Sunday, December 1, 2024

ఔదార్యము గూర్చి శ్రీమాన్‌ డా॥ కందాడై రామానుజాచార్యులవారి వివరణ

ఇక్కడ ప్రసక్తి అనగా సందర్భం వచ్చింది కాబట్టి కొద్దిగా గోవైభవాన్ని తెలుసుకుందాం! అవసరం కూడా. క్షీరసాగరమధన సమయంలో అయిదు కామధేనువులు పుట్టాయి. వాటిలో ఒకదానిని వసిష్ఠమహర్షి, ఇంకొకదాన్ని భరద్వాజమహర్షి, ఇంకొక గోవును జమదగ్ని, మరొక గోవును గౌతమమహర్షి, ఇంకొకదానిని దేవలుడు లేదా విశ్వాతను అను మహర్షి తీసుకున్నారు. స్థూలంగా పరిశీలిస్తే జగత్తును ప్రవర్తింపచేసేది గోవే అని తెలుస్తుంది. వసిష్ఠమహర్షి గోవును అపహరించే వసువు కురువంశంలో వసిష్ఠ శాపం వలన భీష్మునిగా పుట్టి మహాభారత ప్రవర్తకుడయ్యాడు. ఆ వసిష్ఠమహర్షి గోవు కోసమే విశ్వామిత్రుడు బ్రాహ్మణుడయ్యాడు. ఇక గౌతమమహర్షి గోవు వలన గోదావరి ఆవిర్భవించింది. భరద్వాజమహర్షి గోవు రామచంద్రునకు, భరతునికి, అఖండమైన వారి సైన్యానికి విందు చేసింది. ఇక దేవలుడు ఆ గోవుతో యజ్ఞములను ఆచరించి లోకాన్ని కాపాడాడు.
జమదగ్ని గోవు కొరకే కార్తవీర్యార్జునుడు తన రాజదర్పాన్ని చూపి హరించాడు. ఒక విధంగా పరశురామావతారం గోరక్షణ కోసమే. మన భాషలో ఒక మూగజీవి గడ్డి వేస్తే పాలిచ్చే జీవి, అఖిల ప్రపంచాన్ని పరిపాలించేది గోవే. ఆ గోవుకు హింస జరిగినా, అన్యాయం జరిగినా పరమాత్మ సహించడు. అందుకే గోవును హరించిన కార్తవీర్యార్జునుని వధించాడు. తన తండ్రి గోవును హరించి, అడ్డుకున్నందుకు తన తండ్రినే అంతమొందించిన ఒక్క కార్తవీర్యార్జునునినే కాక అట్టి దురహంకారం నిండివున్న క్షత్రియజాతిని అంతమొందించినవాడు పరశురాముడు. ఒక గోవు కోసం వైకుంఠం నుండి దిగివచ్చాడు. ఒక గోవుకోసం భూమండలమంతా సంచరించాడు. ఇక తన ఆయుధం సుదర్శనం కోరితే అతనికి అవతరించే అవకాశాన్ని కల్పించి అతని ద్వారా లోకకల్యాణాన్ని, ప్రజాక్షేమాన్ని కలిగించి, స్వార్థం, అహంకారం ఎంతటి తపస్సునైనా అంతం చేస్తుంది అని లోకానికి చాటిన స్వామి పరశురామ రూపంలో ఎంతటి ఔదార్యాన్ని చూపారో ఆలోచించండి. తన తల్లిని వధించమని తండ్రి ఆజ్ఞాపిస్తే తన సోదరులు కాదన్నారు. కాని తాను ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వధించి తండ్రి మెప్పు పొంది వరంగా తల్లి జీవితాన్ని పొందాడు.

(స‌శేషం)

Advertisement

తాజా వార్తలు

Advertisement