Wednesday, December 4, 2024

ఔదార్యము గూర్చి శ్రీమాన్‌ డా॥ కందాడై రామానుజాచార్యులవారి వివరణ

ఇక ఫలయజ్ఞం. తమకు ఫలములు పుష్కలముగా లభించే అవకాశం ఉంటే ఒక పెద్ద బుట్టలో పండ్లు బుట్టనిండా పెట్టి ఆ నీటికుండ పక్కనే పెట్టేవారు. ఆనాఇ కాలంలో నీతినిజాయితీ, ధర్మం, న్యాయం ఉన్నది కాబట్టి నిజంగా ఆకలిగొన్నవారైతే రెండుమూడు పండ్లు తిని, రెండు గ్లాసుల నీరు తాగి యజమానిని దీవించి వెళ్ళేవారు. ఆకలైతేనే తినేవారు. కాని తీసుకొనిపోయేవారు కారు. ఇక ఇంకొక యజ్ఞం వృక్షయజ్ఞం. ఇది చాలా ప్రధానం. ఆనాటి కాలంలో ప్రతి ఊరికి వెలుపల నాలుగు రావిచెట్లు, నాలుగు మర్రిచెట్లు, నాలుగు జువ్విచెట్లు, ఒక ఇరవై తక్కువ కాకుండా మామిడి జామ, అరటి, పనస, కొబ్బరి, సపోటా చెట్లు ఇలా 20 రకాల పండ్ల చెట్లు నీడనిచ్చేవి నాటేవారు. ఊళ్ళో ప్రతి వీధిలో 10, 20 వేపచెట్లుండేవి. పెరటిలో నిమ్మచెట్లు, నారింజచెట్లు, ఇతర కూరగాయలు, చామ, పాలకూర, తోటకూర, ఇపుడు మరిచిపోయిన పెరుగుతోటకూర, బచ్చలికూర ఇలా కూరగాయల తోటలు ఊరివెలుపల, ప్రతి ఇంటిలో, ఊరిలో ప్రతి వీధిలో నాటేవారు. ప్రతి ఇంటివారు తన ఇంటిముందున్న చెట్లకు తాను నీరు పోసేవాడు. ఎండాకాలం నడవలేనివారు ఏ వేపచెట్టు క్రిందనో, మర్రిచెట్టు కిందనో సేదదీరి, బుట్టలోని లేదా చెట్లకున్న పండ్లు తిని, కుండలోని నీరు తాగి కాసేపు విశ్రమించి వెళ్ళేవారు. ప్రతి వేప ఒక సత్రము, ప్రతి మర్రి ఒక ధర్మశాల. ఇంకా చెప్పాలంటే ఆ కాలంలో ప్రతి అడవి ఫైవ్‌ స్టార్‌ హోటలే. అంతకన్నా గొప్పది కూడా. వేసవికాలంలో బాటసార్లు, ఋషులు, ఇతరులు అడవిలో నడిచి వెళ్తుంటారు. మధ్యాహ్నం అయిందంటే అడవిలో సరోవరాలుండేవి. అందులో స్నానం చేసి అర్ఘ్యప్రదానం చేసి, ఒడ్డున పూజ చేసుకొని, తాను కావాలనుకున్న పండ్లను చెట్లను ప్రార్థించి తీసుకొనేవారు. ఒకపుడు నరులు చెట్లకున్న పండ్లను కోసేవారు కాదు. వృక్షరాజమా! మా ఆకలి తీర్చు, అనుగ్రహించు అని ప్రార్థిస్తే ఆ పండ్ల చెట్లు పండ్లు రాల్చేవి. చల్లని నీటిలో స్నానం చేసి, పూజ చేసుకొని తీయని పండ్లను తిని, కొన్ని ఆశ్రమాలలో ఋషులు అతిథులకు పాలు, పెరుగు, వెన్న పెట్టేవారు. అవి తిని ఆ చెట్లకింద హాయిగా కొంత కునుకు తీసి లేచి మరల రెండు పండ్లు తిని, చల్లని నీరు తాగి ప్రయాణం చేసేవారు. అందులో ప్రతి అడవి ఏ/సియే. ఎందుకంటే ‘కూపోదకం తరుచ్ఛాయా తాంబూలం తరుపర్ణకం ఉష్ణకాలే బవేత్‌ శీతం శీతకాలే తథోష్ణకం’ అని శాస్త్రం. అనగా బావినీరు, చెట్టునీడ, తాంబూలం, చెట్ల ఆకులు వేసవిలో చల్లగా ఉంటాయి. చలికాలంలో వెచ్చగా ఉంటాయి. వేప, మర్రి, రావి, జువ్వి చలికాలం వెచ్చగా ఉంటాయి. రాత్రి, పగలు ఆ చెట్ల క్రిందనే బతుకు. ఇంక వారికి ఫైవ్‌ స్టార్‌ కన్నా యేం తక్కువున్నది. ఒక్క కల్తీ తక్కువున్నది. బిల్లు తక్కువున్నది, కృత్రిమ చిరునవ్వు తక్కువున్నది. ఇది వృక్షయజ్ఞము. అసలు ఊరు నిండా అడవినిండా సమృద్ధిగా చెట్లుంటే ఇంకా రోగాలు వస్తాయా? అన్ని వైరస్‌లను ఆ చెట్ల ఆకులు లాక్కుంటాయి. ఆ చెట్ల నీడలో పాములు విశ్రమిస్తాయి. అవి గాలి పీలుస్తూ ఈ క్రిములను మ్రింగుతాయి.
ఇక ఇంటినిండా పూలచెట్లు, కూరగాయల చెట్లు, పండ్లచెట్లు నాటితే ఇంటిలోకి ఏ వైరసు రాదు. నాలుగు వేపచెట్లు, నాలుగు తులసిచెట్లు, నాలుగు మామిడిచెట్లు, జామచెట్లు పెంచితే అన్ని విషజ్వరాలు హరిస్తాయి. ఇవి జల వృక్ష పుష్ఫఫల యజ్ఞాలు.

(స‌శేషం)

Advertisement

తాజా వార్తలు

Advertisement