Saturday, April 20, 2024

తిరుప్పావై ప్రవచనాలు :


పాశురము : 15
ఆండాళ్‌ తిరువడిగలే శరణం

ఎల్లే ఇళఙ్గి ళియేతత ఇన్నముఱఙ్గుదియో
శిల్లెన్ఱళై యేన్మిన్‌ నఙ్గైమీర్‌ పోదరుగిన్ఱేన్‌
వల్లై యున్‌ కట్టురైకళ్‌ పణ్డయున్‌ వాయఱితుమ్‌
వలీర్‌ కళ్‌ నీఙ్గళే; నానేదానాయిడుగ
ఒల్లై నీపోదాయ్‌ ఉనక్కెన్న వేరుడైయ
ఎల్లారుమ్‌ పోన్దారో పోన్దార్‌ పోన్దెణ్ణిక్కొళ్‌
వల్లానైకొన్ఱానై మాత్తారై మాత్తళిక్క
వల్లానై, మాయనై ప్పాడేలో రెమ్బావాయ్‌

ఆండాళ్‌ తిరువడిగలే శరణం

శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్‌ స్వామి వారి మంగళశాసనములతో…

తాత్పర్యము :
లోనున్న గోపికకు బయటి గోపికల కు సంవాదము చెప్పబడినది.
బయటి గోపికలు:- ఓ లేత చిలుక వంటి తీయని గొంతు కలదనా! ఇంకను నిద్రించుచున్నావా!
లోని గోపిక:- పూర్ణులగు గోపికలారా! మనసున చిరాకు కలుగునట్లు పిలువవద్దు! నేను వచ్చుచున్నాను.
బయటి గోపికలు:- నీవు చాల నేర్పు కలదానవు. నీ మాటల లోని చాతుర్యము మాకు ముందే తెలుసు.
లోని గోపిక :- మీరే నేర్పు గలవారట. పోనీ నేనే కఠినురాలను.
బయటిగోపికలు :- నీకీ ప్రత్యేకత ఏమి? ఏకాంతమున ఎందుకుండెదవు? త్వరగా రమ్ము!
లోని గోపిక :- అందరూ వచ్చిరా!
బయటి గోపికలు :- వచ్చిరి. నీవు వచ్చి ఏమి లెక్కించుకొనుము.
లోని గోపిక :- సరి! నేను వచ్చి ఏమి చేయవలయును?
బయటి గోపికలు :- బలిష్ఠమగు కువలయాపీడమను ఏనుగును చంపినవాడు, శత్రువుల దర్పమును అణచినవాడు మాయవి యగు శ్రీకృష్ణుని కీర్తిని గానము చేయుటకు రమ్ము.
ఇచట చిలుకయనగా భగవత్సారూప్యము నందిన ఆచార్యుడు గోచరించును. భాగవత గోష్ఠిలో, సేవలో భగవంతుని రాక కూడా అంతరాయముగా భావించబడును. కావున చివుక్కుమనునట్లు పిలువకుడనిరి. ఆచార్య వాక్యమే శిష్యుల నుద్ధరించునది. నేనే పూర్ణారాలనని అంగీకరించుటచే భాగవతోత్తములు పలికిన దానికి చేతులు జోడించి శిరసు వంచి ఆమోదించుటే ధర్మమని బోధపడును. భాగవత గోష్ఠిని విడిచి ఒంటిగా ఉండరాదు అని ” నీ ప్రత్యేకత ఏమి” అను దానిచే సూచించబడినది. ఈ రెండే ఆచార్యప్రాప్తి హేతువులలో ముఖ్యమైనవి. ఏ ఒక్క భక్తుడు రాకున్ననూ కొరతయే అని ‘అందరూ వచ్చిరా’ అనుదానితో సూచించబడినది. ‘వచ్చి లెక్కించు కొనుము’ అను దానితో భాగవతోత్తముల దర్శనము స్పర్శనము సంభాషణము అవిచ్ఛిన్నముగా కొనసాగవలయునని కోరుట తెలియును.
కువలయాపీడము – భూ మండలమును పీడించు అహంకారము.
చాణూరముష్టికులు – కామక్రోధములు
ఈ పాశురమున తిరుమంగైయాళ్వారులను మేల్కొలుపు చున్నారు.
ఇందులో ‘ఇళంకిళియే’ అని చిలుకను సంబోధించిరి. చిలుక మనము పలికిన దానినే మరల పలుకును. వీరు కూడా నమ్మాళ్వారులు సాధించిన నాలుగు వేదముల సారమైన నాలుగు ప్రబంధములకు ఆరంగములన్నట్లుగా ఆరు ప్రబంధములలో నమ్మాళ్వారుల శ్రీ సూక్తులనే అనుసరించి అనుకరించి సాధించుయున్నారు. కావున వీరు చిలుకయే.
ఇట్లే ‘ ఉనక్కెన్న వేరుడయ’ అని అనగా వీరికున్న ప్రత్యేకత ఏమనగా వీరు సాధించిన ‘శిరియ తిరుమడల్‌’ ‘ పెరియ తిరుమడల్‌’ అను రెండు ప్రబంధముల వైలక్షణ్యమే వీరి వైలక్షణ్యము.
‘ ఎల్లారుం పోందారో’ అనునది కూడా విషయమున సరిపోవును. వీరికి ముందే ఆళ్వారులందరు అవతరించి యుండిరి . కావున ఇచట తిరుమంగ యాళ్వారులు మేల్కొల్ప బడుచున్నారనుట పూర్వాచార్యుల సిద్ధాంతము.
ఇక చచటి గురుపరంపరా వాక్యము
‘శ్రీమతే శఠకోపాయనమ:’ అనునది.
స్వామి ‘తిరువాయ్‌ మొళి’ ని నాకు సంత చెప్పినాచే పలికించిరని వీరు చెప్పుకొనియున్నారు. కావున వీరు చిలుకయే కదా. ఆళ్వారులందరిలో వీరే చిన్నవయసు కలవారు కావున వీరు ‘ ఇళంకిళియే’ కూడా. చిలుక పలుకులు అతి మధురముగా నుండును. వీరి శ్రీ సూక్తులు అతి మధురతమములు కదా- ఇంకను వీరు 16 సంవత్సరముల వరకు నిద్రించి యుండిరి. కావున ‘ ఇన్న మురంగదియో !’ అనునది కూడా వీరికి సరిపోవును. వీరు పరిపూర్ణులు కావున ‘నంగైమీర్‌’ అను సంబోధన కూడా వీరికి సరిపోవును.
16వ పాశురమున ‘నాయక నాయ్‌’ ‘కోయల్‌ కాప్పానే’ ‘తోరణవాశల్‌ కాప్పానే’ అను సంబోధనలు శ్రీవిష్వక్సేనులకు సరిపడును. పరమపదమున కోవిలను కాపాడునది వీరే కావున ‘శ్రీమతే విష్వక్సేనాయ నమ:’ అను వాక్యమును అనుసంధానము గావించుకొన వలయును.
18వ పాశురమున అమ్మవారి వైభవము చెప్పబడి నది. కావుక ‘శ్రియై నమ: అను వాక్యము బోధించబడును.
ఇక ” ముప్పత్తు మూపర్‌ ” అను పాశురమున స్వామి వైభవము చెప్పబడినది కావున ‘శ్రీధరాయ నమ:’ అను వాక్యము అనుసంధానము చేయవలయును ఇట్లు ఈ ప్రబంధము అఖిల ఆళ్వారులను అనుసంధానము చేసి గురు పరంపరాను సంధానము చేయుచున్నదని తెలియవలయును.

Advertisement

తాజా వార్తలు

Advertisement