Tuesday, March 26, 2024

శ్రీ కాళహస్తీశ్వర శతకం – జ్ఞాన ప్రసూనం – 57

  1. కలధౌతాద్రియు, నస్థిమాలికయు, గో గంధర్వముల్బున్కయున్
    బులితోలున్, భసితంబు( బాపతొడవుల్పోకుండ( దో(బుట్లకై
    తొలి నేవారలతోడబుట్టవుకళాదుల్గల్గెమేలయ్యె నా
    సిలువుల్ దూరము చేసికొంటెఱిగియేశ్రీకాళహస్తీశ్వరా!

ప్రతిపదార్థం:
శ్రీకాళహస్తీశ్వరా!, తొలి = మొదట, తోబుట్లకై + తోబుట్టువుల కోసం, పోకుండ = ప్రాకులాడక, ఏవారలతోడన్ = ఎవ్వరితోను, పుట్టవు = పుట్టలేదు (ఒంటరివి), కల = అవ్యక్తమనోహరమైన, ధౌత + అద్రియున్ = వెండికొండ, అస్థిమాలికయు = ఎముకలదండ, గో = ఎద్దు, గంధర్వమున్ = లేడి, పున్కయున్ = చేతిలోనిపుఱ్ఱె , పులితోలున్ = ధరించిన పులిచర్మం, భసితంబు = విభూతి, పాపతొడవుల్ = నాగాభరణాలు, కళ + ఆదుల్ = చంద్రకళ మొదలైనవి, కల్గెన్ = నీకు లభించినవి (నిన్నుచేరినవి), ఎఱింగియే = తెలుసుకునే (తెలివితోనే), ఆ సిలువుల్ = ఆ తగాదాలు (ఆస్తి కోసం అన్నదమ్ములతో జరిపే పోట్లాటలు), దూరము చేసికొంటన్ = దూరం చేసుకోవటం వల్ల, మేలు + అయ్యెన్ = మంచే జరిగింది.

తాత్పర్యం:
శ్రీకాళహస్తీశ్వరా! నీవు మొదట తోబుట్టువులు కావాలని లేదు. ఎవ్వరితోను పుట్ట లేదు. (అసలు పుట్టనే లేదు. ఇంకతోబుట్టువులెట్లా ఉంటారు?) తెలిసే దూరం చేసుకున్నావు కనుక నీకు దాయదులతో ఆస్తి తగాదాలు లేవు. తమని పంచుకునేవారు ఉండ రనే ధీమాతోనే మనోహరమైన వెండికొండ,ఎముకలదండ, వృషభం, లేడి, కపాలం, పులితోలు, విభూతి, ఆభరణాలుగా నాగులు, చంద్రకళ మొదలైనవి నిన్ను చేరాయి. మంచే జరిగింది కదా!

విశేషం:
శివుడు అనాది, అభవుడు, సనాతనుడు, శాశ్వతుడు. పుట్టుక లేని వాడికి తోబుట్టువులెట్లా ఉంటారు? పుట్టుక లేకపోతే ‘ఉండటం’ అంటే అస్తిత్వం ఎట్లా ఉంటుంది? అనేది భౌతికవాదులకి అంతుపట్టదు. శివుడు వాదాలకి అతీతుడు. లోకమర్యాదలు, దాయాదుల తగాదాలు చూసిన కవి బాధపడుతూ శివుడికి తోబుట్టువులు లేక పోవటం మంచిదే అయ్యింది అనటం ఒక చమత్కారం. పైగా శివుడి ఆస్తి ఎవరు వాటాలు కోరేది కూడా కాదు.ఎముకలదండ, బూడిద, పాములు, ఎద్దు, పుర్రె, పులితోలు ఎవరికి కావాలి? ఎవరూ కోరరు కనుక భక్తులకు ఇవ్వటానికి శంకరుడి వద్ద సిద్ధంగా ఉంటాయి. కనుక మంచిదే అంటున్నాడు ధూర్జటి. అయితే ఎవరూ కోరనివి శివుడికి కాని, భక్తులకి కాని పనికి వస్తాయా? ఉపయోగ పడతాయి శివతత్త్వం అర్థం చేసుకుంటే.
భూతి సర్వవిభూతులకి మూలం. చంద్రకళ మనస్సు, మనోభావఛాయలు (moods). పుఱ్ఱె మానవ మస్తిష్కం (మేధ). వెండికొండసర్వసంపదలకి నిలయం. ఈ విధంగా అన్నీ సంపత్కరాలే, కోరదగినవే.

శ్రీ కాళహస్తీశ్వర శతకం – జ్ఞాన ప్రసూనం – 3
డాక్టర్ నందివాడ అనంతలక్ష్మి
Advertisement

తాజా వార్తలు

Advertisement