Tuesday, April 16, 2024

శ్రీ కాళహస్తీశ్వర శతకం – జ్ఞాన ప్రసూనం – 65

65. ఒక యర్థంబును నిన్ను నే నడుగగా యుహింప, నెట్లైన( బొ
మ్ము, కవిత్వంబులు నాకు జెందవని యేమో యంటివా? నాదు జి

హ్వకు నైసర్గికకృత్య మంతియ సుమీ! ప్రార్థించుటే కాదు కో
రికలన్ నిన్నును గాన నాకు వశమా ? శ్రీకాళహస్తీశ్వరా!

ప్రతిపదార్థం: శ్రీకాళహస్తీశ్వరా! ఎట్లు + ఐన్ = ఏది ఏమైనా, పొమ్ము = కానియ్యి, ఒక + అర్థంబును = ఒక్క కోరిక కూడా, నిన్ను = నిన్ను, అడగ + కాన్ = అడగటానికి (అడగాలని), ఊహింపను = తలచను, కవిత్వంబులు = నీవు చెప్పే కవిత్వాలు , నాకున్ = నాకు, చెందవు + అని = సంబంధించినవి కావా అని, ఏమి + ఓ = ఏమేమో, అంటివి + ఆ = అన్నావా? నాదు = నా యొక్క, జిహ్వకు = నాలుకకి, నైసర్గిక కృత్యము = స్వభావసిద్ధమైన పని. అంతియ సుమీ = అంతే సుమా! ప్రార్థించుట + ఏ = నిన్ను ప్రార్థించటమే కాదు, కోరికలన్ = కోరికలు కలిగి ఉండి, నిన్ను = నిన్ను, కానన్ = చూడటం, నాకు = నాకు, వశమా = శక్యమౌతుందా? ( కాదని భావం)
తాత్పర్యం: శ్రీకాళహస్తీశ్వరా! నేను నిన్ను ఒక్క కోరిక కూడా కోర దలచ లేదు. మఱి, ఈ కవిత్వాలు నా గురించే రచించావు కదా! అని అనకు. కవిత్వం చెప్పటం నా నాలికకి సహజలక్షణం. అంతే! కాని, ఈ కవిత్వం నిన్నేదో కోరటానికి కాదు సుమా! ఎందుకంటే, కోరిక లుంటే నిన్ను చూడటానికి వీలు కాదు కదా!
విశేషం: కవిత్వం చెప్పకుండా ఉండ లేడు కనుక, జిహ్వచాపల్యంతో కవిత లల్లాడే కాని, ఏదో ఆశించి కాదు. కోరిక ఎటువంటిది ఉన్నా, భగవంతుడు కనిపించడు. భగవంతుణ్ణి చూడాలనే కోరిక ఉన్నా కాని, భగవంతుడికి, భక్తుడికి మధ్య ఆ కోరిక అన్నది అడ్డు వస్తుంది. చూడాలనే వాంఛ కూడా నశించిన తర్వాతే దర్శనం లభిస్తుంది.
కవిత్వం ధూర్జటి జీవ లక్షణమట!

Advertisement

తాజా వార్తలు

Advertisement