Friday, March 29, 2024

ఉత్తమ సాధనా మార్గం…

యేతు సర్వాణి కర్మాణి మయి సన్స్యస్య మత్పరా:
అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే

తేషామహం సముద్ధర్తా మృత్యు సంసార సాగరాత్‌
భవామి నచిరాత్‌ పార్ధ మయ్యావేశిత చేతసాం

(భగవద్గీత 12వ అధ్యాయం (భక్తియోగం)లో 6, 7వ శ్లోకాలు)

ఓఅర్జునా, సర్వ కర్మలను నాకే అర్పించి, ఇతర చింత నలు లేక నాకు భక్తులై, మనస్సును నా యందు లగ్నం చేసి నన్నే సదా ధ్యానిస్తూ, నా భక్తియుత సేవలో నన్ను అర్చిం చే వారిని శ్రీఘ్రమే జనన, మరణాలనే సంసార సాగరం నుం డి ఉద్ధరిస్తాను అని పై శ్లోకం భావం.
భౌతిక ప్రపంచం మాయలో పడిపోకుండా భగవంతుని అనుగ్రహంతో అతి దుర్లభమైన ఆ సంసార సాగరాన్ని దాటే అతి సులువైన ఉపాయాన్ని భగవంతుడు ఈ శ్లోకాల ద్వారా తెలియజేశారు. కలియుగపు మాయ, ప్రలోభాలు దృష్టిలో వుంచుకొని, కష్టసాధ్యమైన ఆచరణా మార్గం కాకుండా కుల, మత, వర్గ, వర్ణ, జాతి, పేదా, గొప్ప అనే బేధాలు లేకుండా అందరూ ఆచరించి శ్రీఘ్రమే తరించగల గొప్ప ఉపాయంగా ఆధ్యాత్మికవేత్తలు భావిస్తారు. భగవంతుని సేవయే మానవుల ప్రథమ కర్తవ్యం. ఈ సేవను మనం నిర్లక్ష్యం చేస్తే మనల్ని భ్రాంతిలో పడేసి అధమ పాతాళా నికి తొక్కివేసే మాయను సేవించాల్సి వస్తుందని ప్రధమంగా తెలుసుకోవాలి. భక్తి యోగం చేతనే భగవంతుని సంపూర్ణ తత్వం అవగతం అవుతుంది కాబట్టి మానవులు భక్తి మార్గంలో పయనించడా నికి కంకణం కట్టుకోవాలి. భగవంతుని పొందే నిమిత్తం భక్తి యోగంలో సూచించబడిన సాధనా మార్గం ఈవిధంగా వుంది. ముందుగా ఇతర వ్యర్ధమైన ఆలోచనలు కట్టిపెట్టి భగవంతుని యందే మనస్సు పూర్తిగా లగ్నం చేయాలి. ఇందుకు ధ్యానం, ప్రాణాయామం, యోగా భ్యాసం ఎంతగానో ఉపకరిస్తాయి. మనస్సులో వ్యర్ధమైన ఆలో చనలు ప్రవేశించినప్పుడల్లా భగవంతుని నామం స్మరించడం లేదా మనకు ఇష్టమైన దేవతా రూపాన్ని ఉపాసన చేయడం అల వాటు చేసుకుంటే, ఈ సాధన ద్వారా వచ్చే ఆధ్యాత్మిక శక్తికి చెడు ఆలోచనలు దూరంగా పారిపోవడం ఖాయం. మనం చేసే కర్మలన్నింటినీ ఫలితం ఆశించకుండా భగ వంతునికే సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు అని అర్పించాలి. అను క్షణం భగవంతుని కరుణ కోసం, ఆయనను సంతృప్తి పరచ డమే మన లక్ష్యం కావాలి. భగవంతుని ప్రియం చేకూర్చడమే లక్ష్యం అయినప్పుడు ఎటువంటి త్యాగాలకైనా మానసికంగా సిద్ధం కావాలి.
కష్టనష్టాలు ఎదురైనప్పుడు ఎటువంటి సంశయాలకు తావివ్వక, సంపూర్ణ శరణాగతి భావంతో ప్రార్థన మార్గం ద్వారా భగవంతుడినే శరణు వేడుకోవడం అత్యుత్తమం. ప్రతి ఒక్కరు అనుక్షణం భగవంతుని నామం జపించడం సాధనా అలవాటుగా చేసుకోవాలి. అలా కొంతకాలానికి అప్రయత్నం గానే భగవంతుని వైపు మనస్సు మరలుతుంది.
ఈ విధమైన సాధనను చేసి ఉచ్వాస, నిశ్వాసాలులో భగ వంతుని నామం జ్ఞ్ఞప్తిలో వుంచుకోగలిగిననాడు శుద్ధ భక్తుడని, వారిని శ్రీఘ్రమే భవసాగరం నుండి ఉద్ధరిస్తానని గీత సాక్షిగా ప్రమాణం చేసి వున్నాడు ఆ భగవానుడు. అందుకే కర్మ, జ్ఞాన యోగాల కంటే భవసాగరం దాటేందుకు భక్తి యోగమే ఈ కలి యుగంలో ఉత్తమమైన మార్గమని ఆధ్యాత్మికవేత్తలు చెబుతుం టారు. అందరూ దాన్ని ఆచరించగలగాలి.

  • సిహెచ్‌.ప్రతాప్‌ 9136827102
Advertisement

తాజా వార్తలు

Advertisement