Sunday, September 24, 2023

తిరుమల బ్రహ్మోత్సవాలు

తిరుమల బ్రహ్మోత్సవ వైభవం గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులవారి వివరణాత్మక విశ్లేషణ

- Advertisement -
   

శ్రీమన్నారాయణుడు భూలోకవాసుల పాపాలను తొలగించి తన దివ్య దర్శనంతో తరింపచేయాలనే అపారమైన కృపతో తన క్రీడాశైలమును, శేష, వాయువులకు స్పర్ధ పెట్టి భూలోకమున స్వామి పుష్కరిణి తీరమును చేర్చి భృగు మహర్షి పాద ప్రహారంతో అలిగిన లక్ష్మి భూలోకానికి రాగా ఆమెను వెతుక్కుంటూ శ్రీహరి భూలోకమునకు చేరి వకుళమాలిక సహాయంతో పద్మావతిని పరిణయమాడి ఆ క్రీడాశైలమున బ్రహ్మరుద్రాదుల ప్రార్థనతో వేంచేసి ఉండెను.

శేషాచలమనే ధర్మమును స్థాపించడానికి ఆదిశేషుడే పర్వత రూపంలో వచ్చి వృషాచల మని పేరుగాంచాడు. ‘వేం’ అంటే పాపములు. ‘కట’ అంటే నశింపచేయుట కావున ‘వేంకట’ అనగా పాపములను నశింప చేయునది అని అర్థం. ఈ పర్వతమును తలచిన, చూసిన, చేరిన, తాకిన పాపాలు నశిస్తాయి. ‘వేంకట – ఈశ్వరుడు ‘ అనగా పాపములను నశింప చేసే ప్రభువు ‘వేంకటేశ్వరుడు’ అని స్వామికి పేరు. ఇచట వరాహస్వామిని స్థలమడిగి ప్రథమ పూజ, నైవేద్యం వరాహ స్వామికి మూల్యంగా చెల్లించి అచట నివాసమేర్పరుచుకొనెను శ్రీమన్నారాయణుడు. అటు పిమ్మట బ్రహ్మ దేవుడిని పిలిచి ”ఉత్సవం కురుమే పుణ్యం బ్రహ్మన్‌ లోక పితామహా” అని కోరెను. అనగా ‘లోకపితామహుడగు ఓ బ్రహ్మా! నాకు ఉత్సవమును జరిపించమని’ స్వామి కోరగా బ్రహ్మ ఆయన ఆజ్ఞను అనుసరించి స్వయంగా ఉత్సవమును జరిపించెను. కన్యారాశి యందు సూర్యుడు ప్రవేశించిన పిదప చిత్తా నక్షత్రమందు ‘ధ్వజారోహణం’, ఉత్తరాషాఢ నక్షత్రం నాడు ‘రథోత్సవం’, శ్రవణం నాడు ‘చక్రస్నానం’, ఇలా బ్రహ్మదేవుడే స్వయముగా ప్రారంభించి జరిపిన ఉత్సవం కావున ‘బ్రహ్మోత్సవం’ అని అంటారు. అలాగే పరబ్రహ్మకు చేసిన ఉత్సవం కూడా కావున దీనిని ‘బ్రహ్మోత్సవం’ అని అంటారు. ఈనాటికి ఈ ఉత్సవం బ్రహ్మ పర్యవేక్షణలోనే జరుగుతుంది. దీనికి సంకేతంగా ఈ ఉత్సవాలు ప్రారంభమైన నాటి నుండి చివర వరకు ప్రతీ వాహనానికి ముందుగా ఒక శూన్యమైన రథాన్ని నడుపుతూ ఉంటారు. ఆ రథంలో బ్రహ్మ వేంచేసి ఉత్సవాలను పర్యవేక్షిస్తున్నాడని సంకేతం కావున దీనిని ‘బ్రహ్మరథం’ అని అంటారు. ఈ బ్రహ్మరథం ముందుండి నడిపే ఉత్సవం ‘బ్రహ్మోత్సవం’.

విజయనగర సామ్రాజ్య కాలంలో నెలకొకసారి ‘బ్రహ్మోత్సవం’ జరిపేవారు. కానీ ప్రస్తుతం సంత్సరానికొకసారి, అధిక మాసం వచ్చినపుడు రెండు సార్లు ఈ ఉత్సవాన్ని జరుపుతున్నారు. బ్రహ్మోత్సవాలకు ముందొచ్చే మంగళవారం నాడు ‘కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం’ జరుపుతారు. అనగా స్వామి వారి ఆనంద నిలయాన్ని, మొత్తం ఆలయాన్ని పరిమళ ద్రవ్యాలతో శుద్ధి చేసి అటు పిమ్మట నేత్రపర్వంగా అలంకరిస్తారు. నిత్య బ్రహ్మోత్సవం, శాంతి బ్రహ్మోత్సవం, శ్రద్ధా బ్రహ్మోత్సవం, వార్షిక బ్రహ్మోత్సవం లేదా సాలకట్ల బ్రహ్మోత్సవమే కాక దసరా నవరాత్రి సందర్భంగా నవరాత్రి బ్రహ్మోత్సవాన్ని నిర్వహిస్తారు.

అంకురారోపణ :

కన్యారాశి యందు సూర్యభగవానుడు ప్రవేశించిన తరువాత వచ్చే చిత్తా నక్షత్రంలో ధ్వజారోహణం జరుపుతారు. అంతకుముందు రోజు రాత్రి అనగా హస్తా నక్షత్రం నాడు సాయంత్రం అంకురారోపణ జరుగుతుంది. ఆనాటి సాయంత్రం విష్వక్సేనుడు తన ఇరువురు భార్యలైన జయాదేవి, సూత్రవతితో కూడి వచ్చి భూమి పూజను నిర్వహిస్తారు. ఛత్ర, చామర, మంగళవాద్య పురస ్సరముగా ఆలయంలోకి ప్రదక్షిణ మార్గంలో ప్రవేశిస్తారు. నైరుతి దిశలో ప్రదక్షిణ చేసిన పిదప భూమి పూజను గావించి ‘మృత్‌ సంగ్రహణం’ అనగా పుట్టమట్టిని ‘ఉధృతాసి వరాహేణ కృష్ణేన శతపర్వణా’ అను మంత్రముతో తీసుకొని వచ్చి ఆనాటి రాత్రి వేళ ఆ మట్టిని పాలికలలో చేర్చి దానిలో నవధాన్యాలను ఉంచుతారు. ఈ ప్రక్రియను అంకురారోపణము అంటారు. ఆనాడే భేరిపూజ చేసి స్వామి వారి ఉత్సవానికి సకల దేవతలను ఆహ్వానిస్తారు. దీనినే దేవతాహ్వానం అంటారు.

తిరుమల బ్రహ్మోత్సవాలు : ధ్వజారోహణం

అంకురారోపణ జరిగిన తర్వాత రోజు ఉదయం జరిగే ఉత్సవం ‘ధ్వజారోహణ’ ఉత్సవం. అనగా గరుడ ధ్వజాన్ని పైకెగరేస్తారు. ఈ ధ్వజారోహణకు ముందు ముద్గాన్నం అనగా పెసరపప్పుతో చేసిన పులగాన్ని (పొంగలి) గరుడునికి నివేదన చేస్తారు. ధ్వజంపై నిలిచిన గరుడుడు శ్రీవారి బ్రహ్మోత్సవానికి రావాల్సిందిగా భక్తులందరినీ ఆహ్వానిస్తాడు. ఈ గరుడుడే సకల దోషాలను, పాపాలను, అపవిత్రతను తన దృష్టితో ఎనిమిది యోజనాల దూరం అనగా 96 కిలోమీటర్ల దూరం వరకు తొలగిస్తాడు.

శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు,
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement