Thursday, November 28, 2024

ఔదార్యము గూర్చి శ్రీమాన్‌ డా॥ కందాడై రామానుజాచార్యులవారి వివరణ

దుర్యోధనుడికి తండ్రి మహారాజు, భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యులు, అశ్వత్థామ, మిత్రుడు అంగరాజు, హస్తినాపుర సామ్రాజ్యం అన్నీ ఉన్నాయి. మరణించే వరకు ఒక్కనాడైనా మనశ్శాంతితో ఉన్నాడా? నాకు సంపద కావాలి అనుకుంటే తప్పు కాదు. నాకే కావాలి అనుకున్నవాడు శాంతిగా ఉండలేడు. అందుకే మనస్సు బాగుండాలి. బుద్ధి బాగుండాలి. ఇవన్నీ బాగుండాలి. మంచి కర్మలు చేయాలి. అంటే యజ్ఞాలు చేయాలి. యజ్ఞాలతో ఆరోగ్యమైన శరీరం, ఆరోగ్యమైన మనస్సు, ఆరోగ్యమైన బుద్ధి, అందమైన భార్య, ఇల్లు అన్నీ లభిస్తాయి. ఇలా కొన్ని జన్మలు గడుస్తుంటే ఇలా ఎంతకాలం వస్తూ పోతూ ఉండాలి. మళ్ళీ రాకుండా ఎపుడూ ఆ పరమాత్మ వద్దనే ఉంటే బాగుంటుంది అనే జ్ఞానం, వైరాగ్యం కూడా నీకు యజ్ఞం వల్లనే కలుగుతాయి. ఇక అపుడు జన్మలు్‌మరణాలు, ఇల్లు్‌వాకిలి, సుఖాలు్‌దుఃఖాలు ఇవేవీ ఉండవు. ఆ పరమాత్మను చేరాలి. ఆ పరమాత్మను గురించి తెలిపేవి యజ్ఞాలే. అందుకే భారతీయ సంప్రదాయంలో నిత్యయజ్ఞం, నిత్యాగ్నిహోత్రం మన జీవనంలో ప్రధాన భాగం. ఎక్కడికో వెళ్ళకుండా పరమ ఉదారుడైన ఆ స్వామి మన శరీరములోనే దేవతలందరినీ ఉంచాడు. శిరస్సు అగ్ని, నేత్రములు చంద్రసూర్యులు, ప్రాణము వాయువు, బాహువులు ఇంద్రుడు, వాక్కు అగ్ని, ఉదరంలో జఠరాగ్ని, కనుబొమలు స్వర్గము, కనురెప్పలు రాత్రింబవళ్ళు, పాదములు భూమి, నాభి ఆకాశం, దిక్కులు చెవులు, స్వర్గము శిరస్సు, కడుపు సముద్రము, నడుము ఆకాశము, నాసిక త్వష్టా. ఇట్లు ఆ దేవతలనందరిని మన శరీరంలోనే ప్రతిష్ఠించిన ఆ పరమాత్మ ఎంత ఉదారుడు. శరీరాన్ని ఇచ్చాడు. అందులో దేవతలను ఇచ్చాడు. ఆ అవయవాలతో అందులో ఉండేవారిని ఆరాధించండి. అదే యజ్ఞం అన్నాడు. మీకిచ్చిన అవయవాలకు చేయవలసిన పనిని వేదశాస్త్రాలు చెపుతున్నాయి. వేదశాస్త్రాలు చెప్పినట్లుగా ధర్మాచరణే ఆ అవయవాలలో ఉండే దేవతలను ఆరాధించుట అంటే యజ్ఞము. ఇదే నిత్యయజ్ఞము.

(స‌శేషం)

Advertisement

తాజా వార్తలు

Advertisement