Friday, December 6, 2024

తిరుప్పావై – పాశురము – 30

ఆండాళ్‌ తిరువడిగలే శరణం

వఙ్గక్కడల్‌ కడైన్ద మాదవనై క్కేశవనై
త్తిఙ్గళ్‌ తిరుముగత్తు చ్చేయిళైయార్‌ శై న్ఱిఱౖఞ్జి
అఙ్గప్పఱౖకొణ్డవాత్తై, యణిపుదైవ
పెఙ్గమలత్తణ్డరియల్‌ పట్టర్‌పిరాన్‌ కోదైశొన్న
శఙ్గత్తమిళ్‌ మాలై ముప్పదుమ్‌ తప్పామే
ఇఞ్గిప్పరిశురై ప్పా రీరిరణ్డు మాల్వరైత్తోళ్‌
శెఙ్గణ్‌ తిరుముగత్తు చ్చెల్వ త్తిమాలాల్‌
ఎఙ్గుమ్‌ తిరువళుమ్‌ పెత్తిన్బుఱువ రెమ్బావాయ్‌.

ఆండాళ్‌ తిరువడిగలే శరణం

శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్‌ స్వామి వారి మంగళాశాసనములతో…

తాత్పర్యము :
” చెక్కతో చేయబడిన ఓడలు గల పాలసముద్రమును మధించి దేవతలకు అమృతమును ప్రసాదించినవాడు, బ్రహ్మరుద్రులకు ప్రభువు అగు శ్రీమన్నారాయణుని, పూర్ణచంద్రుని పోలిన అందమైన ముఖము, చక్కని ఆభరణములు ధరించిన గోపికలు వె ళ్ళి మంగళా శాసనము గావించి, గోకులమునందు పరయను సాకుతో కైంకర్యము పొందిన విధానమును, భూమండలమునకు అలంకారముగా నున్న శ్రీవిల్లి బుత్తూరులో నవతరించిన చక్కని చల్లనితామర పూసలతో గూర్చబడిన మాలలను ధరించిన బ్రాహ్మణోత్తములగు పెరియాళ్వారులు(విష్ణు చిత్తుల) పుత్రిక యగు ఆండాలుతల్లి సాయించినది. గోపికలు సంఘములుగా చేరి అనుభవించినది. ప్రబంధముగా ద్రవిడ భాషలో మాలారూపముగా నున్న 30 పాశురమునులను ఒక్కదానిని కూడా వదలక అన్ని పాశురములను ఈ సంసారమున అనుసంధించువారు, గొప్ప పర్వతముల వలె నున్న నాలుగు భుజములు, ఆశ్రితుల విషయమున తనకు గల వాత్సల్యముతో ఎర్రబడిన కన్నుల, అందమైన ముఖము, ఉభయ విభూతులకు అధినాయకత్వము గల శ్రియ: పతిచే దృష్టాదృష్టములు విషయములలో సాటిలేని కృపను బడసి, బ్రహ్మానందము గలవారుగా నుందురు. ”
మనము పొందవలసిన ముఖ్యమగు పురుషార్థము మోక్షము ఇదియే అమృతము. శాస్త్రమే మహాసముద్రము. శాస్త్రమును మధించినవారికే మోక్ష స ్వరూపము తెలియును. తెలిసినవారికే లభించును. మన బుద్ధియే మందరము. అనుకూల ప్రతికూల శక్తులు దైవీ, ఆసురీ సంపదయే దేవదానవులు. మందరమును గొనివచ్చి సంపదయే దేవదానవులు. మందరమును గొనివచ్చి సముద్రమున వేయించినది స్వామియే. గరుడునితో వేయించెను. ‘దదామి బుద్ధియోగం తం’ అని, ‘మత్తస్మృతిర్‌జ్ఞాన పపోహనం చ’ అని చెప్పియుండుటతో స్వామియే బుద్ధిని ప్రసాదించవలయును అని, అది ఆచార్య ముఖత: ఇప్పించును కావున ఆచార్యుడనగా గ రుడుడు కావున ఆచార్యుని ద్వారా స్వామి బుద్ధి నిచ్చును అని మందర పర్వత వృత్తాంతము తెలుపుచున్నది.
పూర్వాచార్యులు ఇట్లు వ్యాఖ్యానము గావించిరి. భగవత్సంకల్పము మందరము. భగవత్కృప తాడు, భగవత్కటాక్షము చేతులు. పిరాట్టి(లక్ష్మి) ఆత్మ వస్తువు. ఇట్లు పరమాత్మ తన సంకల్పమును మందరమునకు కృపయను తాడుకట్టి, కటాక్షములనెడి, చేతులతో సంసార సాగరమును మధించి తనకు ప్రియదమమగు ఆత్మను పొందెను. చేతనులు పరమాత్మకు కౌస్తుభమణి వంటివారు. తాము ఆచరించిన పుణ్య పాపముల వలన సంసార సాగరమున పడిరి. అట్లు పడిన వారు గత్యంతరమును గానక అలమటిం చు చుండగా భగవంతుని నిర్హేతుక భగవత్ప్రాప్తికి అఱ్ఱులు చాచుచుండెను. ఇదియే సముద్రఘోష. పరదు:ఖము సహించలేని పరమాత్మకు ఈ ఘోషతో కృపకలుగును. ఈ కృపయే భగవత్సంకల్పమును త్రిప్పును. అట్లు వారి హృదయమునందు జ్ఞానజ్యోతిని వెలిగించి యజ్ఞానాంధకారమును తొలగించు జీవులు తమను పొందుటకుపకరించు భక్తియోగమున తానే అనుగ్రహించును. ఇదియే అమృత మధనము. అట్లు భగవత్ప్రాప్తి యనెడి అమృతము లభించును. ఇదియే మోక్షము. ఇట్లు మోక్షమును ప్రసాదించమని పరమాత్మను ప్రార్థించుట, ఈ తి రుప్పావు వ్రతము నాచరించిన వారికి ఈ అమృతము లభించునని ఫలశ్రుతిగా అమ్మవారు అనుగ్రహించుచున్నారు.
వేదము సముద్ర జలమువలె స్వతస్సిద్ధమైనది. తిరుప్పావై ప్రబంధము గోదాదేవి ముఖారవిందము నుండి వెలువడినది కావు మేఘ జలము వంటిది. మేఘము సముద్రము నుండి ఉప్పునీటిని తీసుకొని అత్యంత మధురజలమును మనకు కురియుచుండును. ఈ గోదామేఘము సకలోపనిషత్సిద్ధమగు అర్థములను గ్రహించి సకల జనులకు అర్థమగు రీతిని సరళ శైలిలో అమృతోపమానముగా వర్ణించినది. ఇదియే తిరుప్పావు ప్రబందవైభవము.
ఈ ముప్పది పాశురములు తప్పక అనుసంధానము చేసిన తెలియనగు అంతరార్థమిది.
1. పరమాత్మయందు మనకు అభిముఖ్యమును కలిగించు బ్రాహ్మీ ముహూర్త ప్రభావమును తప్పక తెలియవలయును.
2. చేయవలసిన దానిని చేయకూడని దానిని తెలియవలయును.
3. ‘ లోకాస్సమస్తా: సుఖినో భవంతు’ అని సకల లోక కళ్యాణమును త్రికరణశుద్ధిగా కాంక్షించుచుండవలయును.
4. జ్ఞానులగు పరమ భాగవతోత్తములు దేవతలను కూడా శాపించగలరని తెలియవలయును.
5. భగవంతని ఉపాయముగా ఆశ్రయించిన క్షణము ననే సకల పాపనివృత్తి జరుగును అని తెలియవలయును.
6. భగవద్విషయమున ప్రవేశించి కూడ కొరత తీరని వారైనను
7. భగవద్విషయమున ప్రవేశించి కూడ కొరత తీరని వారైనను
8. కీర్తిని ప్రధానముగా కోరువారైనను
9. విడువదగినది కొద్దిగా మాత్రమే తెలిసిన వారైనను
10. నిరంతరానుభవమునునన్న వారైనను
11. భాగవతవంశ సంబంధము గలవారిని
12. కైంకర్య నిష్ఠులతో, సంబంధము గలవారిని
13. స్వరూపమును, జ్ఞానములోని వైలక్షణ్యాను సంధాన పూర్వకముగా కార్యశూన్యులుగా నున్నవారిని
14. భక్తిపరాకాష్టచే కలత చెందుచున్న వారిని
15. భాగవత పారంతంత్య్ర నిష్ఠనే ముఖ్యముగా పాలించు వారైనను, ఇట్టి వారందరూ మనకు ప్రాప్యులే అను దృఢ నిశ్చయము లోపించరాదు. ఇవి అన్నియూ తెలియవలయును.
16. భగవంతుని సమీపించు విధానము తెలియవలయును.
17. 18,19,20 పాశురములలో పురాషకారభూతుల స్వరూప స్వభావములను బాగుగా తెలిసి వారి విషయమున ప్రవర్తించు విధిని తెలియవలయును.
21. భగవంతుని కళ్యాణగుణములను తెలిసి ఆనంద పారవశ్యమును చెందవలయును.
22. అభిమానమును పూర్తిగా విడిచి భగవత్కటాక్షైక పాత్రులు కావలయును. ఆ కటాక్షమే తారకముగా భావించవలయును.
23. భగవంతుని మాకు అభిముఖుడవు కావలసినదిగా ప్రార్థించవలయును.
24. మంగళాశాసన తత్పరులు కావలయును.
25. మేము వచ్చినది నిన్ను ప్రార్థించుటకే అని తెలియునట్లు నైచ్యమును కనబరచవలయును.
26. మోక్షాపేక్షయున్నపుడు కావలసిన వానిని కోరవ లయును.
27. ముక్తుడైన యవస్థలో అనుభవించదగిన పదార్థము లను కోరవలయును.
28. ఆ ఫలమును పొందుటకు మాకు గత్యంతరము లేదని ఎరిగించవలయును.
29. నిత్యకైంకర్యమునందు తమకున్న ననన్యాపేక్షను విడువకుండా ఉండవ లయును.
30. ఈ స్థితిని పొందిన భాగవతోత్తముల శ్రీసూక్తి ఆనందదాయకముగా భావించుచు నుండవలయును.
ఇవి 30 దినముల ప్రణాళిక. లేదా 30 పాశరముల భావము. ఈ వ్రతమునకు అంతరార్థము పరమార్థము కూడా అందుకే 30 పాశురములను తప్పకుండా అనుసంధానమును చేయవలయును. అనగా ఈ 30లో ఈ ఒక్క సోపానమును తప్పిననూ వ్రత భంగమైనట్టే. కావున ఈ విధానమును అనుసరించినచో స్వామి అనుగ్రహమును పొందెదము. అని ఫలశ్రుతిగా పేర్కొనబడినది.
ఇట్లు అన్ని ఫలములు సిద్ధించుటచే ఈ ప్రబంధమును అధ్యయమును చేసినవారు ఆనంద నిర్భరులగుదురు ఈ లోకములో నుండు సంసారులందరి కంటే విశిష్టమగు స్థితి ననుభవింతురు. ఇక ఈ లోకమును విడిచి పరమపదమునకు వెళ్ళినచో, సర్వకాలములలో భగవత్సంశ్లేషమను చెంది పరమానందమును పొందెదరు. శ్రీమన్నారాయణ కృపాపాత్రులై ఆనందముననుభవించుటకు, సాధనాంతరములను విడిచి ఈ వ్రతమును ఆచరించుట ఈ ప్రబంధము నధ్యయనము చేయుటయే కావలసినది.

- Advertisement -

డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు

Advertisement

తాజా వార్తలు

Advertisement