Thursday, April 25, 2024

శ్రీ కాళహస్తీశ్వర శతకం – జ్ఞాన ప్రసూనం – 67

          67. ఒకరిం జంపి పదస్థులై బ్రదుక తా మొక్కొక్క  రూహింతురే
               లకొ? తామెన్నడు( జావరో? తమకు బోవో సంపదల్? పుత్ర మి 
              త్ర కళత్రాదుల తోడ నిత్యసుఖమందం గందురో? యున్నవా
              రికి లేదో మృతి యెన్నడుం గటకటా! శ్రీకాళహస్తీశ్వరా!
          ప్రతిపదార్థం: శ్రీకాళహస్తీశ్వరా! ఒక్కొక్కరు = కొందరు, ఒకరిన్ = ఒకరిని, చంపి = సంహరించి, తాము = పదస్థులు + ఐ = పదవిని అధిష్ఠించి, బ్రతుకన్ = జీవించాలని, ఊహింతురు = ఆలోచిస్తారు, ఏల + ఒకో = ఎందుకో ఏమో, కటకటా = అయ్యయ్యో!, తాము = తాము, ఎన్నడున్ = ఎప్పటికి, చావరు + ఓ = చనిపోకుండా బ్రతికి ఉంటారా?, తమకు = తమకు, సంపదలు = ఐశ్వర్యాలు, పోవు+ఓ = నశింపకుండా ఉంటాయా?, పుత్ర = సంతానంతోనూ, మిత్ర = స్నేహితులతోనూ, కళత్ర + ఆదుల తోడ = భార్య మొదలైన వారితో, నిత్యసుఖము = శాశ్వత ఆనందాన్ని, అందన్ + కందురు + ఓ = పొందగలుగుతారా?, ఉన్నవారికి = కలవారికి, (ధనవంతులకి, బ్రతికి ఉన్నవారికి), మృతి =మరణం, లేదు + ఆ = ఉండదా?  
     తాత్పర్యం: శ్రీకాళహస్తీశ్వరా!కొందఱు ఇతరులను చంపి, పదవిలోకి వచ్చి బ్రతకాలనుకుంటారు. తాము ఎప్పటికీ చావకుండా ఉంటారా? తమ సంపదలు పోకుండా ఉంటాయా? భార్యాబిడ్డలతో, మిత్రులు మొదలైనవారితో శాశ్వతంగా(శాశ్వతమైన) సుఖాన్ని పొందగలరా? ధనవంతులకి మరణం రాదా? అయ్యో! (మానవులీ విషయాలు ఆలోచించ లేరెందుకు?)   
          విశేషం: జీవితం అశాశ్వత మైన దని తెలిసి కూడ, అందులోనూ అశాశ్వతాలైన పదవికోసం, సంపదలకోసం ఇతరులను చంపేవారి అజ్ఞానానికి బాధపడుతున్నాడు ధూర్జటి. 
          నిజానికి ఈ స్థితి ధూర్జటి కాలానికే కాదు, ఈ కాలానికి మఱింతగా వర్తిస్తుంది. ఆ కాలంలో పదవికోసం పోరాడింది రాజులు కొద్దిమంది మాత్రమే. ఇప్పుడో?ప్రజాప్రభుత్వం కనుక, ప్రయత్నించనివారి సంఖ్య తక్కువ. ఆలోచించాల్సిన విషయం కాదా మఱి! 
శ్రీ కాళహస్తీశ్వర శతకం – జ్ఞాన ప్రసూనం – 3
డాక్టర్ నందివాడ అనంతలక్ష్మి
Advertisement

తాజా వార్తలు

Advertisement