Thursday, March 28, 2024

ధర్మం మర్మం (ఆడియోతో..)

శ్రీమన్నారాయణుని అవతారాలలోని ఆంతర్యం
శ్రీమన్నారాయణుడు జగత్తును సృష్టించాలి అనుకున్నప్పుడు రజోగుణాన్ని తీసుకొని బ్రహ్మ అన్న నామంతో సృష్టి చేస్తాడు. రక్షించాలి అనుకున్నప్పుడు సత్వగుణాన్ని తీసుకొని విష్ణువు అన్న నామంతో రక్షిస్తాడు. సంహరించాలి అనుకున్నప్పుడు తమోగుణాన్ని తీసుకొని రుద్ర నామం తో సంహరిస్తాడు. సూక్ష్మ దృష్టితో చూస్తే ఈ మూడు రక్షణకే. అవసరమైనపుడు సృష్టించడం, అవసరం లేని దాన్ని తప్పించడం, ఈ రెండూ రక్షణలో భాగమే. క్షీరసాగరమున ఆదిశేషునిపై పడుకుని ఉన్న స్వామి ” సహస్ర శీర్ష పురుష: సహస్రాక్ష: సహస్రపాత్‌” అని చెప్పినట్టుగా పరమాత్మ విశ్వరూపమే అన్ని అవతారాలకు ఆధారం. స్వామి అవతారాలు అనంతాలైనా దశావతారులు ప్రసిద్ధం కాగా ప్రధానంగా పురాణాల్లో పేర్కొనబడినవి 24 అవతారాలు. ఈ అవతారాల వైశిష్ట్యం, వైభవం, విశేషాలు, ధర్మ సూక్ష్మాలు తెలుసుకోదగినవి.

ఈరోజు బుద్ధావతార ఆవిర్భావంపై శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి విశ్లేషణ

బుద్ధావతారం
ఒకనాటి కాలంలో రాక్షసులు, దానవులు మానవులుగా పుట్టి యజ్ఞ యాగాదులను, దాన ధర్మాలను ఆచరిస్తూ రాత్రి పూట పరుల ధనాన్ని హరిస్తూ, పరస్త్రీలను చెరపడుతూ ఆధర్మాన్ని అంతటా వ్యాపింప చేసారు. అలాంటి వారిని శిక్షించాలంటే వారి ధర్మం వారికి కవచంగా కాపాడుతున్నది. అందుకే స్వామి బుద్ధునిగా అవతరించి యజ్ఞ యాగాదులు, విగ్రహారాధన చేయరాదని అందులో హింస ఉందని ”అహింస పరమో ధర్మ:” అని వేద వాక్యాన్ని కాదని వారంద రిని మోహింపచేసాడు. అందుకే వారందరూ యజ్ఞ యాగాదులను విగ్రహారాధన, వంటి ధర్మ కార్యాలను నిస్సందేహంగా విడిచి పెట్టారు. ధర్మాన్ని విడిచిన అధర్మాత్ములను శిక్షించి స్వామి లోకంలో ధర్మాన్ని కాపాడాడు. ఇలా బుద్ధావతారం కూడ ధర్మరక్షణకై ఏర్పడినదే. శ్రీమాన్‌ డాక్టర్‌ కండాడై రామానుజాచార్యులు…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement