Monday, December 9, 2024

తిరుప్పావై : పాశురము – 26

ఆండాళ్‌ తిరువడిగలే శరణం

మాలే! మణివణ్ణా! మురళి నిరాడువాన్‌;
మేలైయార్‌ శెయ్వనగళ్‌;వేణ్డువనకేట్టియల్‌;
ఞాలత్తై యెల్లామ్‌ నడుఙ్గ మురల్వన
పాలన్న వణ్ణత్తుఉన్‌ పాఙ్జశన్నియమే
పాల్వన శఙ్గఙ్గళ్‌, పోయ్‌ప్పాడు డైయనవే,
శాలప్పెరుమ్‌ పఱౖయే,పల్లాణ్డిశైప్పారే,
కోలవిళక్కే, కొడియే, వితానమే,
ఆలినిలై యాయ్‌! అరుళేలో రెమ్బావాయ్‌.

ఆండాళ్‌ తిరువడిగలే శరణం

శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్‌ స్వామి వారి మంగళాశాసనములతో…

తాత్పర్యము :
”ఆశ్రిత వ్యామోహము కలవాడా! ఇంద్రనీలమణిని పోలిన కాంతి స్వభావము కలవాడా! చిన్న మర్రి యాకుపై పరుండి, అఘటిత ఘటనా సామర్థ్యము కలవాడా! మేము మార్గశీర్ష స్నానమును చేయగోరి ఆ వ్రతమునకు కావలసిన పరికరములను కోరి వచ్చితిమి. ఈ వ్రతమును పూర్వులు ఆచరించి యున్నారు. నీవు విన్నచో కావలసిన పరికరములను తెలిపెదము.
ఈ భూమండలమంతయు వణుకునట్లు శబ్దము చేయు పాలవలె తెల్లనైన నీ పాంచజన్య శంఖమును బోలిన శంఖములు కావలయును.విశాలమగు చాలా పెద్ద పర కావలయును. మంగళ గానము చేయు భాగవతులు కావలయును. మంగళ దీపములు కావలయును. ధ్వజములు కావలయును. మేలుకట్లు కావలయును. దయచేసి ప్రసాదింపుము. ”
శ్రీకృష్ణునకు మణికి పోలిక చెప్పబడినది.
మణి ఉన్నవారు ఉన్నవారు. మణి లేని వారు లేనివారిగ పరిగణింతురు. భగవంతుడు కలవాడనువారు ఉన్నవారు. భగవంతుడు లేడనువారు లేనివారుగ నుందురు. మణి ఉన్నవారిని అందరూ గౌరవింతురు. భగవంతుని భక్తునికి అందరూ దాసోహమందురు. గొప్ప వారు ధరింతురు. చిన్నవారు అమ్ముకొని బ్రతుకుదురు. భగవంతుని అనుభవించి ఆనందించు వారు భగవంతుని నలుగురికి తెలిపి ధనము సంపాదించు వారుందురు.
ఇచట స్నానమనగా భగవద్గుణాశ్లేషమే అని తెలియవలయును. ఇదియూ ప్రపన్నులు ఆచరించు కైంకర్యముగా తెలియవలయును. అనగా కర్మలను త్యజించక ఫలసంగ కర్త్తత్వ త్యాగపూర్వకముగా ఆచరించుటే ఈ స్నానము అని అభిప్రాయము.
శిష్టాచారానుసరణము అనగా భగవద్భాగవతా చర్యాజ్ఞానుసరణమును సూచించును.
ఇచటశంఖమనగా ప్రణవము.ప్రణవము భగవచ్చే షత్వమును బోధించును. కైంకర్యము లేనిదే శేషత్వము నిలువదు. కావున ప్రణవ శబ్దమునకు కైంకర్యము అర్థము. ఆ కైంకర్యములు పలు విధములుగా నుండుటే పలు శంఖములు అడుగుటలో ఓ తాత్పర్యము.
ఇక చాలా పెద్ద పర అనగా అష్టాక్షరిలోని ‘నమ:’ పదము. ఇచట పెద్ద చాలా పెద్ద యనుటలో పరిణామము కాక అర్ధ బోధనలో పెద్దతనము. ఇచట ప్రణవము కన్ననూ నారాయణ పదము కన్నను చాలా అర్ధమును బోధించుచున్నది. స్వరూపములోని పురుషార్థములోని దోషమును పోగొట్టునది నమ:పదమే కావున చాలా పెద్ద పర యనగా నమ:పదమని తెలియవలయును. కైంకర్యములోని ఆనందము శ్రియ:పతికే కాని తనకు కాదని బోధించి వాని దోషమును తొలగించును. పండులోని గుణములు భోక్తకు ఆనందము నిచ్చును కాని పండుకు ఈయజాలవు కదా. నమ: పదము ఇటు ప్రణవము లోను అటు నారాయణ పదములోను అన్వయిం చునది కావున చాలా పెద్దది అని అభిప్రాయము.
‘ ఇక పల్లాండి శైప్పారే’ అనగా మంగళమును పాడువారు. అనగా పరమ భాగవతోత్తములతో సహవాసము. అనగా సత్సంగతి.సత్సాంత్యమే పురుషార్ధ సీమను చేర్చునది. పరమాత్మను సేవించువారికి కార్యసిద్ధి కలుగకపోవచ్చును కానీ భక్తులను సేవించు వారికి తప్పక కార్యసిద్ధి కలుగును.
‘కోలవిలక్కే’ అందమైన మంగళదీపము. ఇతర పదార్థముల యధార్థ స్వరూపమును ప్రకాశింప చేయునది దీపము. జీవుని భగవచ్ఛేషత్వము మంగళ దీపము. దీని సౌందర్యమనగా భాగవతశేషత్వ జ్ఞానమని తెలియజేయుటే. ఈ భాగవత శేషత్వము శ్రీవైష్ణవ సర్వస్వమగు అష్టాక్షరీ మంత్రములోని ప్రణవ నమ: నారాయణ పదములతో తెలియజేయు అత్యంత రహస్య సర్వస్వముగా పేర్కొనవచ్చును.
ఇక ‘ కొడియే’ అనగా ధ్వజము. ధ్వజము అనగా సూచకము కదా. శేషత్వమునకు సూచకము కైంకర్యము కావున ధ్వజమనగా కైంకర్యమని భావము. ఈ కైంకర్యము ప్రార్థించిననే లభించును. శ్రియ:పతి అంగీకరించినపుడే ఇది పురుషార్ధ మగును.
ఇక ‘వితానము ‘ అనగా చాందినీ. అనగా దారిలో నడుచువారికి పైనుండి మంచు మొదలగునవి పడకుండా రక్షగా నుండునది.
‘కోడి’ యనగా కైంకర్యమనినాము కదా. కైంకర్యము వలన కలుగు ఆనందము తనది అను బుద్ధి యుండరాదు. అనగా భోక్త త్వబుద్ధి నివృత్తి. ఇదియే వితానము.
ఇట్లు అనన్యార్హ శేషత్వజ్ఞానము, పారతంత్య్ర జ్ఞానము,భాగవత సహవాసము, భాగవత శేషత్వ జ్ఞానము భగవత్కైంకర్యము, కైంకర్యమున భోక్తృత్వబుద్ధి నివృత్తి కావలయును. అని కోరిరని అభిప్రాయము.

- Advertisement -

డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు

Advertisement

తాజా వార్తలు

Advertisement