Friday, January 21, 2022

తిరుప్పావై : పాశురము : 28

ఆండాళ్‌ తిరువడిగలే శరణం

కఱవైగల్‌ పిన్‌శెన్ఱు కానమ్‌ శేర్‌న్దుణ్బోమ్‌
అణివొన్ఱు మిల్లాద వాయ్‌క్కులత్తు, ఉన్దన్నై
ప్పిఱవి పెఱున్దవై పుణ్ణియమ్‌ నాముడైయామ్‌;
కుఱౖ వొన్ఱు మిల్లాద కోవిన్దా! ఉన్దన్నోడు
ఉఱవేల్‌ నమక్కిం గొళిక్క వొళియాదు,
అఱియాద పిళ్లైగళోమ్‌, అన్బినాల్‌ ఉన్దన్నై
చ్చిఱుపే రళైత్తనవుమ్‌ శీఱి యరుళాదే
ఇఱౖవా నీతారాయ్‌ పఱౖ, యేలో రెమ్బావాయ్‌

ఆండాళ్‌ తిరువడిగలే శరణం

శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్‌ స్వామి వారి మంగళాశాసనములతో…

తాత్పర్యము :
గడ్డియున్నచోట వెతకుకొని మేపుటకై పశువుల వెనుకనే పోయి ఆ అడవిలోనే శుచి శుభ్రత నియమము లేక తిని జీవించుటయే ప్రయోజనము. కొంచెమైనను తెలివిలేని గొల్లకులమున బుట్టిన మేము మా వంశమున మాతో సమానముగా నీవు పుట్టిన పుణ్యము కలవారము. మాకన్నియు లోపములే. నీకేలోటూ లేదు. గోవిందా! నీతో మాకున్న సంబంధమును నీవు కాని, మేము కాని పోగొట్టు కొనజాలము. లౌకికము తెలియని చిన్నపిల్లలము. అందుకే ప్రేమతో నిన్ను చిన్న పేరుతో పిలిచితిమి. అందుకే కోపము తెచ్చుకొని మా కోరికను మన్నింపకుండరాదు. మా కోరికయగు పరనొసంగుము.”
ముక్త పురుషుడు పరమ పదమున పరమాత్మతో కలిసి అనుభవించు భోగమునే గోపికలు వెనుకటి పాశురమున కోరిరి. అట్లు అనుభవించుటకు కావలసిన ఈ పాశురమున తెలుపు చున్నాడు.
సాంగవేదాధ్యయనము చేయవలయును.
అర్ధ జ్ఞానమును పొందవలయును.
వేద విహితమగు వర్ణాశ్రమాచార ధర్మములను పాటించవలయును.
అపుడు పాపము నశించి మనశుద్ధి యేర్పడును. తరువాత ఇంద్రియములను విషయముల నుండి వెనుకకు మరలించి మనసును ఆత్మయందు నిలుపవలయును.
ఆత్మ సాక్షాత్కారము తరువాత పరమాత్మ యందు మనసు లగ్నమ చేయవలయును. ఆ తరువాత శ్రవణ మననములను ఆచరించి అర్చన ప్రణామాది పరస్సరముగా నిరంతర భగవత్స్మృతి రూపమును దర్శన సమానాకారముగా ధ్యానము గావించవలయును. ఈ ధ్యానములో శరీర సంబంధమును కలిగించు పుణ్య పాపములు నశించి ముక్తుడై భగవదనుభవ భోగమును పొందజాలము
దర్శన సమానాకారమగు నిరంతర భగవత్స్మృతికి సాధనము భగవత్స్వరూప జ్ఞానము. దానికి సాధనము ఆత్మావలోకము. ఆత్మావలోకమునకు జితేంద్రియత్వము. జితేద్రియత్వమునకు పాపక్షయము. పాప క్షయమునకు వి హిత కర్మానుష్ఠానము, దానికి వేదర్ధ పరిజ్ఞానము. దానికి వేదాధ్యయనము దానికి వేదార్ధ క్షయమునకు విహిత కర్మానుష్ఠానము, దానికి వేదార్ధ పరిజ్ఞానము. దానికి వేదధ్యయనము దానికి గురుకుల వాసము సాధనములు.
ఈ పాశురమున ఇవియేమియు తమవద్ద లేవని ఆకించన్యమును అనన్యగతిత్వమును నివేదించుచున్నారు.
సిద్ధసాధనము నాశ్రయించువారులు చేయవలసిన విధానమును ఈ పాశురమున వివరించిరి.
భగవంతుడే ఉపాయమని నమ్మినవాడు భగవంతుని సమీపములో
1. భగవంతుని చేరుటకు సాధనముగా తాము ఆచరించిన పుణ్యకర్మలు ఏవియూలేవని తెలుపుకొనవలయును.
2. తనకే యోగ్యత లేదని నివేదించుటకు భగవత్సన్నిధిలో తన నికృష్టతను తానే చెప్పుకొనవలయును.
3. తన పుణ్యమంతయు తన స్వామియగు భగవానుడు అనంత కళ్యాణ గుణపరిపూర్ణుడగుటయే అని తెలియవలయును.
4. అనంత కళ్యాణగుణ పరిపూర్ణుడగు స్వామితో తనకు విడదీయరాని సంబంధమున్నదని తెలియవలయును.
5. తానిదివరకు చేసిన అపచారములకు, ఉపచార భావముతో చేసిన అపచారములకు క్షమాపణ వేడవలయును.
6. నీవే మాకు ముందు ఉపాయముగా నుండి ఫలమును అనుగ్రహింపుమని కోరవలయును.
ఇదియే సత్కర్మాభావ విజ్ఞాపనము. స్వనికర్షాను సంధానము. ఈశ్వరగుణపూర్తి, సంబంధ జ్ఞానము, పూర్వాపరాధ క్షామణము, భగవదేకోపాయత్వస్వీకారము అను ఆరింటిని ఈ పాశురమున వివరించుచున్నారు.
భగవానుడే ఉపాయమని ఆశ్రయించువారు అన్ని ఉపాయములను విడువవలయును. అవి విడుచుట పలు విధములుగా నుండును. కర్మ, జ్ఞానము, భక్తి మొదలగు వాటిని ఉపాయముగా భావించి ఆచరించినాడు వాటిని విడిచితిని అని నివేదించవలయును. వానిని ఆచరించజాలనివాడు నేనాచరింపజాలను అని తెలుపుకొన వలయును. ఆచరింపవలయునని తెలిసిననూ తన స్వరూపానుగుణము కాదనిన ఆచరించనివాడు అవి మాకు తగినవి కావు అని నిఏదించలయును. అసలావిషయమునే తెలియని వారు నేను ఇతరోపాయములున్నవని తెలియనైతినని చెప్పుకొనవలయును.
ఇదియే ఈ పాశురమున వివరించబడిన స్వాపదేశార్ధము.

డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News