Sunday, October 13, 2024

తిరుమల బ్రహ్మోత్సవాలు : ముత్యాల పందిరి సేవ (ఆడియోతో…)

5. ముత్యాల పందిరి సేవ అంతరార్ధం గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజార్యుల వారి వివరణ

ముత్యమును సంస్కృతంలో ‘ముక్తముడు’ అందురు. ‘ముక్త’ అనగా ముక్తిని పొందిన వారు అని మరొక అర్థం. సంసారమనే చెరసాల నుండి బయలుబడి స్వామి సన్నిధిని చేరిన వారిని ముక్తులు అందురు.

ముత్యాల పందిరి అనగా ముత్యాలతో పందిరి, ముత్యాలకు పందిరి అని అర్ధం. పందిరి అంటే ఆధారమే కదా. తీగకు పందిరి ఆధారం, పందిరి ఉంటేనే తీగ పాకుతుంది. పందిరి పై పాకిన తీగకు కాపు ఎక్కుగా వస్తుంది. చెట్టు మూలం కింద ఉంటుంది దాని తీగ పందిరి పై పాకుతుంది. ఫలాలు కూడా పందిరి పైనే కాస్తాయి. పరమాత్మ సంసారానికి మూలం. ఆయన పైన ఉండి అవతారాలుగా కిందకు వస్తున్నాడు. లోకంలో చెట్టు మూలం కింద, తీగలు, శాఖలు పైన ఉంటాయి కాని ‘ ఊర్ధ్వమూలం అధ:శాఖం అశ్వత్ధం ప్రాహురవ్యయమ్‌’ అని గీతావచనం అనగా సంసార వృక్షానికి మూలం పైన, శాఖలు కింద ఉంటాయి. అంటే పరమాత్మ పైన ఆయన అవతారాలు కిందకి వస్తాయి. మరి ఈ అవతారాలన్నీ తీగలు ఈ తీగలు పాకడానికి పందిరి కావాలి, వారే ముక్తులు. అనగా సంసారంలో ఉండి కూడ ఆ సంసారంలో పరమాత్మనే ద ర్శించే వారంతా మరి ముక్తులే.

పరమాత్మ అవతరించేది కూడ ఈ భక్తుల కోసమే, పరమాత్మ అవతారానికి ఆధారం ముక్తులే. పరమాత్మ అవతారాలనే తీగకు ఆధారంగా ఉండే పందిరి పరమాత్మ భక్తులు. ‘పరిత్రాణాయ సాధూనాం’ అని గీతోక్తి, భక్తుల కోసమే వస్తున్నాను భక్తులలోనే ఉంటాడనన్నాడు స్వామి అంటే భక్తులే ఆధారం అన్నమాట. భక్తులను ఆధారముగా చేసుకొని భక్తుల కార్యక్రమాలను చేయడానికే పరమాత్మ అవతారము అనే సత్యాన్ని ముత్యాల పందిరి చెబుతుంది. ఈ వివరణలో భక్తులు పరమాత్మకు ఆధారం. పరమాత్మ పైన ఉండి సంసారమనే వృక్షములాగా శాఖలనే తీగలు క్రింద భక్తులపై పారుతాయని విశేషార్థం. భక్తులు క్రింద పరమాత్మ పైన ఉంటారు – అపుడు పరమాత్మకు మూలం భక్తులే. మూలం క్రింద పందిరి పైన ఉంటాయి – భక్తులు క్రింద పరమాత్మ పైన ఉంటారు. ఈ భక్తులు కర్మ, జ్ఞాన, భక్తి, ప్రపత్తి అనే తీగలతో పైన ఉన్న పరమాత్మ అనే పందిరి పైకి పారుతారు. ఇది ముత్యాల పందిరి. ఈ భావంలో పరమాత్మ ఆధారము, భక్తులు మూలము. భక్తుల సాధనములనే తీగలు పరమాత్మ పందిరిని చేరుతాయి. ఇది ముత్యాల పందిరిలోని సారసంక్షేపం.

- Advertisement -

-శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement