Friday, December 6, 2024

తిరుప్పావై : పాశురము : 25

ఆండాళ్‌ తిరువడిగలే శరణం

ఒరుత్తి మగునాయ్‌ పిఱన్దు, ఓరిరవిల్‌
ఒరుత్తి మగనాయ్‌ ఒళిత్తు వళర,
తరిక్కిలానాగి త్తాన్‌ తీఙ్గు నినైన్ద
కరుత్తై ప్పిళైప్పిత్తు క ఞ్జన్‌ వయిత్తిల్‌
నెరుప్పెన్న నిన్ఱ నెడు మాలే! యున్నై
అరుత్తిత్తు వన్దోమ్‌; పఱౖ తరుతియాకిల్‌,
తిరుత్తక్కశెల్వముమ్‌ కేవకముమ్‌ యామ్పాడి
వరుత్తముమ్‌ తీర్‌న్దు మగిళ్‌న్దేలో రెమ్బావాయ్‌

ఆండాళ్‌ తిరువడిగలే శరణం

శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్‌ స్వామి వారి మంగళాశాసనములతో…

తాత్పర్యము :
శ్రీకృష్ణా! భగవానుడే తనకు కుమారునిగా కావలయునని కోరి, శంఖచక్రగదాధారిగా భగవానునే కుమారునిగా పొందగలిగిన సాటిలేని తల్లి దేవకికి కుమారుడిగా జన్మించి,శ్రీకృష్ణుని లీలలను పరిపూర్ణముగా అనుభవించి కట్టను కొట్టును భగవానుని వశమొనర్చుకొనిన, అద్వితీయ వైభవము కల యశోదకు ఆ రాత్రియే కుమారుడవై దాగి పెరిగినవాడా! ఈ వృత్తాంతమును నారదుని వలన విని కంసుడు రాబోవు ననర్ధము నెరుంగక సహించలేనివాడై ఏదో విధముగా నిన్ను చంపవలయునని చెడు భావముతో నున్న కంసుని అభిప్రాయమును వ్యర్థ పుచ్చి,వాని కడుపులో చిచ్చుగా నిలిచి, నిన్ను చంపవలెనన్న వానిని నీవే చంపిన ఆశ్రిత వ్యామోహశాలి! నిన్నే కోరి వచ్చితిమి.మా సంకల్పము నెరవేర్చదచినచో శ్రీలక్ష్మీదేవి యాశపడదగిన సంపదను,ఆ సంపదను సార్ధక పరచగ ల నీ పరాక్రమమును ఆనందపరవశులమై పాడి, అలసట తీరి ఆనదించు నట్లు అనుగ్రహించుము. ”
శ్రీకృష్ణునకు ఇద్దరు తల్లులుండునట్లు మనకు కూడా ప్రధానమగు మంత్రములు రెండు ‘నారాయణాష్టాక్షరి’ ‘వాసుదేవ ద్వాదశాక్షరి’ ఇందు నారాయణష్టాక్షరిలో నారాయణ తత్త్వము స్పష్టముగా ప్రకాశించును. వాసుదేవ శబ్దములో సర్వ వ్యాపకత్వము గూఢముగా నున్నది. కావున దేవకి అనగా నారాయణాష్టాక్షరి. యశోద అనగా వాసుదేవ ద్వాదశాక్షరి.
ఒకటి గాయత్రి మంత్రము. ఇంకొకటి నారాయణాష్టాక్షరి అని కూడా మతము కలదు. అపుడు గాయత్రిలో అనగా సూర్యమండలమున శ్రీమన్నారాయణుడు శంఖచక్రధారియై ప్రత్యక్షముగా కనపడును కాన దేవకీదేవి గాయత్రీ మంత్రమని, నారాయణ శబ్దములో’నార’ ‘అయన’ శబ్దార్ధములు తెలిసినవే బోదపడును. కాన నారాయణాష్టాక్షరి యశోదయని తెలియ వలయును.
ఇచట కంసుడనగా అహంకారము. అహంకారము తనకంటే ఇంకొక పరమాత్మ యున్నాడని విని సహించలేదు.అంతేకాదు శరీరము కంటే విడిగా ఆత్మ ఉన్నదని కూడా అంగీకరించని దేహాత్మాభిమానమే అహంకారము. ఈ అహం కారమును భగవంతుడే పోగొట్టవలయును. దానిలో తాను చేరును.అది కూడా అగ్ని వలె. అనగా అహం ధ్వంసమై దాసోహం అగును. ఇదియే నిప్పులా నిలుచుట.

- Advertisement -

డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు

Advertisement

తాజా వార్తలు

Advertisement