Monday, May 29, 2023

సీతారాములు ఓ ఆదర్శం!


జానక్యా: కమలామలాంజలి పుటే యా: పద్మరాగాయితా:
న్యస్తా రాఘవ మస్తకేచ విలసత్‌ కుంద ప్రసూనాయితా:
స్రస్తా శ్యామల కాయకాంతి కలితా యా ఇంద్రనీలాయితా:
ముక్తా తా శుభదా భవంతు భవతామ్‌ శ్రీరామ వైవాహకా:

ఈ శ్లోకం వినని తెలుగువారుండరు. సీతారామకల్యాణంలో తలంబ్రాల ఘట్ట సందర్భమిది. వివాహ సంస్కారంలో వచ్చే ఒక ముఖ్య ఘట్టం భార్యాభర్తలు తలంబ్రాలు పోసుకునే క్రతువు. ఆ తలంబ్రాలు శ్వేత వర్ణపు మేలిమి ముత్యాలు. అవి సీతారాముల దేహ ఛాయలతో, కరస్పర్శతో అద్భుత వర్ణ బేధాన్ని చూపుతూ చూపరులకు ఆనందాన్నిస్తూ ఆనందాశ్చర్యాలకు గురిచేసే అంద మైన దృశ్యమది. ఆ అపురూప దృశ్యం అనేక భావోద్వేగానుభూతు లకు లోను చేస్తుంది. వీక్షకుల మనస్సులు ఆనంద రస ప్రవాహా లయ్యే సందర్భమది. ఆ మనోహర దృశ్యాన్ని పదచిత్రాలుగా, గళాలతో శబ్ద చిత్రాలుగా, వాగ్రూప దశ్యాలుగా చూపిన మహాను భావులెందరో. అందరికీ వందనాలు. ఈ శ్లోకం లేని శుభలేఖలే చూడలేదు ఎన్నో తరాల వారు. సీతారాముల రూపం స్ఫురణకు రాకుండా మదిలో స్మరించకుండా మిగిలిన వివరాలలోకి వెళ్ళేవాళ్ళమా! అలా భార తీయుల ఆలోచనా స్రవంతిలో, భావంలో ఒక అంతర్భాగమైన దేవతామూర్తులు వారు.

- Advertisement -
   

సీతారాములంటే ఎందుకింత ఆరాధన?

ఆలుమగలంటే వారే కనుక. దాంపత్యపు అన్యోన్యతంటే వారిదే కనుక. వారు సమ భావనకు, పరస్పర గౌరవ చింతనకు, జీవన సుఖదు:ఖ సమస్వీకరణా సంసిద్ధతతకు ఆదర్శమూర్తులు. వియోగ బాధను, వ్యధను సమసాంద్రతలోనే కాదు, సమ నిష్పత్తి లోను అనుభవించినవారు. వియోగ పరితాపంలో ఏ మానవ వికారాలకు లోను కాని వారు. ఆ చింతలోనూ వారిరువురి చింతన ఒకరిని గురించి ఒకరికి. ఒకరిపై ఒకరికి నిశ్చి తాభిప్రాయం. అచంచలమైన ప్రేమ. ఇంతటి క్లేశాన్ని అనుభవించి అనురాగంతో, పవిత్ర మైన ప్రేమతో, నిర్మల మనస్కులై భార్యాభర్తలకు సరైన అర్ధాన్ని చూపారు. ఇందుకే ఈ శ్లోకం శుభలేఖారంభంలో ఉండాలి. అందుకే శ్రీ విశ్వనాథ వారు-
”సీత శ్రీరామచంద్రుని చిత్తపదము
రామచంద్రుడు జానకీ ప్రాణపదము
రామసర్పఫణామణి రమణి సీత
ధరణిజా జీవితాతప తరణి స్వామి” అన్నారు. అంతేకాదు. భారతీయ దృష్టిలో, చింతనలో ఉండే అర్ధనారీశ్వర తత్వాన్ని, దాని ఉదాత్త భావనను…
”చేతమునందు పూర్వమున శ్రీరఘురాము నెరింగినట్లుగా
నే తలపోసినాడ, నిపుడీయమ గాంచిన
యంత సర్వ మ
జ్ఞాతము గాగనుండెనను సంగతి
నా కెరుగంగ నయ్యెడున్‌
సీత నెరుంగకుండ రఘుశేఖరు
డర్థము కాడు పూర్తిగా” అన్నారు.
ఆలుమగలు ఒకరినొకరు బాగా అర్ధం చేసుకోవాలి. విశాలదృష్టితో పాటు సృష్టి సృజ నకు స్త్రీ, పురుషలిరువురి సమాన ప్రాధాన్య తను, అవశ్యకతను మనసా.. వాచా.. కర్మణా విశ్వసించాలి. ఆ లోతైన ఆలోచన, అవగాహ న ఉన్న దంపతులే నిజమైన దంపతులు. అదే నిజమైన దాంపత్య నిర్వచనం. దీనిని చూపిన వారు సీతారాములే కనుక వారే మన జాతికి పూజ్యనీయులు. ఈ అద్భుత భావనను చెప్పే రామాణయం మన జీవన పారాయణం కావాలి. ముఖ్యంగా యువత ఈ గ్రంథాన్ని చదవాలి. ఆకళింపు చేసుకోవాలి. అపుడు వారు…
*How to attain a better-married life…
*How to be a good wife / husband…. లాంటి పుస్తకాల కోసం పరు గెత్తనక్కరలేదు. జాతి మహా కావ్యాలు చదవటం ద్వారా ఒక దృష్టి, చింతన అలవరచు కోవాలి. దీనివల్ల మన సంస్కృతి మీద ఆచారాల, సంప్రదాయాల మీద ఒక స్పష్టత, అవ గాహన ఏర్పడుతుంది. ఈ బలమైన నేపథ్యం ఇతర సంస్కృతులను తరచి చూసే ఒక పరిశీలనా నేత్రాన్నిస్తుంది. దాని కోసం రామాయణాన్ని చదవాలి.
దుష్టశిక్షణ, శిష్టరక్షణార్థమై చైత్రశుద్ధ నవమి నాడు శ్రీహరియే కౌసల్యాపుత్రుడై ఈ భూమిపైన జన్మించిన పర్వ దినాన్ని మనం ‘శ్రీరామనవమి’గా విశేషంగా జరుపుకుంటాం. శ్రీహరి ఏడవ అవతారం శ్రీరామచంద్రుడే. ఈ అవతార ప్రధాన ఉద్దేశం లోక కంటకుడైన రావణాసురుణ్ణి సంహ రించటమే. దానికి సీతాపహరణ జరగాలి. అపుడే కదా శ్రీరాముడు లంక మీద దండెత్తి అతణ్ణి చంపేది. అందువల్ల సీత, రాములకు వివాహం జరగాలి. ఇది సంభవిస్తేనే రావణ వధ జరుగుతుంది. కనుక శ్రీరాముని జననం కన్నా సీతారాముల కల్యా ణానికే ప్రాధాన్యత. పేరుకు మాత్రమే శ్రీరాముని పుట్టినరోజు పండుగ.
శ్రీకృష్ణాష్టమి కంసుడి సంహారం ధృవతార లక్ష్యం అక్కడ పుట్టినరోజుకి, ఇక్కడ పెళ్లికి విశిష్ట ప్రాధాన్యత ఉండటానికి గల మర్మమిదే. త్యాగయ్య చెప్పనే చెప్పాడు.
”మా జానకి చెట్టబట్టగా మహారాజు వైతివి” అని. సాక్షాత్‌ లక్ష్మీస్వరూపమైన సీతమ్మ ని పెళ్ళాడిన తర్వాతే కదా రామునికి నారాయణాంశ పూర్ణంగా లభించినది.
శ్రీరామచంద్రమూర్తి పుట్టి నరోజు అయిన వసంత ఋతు వులో చైత్ర శుద్ధ నవమి, పునర్వ సు నక్షత్రపు కర్కాటక లగ్నంలో అభిజిత్‌ ముహూర్తంలో జన్మిం చాడు. సీతతో వివాహమయ్యింది. పరిణయపు వేడుకలు, సంబరాలు సంతోషాల ఘోష మదిలో ప్రతిధ్వని స్తూనే ఉంది. కాళ్ళ పసుపు పారాణి పూర్తిగా ఆరనే లేదు. కైకేయి ఆజ్ఞ పదు నాలుగు సంవత్సరాలు కఠిన అరణ్య వాసం చేయించిందా ఆ నూతన వధూవరులను. దాంపత్యం కష్టాల కడలి అయ్యింది. ఎన్నో తుఫాను ల్లో చిక్కుకున్నారు. సీత తనను అపహరించి లంకలో ఉంచిన కాలంలో మంచి నీరైనా తాగక, చీరైనా కట్టక ఒంటరితనపు ఎడారి వడగాల్పుల తీవ్రతను భరించిం ది. ఆమె కోసం అన్వేషించి, రావణునితో యుద్ధం చేసి అతణ్ణి సంహరించి, సీతాదేవి సమేతంగా అయోధ్యలో అడుగుపెట్టి పట్టా భిషిక్తు డైనాడు శ్రీరాముడు. ఈ శుభ సం ఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగినదని ప్రజల విశ్వాసము. శ్రీ సీతారాముల కళ్యా ణం కూడా ఈరోజునే జరిగిందని కొందరి ప్రగాఢ నమ్మకం. ఈ మూడు విశ్వా సాల నేపథ్యా లకు భూమిక చైత్ర శుద్ధ నవమే. ఈ ముప్పేటల విశ్వాస గోదావరి ప్రవాహమే శ్రీ సీతా రాముల కల్యాణ మహోత్సవం. తెలుగు వారి పండుగ. శ్రీ రాముని గాథలు, గీతాలు, నామ సంకీర్తన రసప్రవాహమై, మనసులు పులకాంకితమయ్యే మధురమైన రోజు నేడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement