Sunday, October 6, 2024

తిరుమల బ్రహ్మోత్సవాలు : సింహవాహన సేవ(ఆడియోతో…)

4. సింహ వాహనం సేవ ఉపదేశం గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజార్యుల వారి వివరణ

‘భవేత్‌ వర్ణాగమాత్‌ హంస: సింహో వర్ణ విపర్యయాత్‌’ అనునది నిఘంటువు.

‘హంస’ అనేది హస అను దానికి అనుస్వారము (ం) చేర్చి హంస అయినది. అనగా నవ్వు వలే తెల్లగా చల్లగా ఉండేది హంస. ఇక సింహ అనునది వర్ణములు తలకిందులైతే ఏర్పడినది అనగా హింస త లకిందుల చేసినచో ‘సింహ’ అగును. సింహమునకు మృగరాజు అని పేరు. మృగరాజు అన్ని మృగాలను హింసించడు, తన శాసనాన్ని ఎదిరించిన వాటినే హింసిస్తాడు. ‘సత్యం వధ ధర్మం చరా’ అనగా భగవంతుని శాసనాన్ని ఉల్లంఘించే వారిని భగవానుడు హింసిస్తాడు. హిరణ ్యకశిపుడు సత్య ధర్మాలను అతిక్రమించి ప్రవర్తించినందు వలన అతనిని వధించడానికి నరసింహ రూపంలో స్వామి ఆవిర్భవించాడు. తన రూపాన్ని తీసుకుని జగత్కళ్యాణాన్ని ఆచరించారు కావున సేవ చేసే భాగ్యాన్ని ప్ర సాదించమని సింహము ప్రార్థించగా ఆ సింహాన్ని వాహనంగా చేసుకున్నాడు స్వామి. నరసింహుడు ఆర్తత్రాణ పారాయణుండు అని విశేషమైన బిరుదు.
ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడితో హింసించ బడుతుంటే ప్రతి బాధలోనూ స్వామే సాక్షాత్కరించాడు అందుకే ప్రహ్లాదుడు నారాయణ నామ స్మరణ తోటే చిరు నవ్వులు చిందిస్తూ తండ్రికి కొరక రాని కొయ్యగా మారాడు. ఎవరి బలంతో నన్ను ఎదురిస్తున్నావని హిరణ్యకశిపుడు ప్రశ్నించగా ‘బలయుతులకు దుర్భలులకు బలమెవ్వరు నీకు నాకు బ్రహ్మాదులుకు’ అని ప్రహ్లాదుడు బదులిచ్చెను. అనగా బలవంతులకైనా, బలహీనులకైనా, బ్రహ్మాది దేవతలకైనా బలము ఆ శ్రీమన్నారాయణుడే అని చెప్పాడు. బలమును కొలిచేటపుడు బలవంతులను సింహబలుడు అని అంటారు. అంటే బలమునకు పరాకాష్ట సింహం. సింహం పరాక్రమము, శౌర్యము ప్రస్ఫుటంగా కనబడతాయి. దుష్టశిక్షణ, శిష్ట రక్షణ చేసేవాడు నరసింహుడు.

హింసించే తత్త్వాన్ని తన అదుపులో పెట్టుకోవడం సింహ వాహనానికి సంకేతం. సింహ వాహనం పై ఊరేగుతున్న మలయప్ప స్వామిని సేవించుకొనే భక్తులకు ధర్మం పట్ల దీక్ష, అధర్మాన్ని నిర్మూలించగల క్రౌర్యం లభిస్తాయని సంకేతం. గోదాదేవి తిరుప్పావైలో కూడ ‘మారి మల ముళంగిలౌ’ అను పాశురంలో నరసింహస్వామి వైభవాన్ని, సింహ ప్రతాపాన్ని, ప్రకాశాన్ని వర్ణించింది. అధర్మాన్ని అంతం చేయడం, అన్యాయాన్ని తుద ముట్టించడం దైవ స్వభావం. అందుకే భారతీయ సాంప్రదాయంలో సింహం, పెద్దపులి మొదలగు క్రూర మృగాలు దైవ రూపానికి వాహనాలుగా ఆరాధించ బడుతున్నాయి. భగవంతుడు ధర్మ స్వరూపుడు, సత్య స్వరూపుడు. ధర్మ, సత్యాలకు సేవ చేసేవి మృగములైనా అవి దైవాంశ గలవే, ఆరాధించ దగినవే అని సింహ వాహన ఉపదేశం.

Advertisement

తాజా వార్తలు

Advertisement