Monday, December 2, 2024

ఔదార్యము గూర్చి శ్రీమాన్‌ డా॥ కందాడై రామానుజాచార్యులవారి వివరణ

ఇక ఉపనిషత్తులు చెప్పే ఇంకో యజ్ఞాన్ని చూద్దాం. ఉపనిషత్సారమే భగవద్గీత. అందులో శ్రీకృష్ణభగవానుడు ‘అహం వైశ్వానరో భూత్వా ప్రాణినా. దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం’ అన్నాడు. నేను వైశ్వానర రూపములో ప్రతి ప్రాణి దేహంలో వుంటున్నాను. అట్లు వైశ్వానర రూపంలో ఉన్న నేను ప్రాణ అపాన సమాన ఉదాన వ్యాన రూపంలో ఉన్న పంచప్రాణములతో కలిసి ఆ ప్రాణులు భుజించిన ఆహారాన్ని జీర్ణం చేస్తున్నాను అంటాడు. మనకు అర్థం కావాలంటే మనం తీసుకొనే ఆహారాన్ని అరిగించేది లివర్‌. దాన్ని సంస్కృతంలో జఠరాగ్ని అంటాం. జఠరం అంటే కడుపు. కడుపులో ఉండే అగ్ని జఠరాగ్ని. వైశ్వానరునిగా చెప్పబడే పరమాత్మ జఠరాగ్నితో కలిసి ఉంటాడు. జఠరాగ్నితో కలిసి ఉన్న వైశ్వానర రూపమైన పరమాత్మను ఉపాసన చేయమని ఉపనిషత్తులు చెపుతున్నాయి. ఇది అందరూ ప్రతి దినము చేయవలసిన యజ్ఞము. అనగా వైశ్వానర రూపోపాసన. ఇదే అన్నయజ్ఞం.
ప్రతివాడు అన్నం తినడానికి 15 నిమిషాల ముందు కాళ్ళు, చేతులు కడుక్కొని అప్పటివరకు కట్టుకున్న వస్త్రాలను మార్చుకొని చక్కగా ఉతికిన చిరగని పరిశుభ్రమైన వస్త్రాలను ధరించి భోజనశాలలో తమ స్థానంలో కూర్చొని వైశ్వానరుని ధ్యానించాలి. ఆ వైశ్వానరునికి శిరస్సు స్వర్గలోకం. కన్నులు సూర్యచంద్రులు, ప్రాణము వాయువు, నదులు ఉదరము, నక్షత్రాలు తారలు కేశాలు, మబ్బులు, వృక్షాలు రోమాలు. హృదయం సత్యలోకం, భూమి పాదాలు. ఇది వైశ్వానర రూపంలో ఉన్న పరమాత్మ స్వరూపం. ఆ స్వరూపాన్ని ధ్యానించి పరమాత్మ యొక్క ఆ అవయవములను తన అవయవములుగా భావించాలి. అనగా తాను పరమాత్మ ఆత్మగా గల పరమాత్మ శరీరాన్ని అని భావించాలి. అపుడు నేను తింటున్నాను అని కాక పరమాత్మకు అర్పిస్తున్నాను అనే భావన కలుగుతుంది. అపుడు భోజనం వడ్డించమని, వడ్డించిన తరువాత ఆ భోజనాన్ని తెలిసీ తెలియక అంటి ఉన్న సకల దోషాలు తొలగిపోవటానికి పరమాత్మ నామాన్ని తలుస్తూ పరిశుద్ధమైన జలంతో ప్రోక్షించాలి. ఆ తరువాత అచ్యుత అనంత గోవింద నామాలను పలుకుతూ మూడుమార్లు ఆచమనం చేయాలి. అనగా అరచేతి గుంటలో నీరుంచుకొని నోట్లో వేసుకొని మింగాలి. ఆ తరువాత అన్నం మీద మళ్ళీ నెయ్యి వేసుకొని ప్రాణాహతులు వేసుకోవాలి. అంటే ప్రాణాయ స్వాహా, అపానాయ స్వాహా, ఉదానాయ స్వాహా, సమానాయ స్వాహా అంటూ ఒక్కొక్క మారు రేగిపండు అంత అన్నమును అంగుష్ట అనామిక మధ్య వేళ్ళతో నోటిలో వేసుకోవాలి. తరువాత మరల అచ్యుత అనంత గోవింద నామములతో మరల ఆచమనం చేయాలి. దాని తరువాత బ్రహ్మణే స్వాహా అంటూ తినాలి. ఇది భోజనం చేసే విధానం, కాదు కాదు అన్నం అనే హవిస్సుతో వైశ్వానర ఉపాసన అనగా అన్నయజ్ఞం చేసే విధానం.

(స‌శేషం)

Advertisement

తాజా వార్తలు

Advertisement