు పోగడునట్లు ఉండవలయును. చేతులకు గాజులు మొదలగునవి, బాహువులకు దండకడియములు, చెవులకు క్రింది భాగమున దాల్చెడి దిద్దులు, పై భాగమున దాల్చెడి చెవిపూలు, కాలియందెలు మొదలగు అనేకాభరణములను దాల్చవలయును. తరువాత మంచి వస్త్రములను ధరించవలయును. ఆ తరువాత పాలు అన్నము మునుగునట్లు నేయి పోసి ఆ మధుర పదార్థమును మోచేతి నుం డి కారుచుండగా నీతో కలసి కూర్చొని చల్లగా హాయిగా ఆరగించవలయును. ” ఇది భావము.
గాజులు- అనగా చక్రాంకణమునకు(సమాశ్రయణము) ముందాచార్యులు చేతికి కట్టు కంకణము.
భుజాభరణములు – అనగా తప్తచక్రాంకణము
అనగా బాహువులకు ఆచార్యులుంచెడు శంఖచక్ర ముద్రలు.
ఇక దుద్దులు – ఇక ఎనిమిది రాళ్ళ దుద్దులు అనగా అష్టాక్షరీ మంత్రము.ఇది మండలాకారముగా నుండును.
ఇక చెవిపూలు – ఇవి రెండుగా ఉండును. అనగా ద్వయమంత్రము.
పాదాభరణము – అనగా నాలుగు చరణములతో నుండు చరమంత్రము.
ఇట్లు తిరుమంత్రము, ద్వయమంత్రము, చరమ మంత్రము, అను మూడు మంత్రములచే జ్ఞానవైరాగ్యములు బోధించబడును.
తిరుమంత్రము ఆత్మస్వరూప యాధాత్మ్య జ్ఞానమును తెలుపును. ద్వయము ఉత్తర ఖండములో చెప్పబడిన కైంకర్యమునకు ముందు వాడునట్టి భక్తి ప్రధానమైనది గాన భక్తిపరము.
చరమ శ్లోకము త్యాజ్యాంశమున వైరాగ్యమును ముఖ్యముగా బోధించును. కావున వైరాగ్యపరము ఆభరణములు అనేకములనగా జ్ఞానభక్తి విరాగములు కూడా విషయపరముగా అనేకములుగా నుండును.
జ్ఞానము – అర్ధ పంచక విషయములు 5 విధములు
భక్తి- భగవద్భాగవతాచార్య పరముగా 3 విధములు.
వైరాగ్యము -దాదాపుత్ర విత్తాది భేదములచే పలు విధములు.
వస్త్రములనగా – శేషత్వ జ్ఞానము
అలంకారమునకు వస్త్రము ముఖ్యమగునట్లు ఆత్మాలంకారమునకు శేషత్వమే ముఖ్యము కదా.
పాలు అన్నము – అనగా కైంకర్యము. అన్నిటిలో పరమాన్నము భోగ్యతాధిక్యము కలదు.కావున అన్నిటిలో అధిక భోగ్యత కలది. కావున కాంకర్యము చెప్పనగును.
నేయి అనగా పారతంత్య్రము
కైంకర్యమును పారతంత్య్రములో కనపడకుండా కప్పి వేయవలయును.
పాలు అనగా భగవత్కళ్యాణ గుణములు.
అన్నము అనగా కళ్యాణగుణ పరిపూర్ణమగు భగవత్తత్వము.
నేయి అనగా భగవంతుని ఎడబాటును క్షణము కూడా సహించలేదని ప్రీతి.
ఈ ప్రీతి మోచేతుల మీది నుండి కారుచుండ వలయుననినచో చేయి కర్మను సూచించును.కర్మలద్వారా భగవంతుని యందలి ప్రీతి కనబడుచుండును. అని అభిప్రాయము.
ఒకరితో ఒకరు కలసి కూర్చుని భుజించ వలయును. అనగా భాగవత గోష్ఠిని కోరుచున్నారని అభిప్రాయము.
మరియొక అర్ధము.
హస్తాభరణము – అంజలి
భుజాభణములు – ఫలసంగ కర్తృత్వ బుద్ధి లేకుండుట.
ఫలమును విడుచుట అనగా ఫలాశను విడిచి కర్తవ్య బుద్ధితో భగవదారాధన భగవంతునకు ప్రీతికరముగా చేయుట.
సంగమును విడుచుట అనగ భగవంతుడే తనకు శేషభూతుడనగు నా చేత తానిచ్చిన ఇంద్రియములతో తన పనిని చేయించుకొనుచున్నాడను జ్ఞానము.
కర్తృత్వమును విడుచుట అనగా కర్మకాతడే కర్త, నేనుకాదని తెలియుట.
కర్ణాభరణమనగా – భగవద్భాగవత ప్రసంగ ములను వినుట.అనగా భక్తియోగమని అభిప్రాయము.
చెవిపూలు – ద్వయమంత్రము
పాదాభరణములు – భగవద్భాగవతాచార్య సన్నిధికి నడిచి వెళ్ళుటయే.
ఇట్లు పలు ఆభరణములు అనగా అన్ని అవయవములకు ఆయా ఆభరణములు అని అభిప్రాయము.
జిహ్వకు -కీర్తించుట
మనసునకు – ధ్యాని ంచుట
చేతులకు – అర్చించుట
నేత్రములకు – దర్శించుట
ముక్కునకు – తులసీ ఆఘ్రాణము
ఈ పాశరమున గోపికలు కోరినది బ్రహ్మాను భవమే.
‘సోశ్నుతే సర్వాన్‌ కామాన్‌ సహబ్రహ్మణా విపశ్చితా’
అను శ్రుతి వాక్యము బోధించు బ్రహ్మానుభవమునే ఇచట గోపికలు కోరినారని తెలియవలయును.

- Advertisement -

డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు

Advertisement

తాజా వార్తలు

Advertisement