Friday, April 26, 2024

శ్రీ కాళహస్తీశ్వర శతకం – జ్ఞాన ప్రసూనం – 55

  1. ఆలుం బిడ్డలు, మిత్రులున్, హితులు నిష్టార్ధంబు లీ నేర్తురే
    వేళన్ వారి భజింప జాలి( బడకావిర్భూతమోదంబునన్
    గాలం బెల్ల సుఖంబునీకు ని(క భక్తశ్రేణిరక్షింపకీ
    శ్రీ లెవ్వారికి( గూడ బెట్టెదవయాశ్రీకాళహస్తీశ్వరా!

ప్రతిపదార్థం:
శ్రీకాళహస్తీశ్వరా!, ఏవేళన్ = ఎప్పుడును, వారి = వారిని, భజింపన్ = సేవిస్తే, ఆలున్ = నీ భార్యయు, అంటే పార్వతీదేవియు, బిడ్డలు = కుమారులైన గణపతి, కుమారస్వామియు, మిత్రులున్ = నీ మేలుకోరేవారైన విష్ణువు మొదలైనవారు, ఇష్ట + అర్థంబులు = కోరిన సంపదలు, ఈ నేర్తురు= ఇవ్వ గలరు. జాలిన్ + పడక = దీనావస్థ చెందక, ఆవిర్భూత మోదంబునన్ = కలిగిన ఆనందంతో, నీకున్ = నీకు, కాలంబు + ఎల్ల = ఎల్లకాలం / కలకాలం, సుఖము = సుఖం అయి ఉన్నది. ఇక = ఇంక, భక్తశ్రేణిన్ = భక్తుల సముదాయాన్ని, రక్షింపక = కాపాడక, ఆ శ్రీలు = ఆ సంపదలు, ఎవ్వారికిన్ = ఎవరి కొరకని, కూడన్ + పెట్టెదవు + అయా = దాచిపెడుతున్నావయ్యా?

తాత్పర్యం:
శ్రీకాళహస్తీశ్వరా! తమను చక్కగా చూడటం చేత నీ భార్య అయిన పార్వతీదేవి, బిడ్డలయిన గణపతి, కుమారస్వాములు, మిత్రులైన కుబేరాదులు, నీ మేలుకోరేవారైన విష్ణువు మొదలైనవారు నీవు కోరిన సంపద లిస్తారు. ఏ మాత్రం కష్టపడకుండానే నీకు ఎల్లకాలం సుఖాలతో ఆనందదాయకంగా ఉంటుంది. ఆ సంపదలను ఇచ్చి భక్తులని కాపాడకుండా వాటిని ఎవరి కోసం దాచి ఉంచావు?

విశేషం: సంపదల కోసం బాధపడటం శివుడికి తెలియదు. కష్టపడకుండానే అందరు ఇస్తున్నారు కదా! ఈశ్వర శబ్దానికి ఐశ్వర్యప్రదాయకుడు, ఐశ్వర్యాధిపతిఅనిఅర్థం కదా! తన కోసం ఏమీ ఉంచుకోని వానికే ఆధిపత్యం లభిస్తుంది. తన కోసం ఏమీ ఉంచుకోకుండా స్మశానంలో ఉంటూ, పాములు, విభూతి ధరించి, విషం తినే వాడికి సంపదలు అధీనంలో ఉండటం సహజం.
మఱియొక అర్థం : శివుడు పురుషుడు. ఆయన భార్య ప్రకృతి. సర్వజీవులు వారి బిడ్డలు. మిత్రులు అంటే సూర్యులు, హితులు అనగా మేలు కోరేవారు అని అర్థాలు. సృష్టించబడిన జగత్తు హితం కోరే దేవతలు, ఋషులు మొదలైన వారు. వీరంతా సృష్టి, స్థితి, లయాలలో శివుడు కోరిన ప్రయోజనాన్ని నిర్వర్తిస్తారు. తాను మాత్రం ఆనందంగా వాటిని సాక్షీభూతుడై చూస్తూ ఉంటాడు. కనీసం భక్తులని రక్షించట మైనా నీవు చేయ వచ్చు కదా! అని భావం.

శ్రీ కాళహస్తీశ్వర శతకం – జ్ఞాన ప్రసూనం – 3
డాక్టర్ నందివాడ అనంతలక్ష్మి
Advertisement

తాజా వార్తలు

Advertisement