Tuesday, March 26, 2024

మౌనబోధ… ఓ దివ్యచాపం

ఉపదేశం విభిన్న రూపాలలో ఉంటుంది. ఉత్తమ గురువు తాను ఉప దేశం చేసే వారి అభిలాష, గ్రాహ్య శక్తి, జిజ్ఞాసలను బట్టి అది ఏ రూపంలో ఇవ్వాలో, ఎంత స్థాయిలో ఇవ్వాలో నిర్ణయం చేస్తాడు. అంతేకాదు. విద్యార్థి సంకల్పశక్తి దానికి అతడు జతచేయగల ధృతి స్థాయిని కూడ అంచనా వేస్తాడు. అపుడే ఉపదేశ పద్దతి, దాని స్థాయిని, లోతును నిర్ణయం చేస్తాడు. సామాన్యులకు వాగ్రూప ఉపదేశం. కొంత పక్వ మనస్కు లకు నయనోపదేశం. అతి పక్వచిత్తులకు మౌనమే ఉపదేశం అవుతుంది.
గురూపదేశంలో పద్ధతులు ఇవి. దీనికి మరొక కోణం ఉంది. గురువు తన ప్రవర్తన ద్వారా, మాట్లాడే తీరువల్ల ఎంతో గొప్ప జ్ఞానాన్ని, ఎన్నో గొప్ప విషయాలను చెప్పకనే చెపుతాడు. అంటే, పరిశీలనాసక్తి తన శిష్యుల్లో పెంపొందేటట్టు చేస్తాడు. పరిశీలన దృష్టిని అలవరచుకున్న శిష్యులు తమ నిర్ణీత విద్యాభ్యాస కాలానికే నేర్చుకోవటం పరిమితం చేయరు. తమ జీవి తాంతం పరిశీలన అన్న అలవాటును వీడరు. వీరు గురువు ద్వారా నేర్చు కున్న విద్యను, జ్ఞానాన్ని అనూహ్యమైన రీతిలో వృద్ధి చేస్తారు. గురువు ఆశిం చేది అదే. ”సహనా వవతు… సహనం భునక్తు” అన్న శాంతి మంత్ర సార మిదే. ఉపదేశించేదదే. గురువు నుండి పొందిన జ్ఞానానికి తమ ప్రతిభతో, అద్భుత ఊహాశక్తితో మరింతగా చేసి తమ శిష్యులకు అందచేస్తారు. అదే భారతీయ గురు పరంపరలోని విశిష్టత.
దక్షిణామూర్తి పరమ శివుని జ్ఞానరూప అవతారం. ఇతర గురువులు మాటలతోనే బోధిస్తారు. కాని దక్షిణామూర్తి మౌనంలోనే శిష్యులు జ్ఞానాన్ని పొందుతారు. గురువు మౌనంలోనే సందేహాలు నివృత్తి అవుతాయి. అది ఎలా సాధ్యమవుతుంది? గురువులోని జ్ఞాన తేజస్సు ఆ ప్రదేశమంతా పరివ్యాపితమై ఒక గొప్ప శక్తి చాపంలా ఏర్పడుతుంది. ఆ జ్ఞాన ప్రకాశం, గురువు ముఖ వర్ఛస్సు శిష్యులకు ఒక మనోప్రశాం తతను, అచంచలమైన ఏకాగ్రతలను ఇస్తాయి. వారి సందేహాలకు సమాధా నం దొరుకుతుంది. ఉత్తమ గురువుల దివ్య మౌనమే శిష్యకోటికి మహత్త రోపదేశం.
సృష్టి ప్రారంభంలో బ్రహ్మదేవుడు తన ముఖం నుంచి బ్రహ్మ మానస పుత్రులు సనక, సనందన, సనతుజాత, సనత్కుమారులను సృష్టించాడు. వారిని బ్రహ్మ, సృష్టిని కొనసాగించమని చెప్పగా, అది వారికి ఇష్టంలేక తాము జ్ఞానం పొందాలని, మేము మీకు సాయపడలేమని చెప్పి వారు విరక్తులై జ్ఞానాన్ని పొందడానికి తగిన గురువు కోసం అన్వేషిస్తూ వెళ్లిపోయారు. అలా వారు గురువుకై వెదుకుతూ నారద మహర్షి సలహాపై మొదట బ్రహ్మ లోకానికి వెళతారు. అక్కడ బ్రహ్మ సరస్వతితో ఉండటం చూసి ఆయన తమకు ఏమని ఉపదేశిస్తాడు. తగిన గురువు కాదనుకున్నారు. అక్కడ నుంచి వైకుంఠానికి వెళ్లారు. విష్ణు పాదాలను ఒత్తుతున్న లక్ష్మిని చూసి మహావిష్ణువును ఏమీ ప్రశ్నించకుండా వెనుదిరిగారు. ఆ తరువాత కైలాసా నికి వెళ్ళి అక్కడ పార్వతీదేవితో వున్న అర్థనారీశ్వరుని చూసారు. తమకు అక్కడ కూడా జ్ఞానం లభించదని అనుకుని వెనుతిరిగారు. తమకు జ్ఞానాన్ని బోధించే వారెవరా అని అన్వేషిస్తూ వెళుతుంటారు. అలా వందల సంవత్స రాలు తిరిగారు. వారి అన్వేషణ తీవ్రతరం చేశారు. వారి జ్ఞానాసక్తిని గుర్తిం చిన పరమశివుడు వారి పట్ల కరుణాతరంగుడై వారు వెళ్ళే దారిలో మర్రి చెట్టు కింద దక్షిణమూర్తి రూపంలో కూర్చున్నారు. సనకసనందులు మొదటిసారి దక్షిణామూర్తిని చూసినప్పుడు ఆయన తేజస్సుకు పరవశులై ఆయనే నిజమైన గురువు అని అర్థం చేసుకున్నారు. ఆయన చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి, సాష్టాంగ నమస్కారం చేసి, పాదాల వద్ద కూర్చున్నారు.
దక్షిణామూర్తిని చూస్తూనే సనకసనందులు ఆత్మ సాక్షాత్కారం పొందా రు సంశయాలన్నీ దూరమయ్యాయి. వీరేమీ అడగలేదు. దక్షిణామూర్తి వారికి ఏమీ చెప్పలేదు. గురు మౌనంలోనే వారు అన్నిరకాల సందేహాల నుండి విముక్తులయ్యారు. వారు జ్ఞానులు అయ్యారు. ఆత్మను (శివుడిని) గ్రహించి సంకెళ్ల నుండి విముక్తి పొందారు. అన్ని దు:ఖాలకు మూలం అజ్ఞా నం. అజ్ఞానం తొలగితే శాశ్వత దు:ఖం తొలగుతుంది. ఈ అవిద్యను దూరం చేసే జ్ఞాన స్వరూపమే దక్షిణా మూర్తి. దక్షిణామూర్తి రూపాన్ని పరిశీలిస్తే, కుడి చెవికి మకర కుండలం, ఎడమ చెవికి ‘తాటంకం’ అలంకారాలు కనిపిస్తాయి. మకర కుండలం పురుషుల శ్రవణాలంకారం, తాటంకం అమ్మవారి ఆభర ణం ఉంటాయి. ఇది దక్షిణామూర్తి శివశక్తుల సమైక్య రూపాన్ని తెలియ జేస్తుంది. ఈ రెండు అలంకారాలు సనకసనంద నాదులకు ముందు రెండుగా కనబడిన శివశక్తులే ఇప్పుడు ఏకాకృతిగా దర్శనమిచ్చాయి.
సద్గురువులు లభించనివారు దక్షిణామూర్తి ని గురువుగా భావిస్తారు. దక్షిణామూర్తి ఆరాధన సకల విద్యలను ప్రసాదిస్తుంది. తల్లితండ్రులు పిల్ల లకు ప్రతి నిత్యం జ్ఞానప్రదాత దక్షిణామూర్తి స్తోత్రం చదవటం అలవాటు చేస్తే అర్ధ వంతమైన, సుజ్ఞానం వారికి పట్టుబడు తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement