Friday, April 19, 2024

శ్రీ కాళహస్తీశ్వర శతకం

93.దయసేయండని కొంద ఱాడుదురునిత్యంబున్నినుంగెల్చుచున్
నియమంబెంతొఫలంబునంతియ కదా! నీవీయ, పిండెంతొ యం
తియకా రొట్టె? మదిం దళం బశనబుద్ధింజూడనేలబ్బు? స
త్క్రియలన్నిన్నుభజింపకిష్టసుఖముల్శ్రీకాళహస్తీశ్వరా!
ప్రతిపదార్థం: శ్రీకాళహస్తీశ్వరా!, కొందఱు- కొంతమంది, నిత్యంబున్- ప్రతిరోజు, నినుం- నిన్ను, కొల్చుచున్- సేవిస్తూ, దయ- చేయండు- అని- కరుణించటం లేదని, ఆడుదురు- అంటారు, నియమంబు- నిష్ఠ, ఎంతొ- ఎంత ఉన్నదో, నీవు- నువ్వు, ఈయన్- ఇవ్వటానికి, ఫలంబు- ఫలితం కూడ, అంతియ- అంత మాత్రమే, పిండి- ఎంతొ- పిండి ఎంత ఉంటుందో, రొట్టె- రొట్టె కూడ, అంతియకా- అంతే ఉంటుంది కదా!, మదిన్- మనస్సులో, దళంబుగా- దట్టంగా / అధికంగా, అశనబుద్ధిన్- చూడన్- ఆహారం కావాలని చూసి నంత మాత్రాన, ఏల- అబ్బున్- ఎట్లా దొరుకుతుంది? సత్క్రియలన్- సత్కార్యాలతో (మంచిపనులతో / పూజాదికాలతో), నిన్ను- నిన్ను, భజింపక- సేవించకుండా, ఇష్ట సుఖముల్- కోరిన సౌఖ్యాలు, ఏల- అబ్బున్- ఎందుకు దొరుకుతాయి?
తాత్పర్యం: శ్రీకాళహస్తీశ్వరా!కొంతమంది నిన్ను నిత్యము పూజించి, ఇంకా దయచూపటం లేదు అంటారు. వారికి నిష్ఠ ఎంత ఉందో, నీవిచ్చే ఫలితం కూడ అంత మాత్రమే పిండి కొద్ది రొట్టె కదా! ఆకలి బాగా ఉంది, ఆహారం కావాలి అని మనసులో అనుకొన్నంత మాత్రాన ఎట్లా దొరుకుతుంది? సత్కార్యాలతో ( ఇతరులకు మేలు కలిగించే పనులు/పూజాదికాలతో) నిన్ను సేవించక పోతే కోరిన సౌఖ్యం ఎట్లా దొరుకుతుంది?
విశేషం:ఈ పద్యంలో చేసే పూజలో ఉండవలసిన నిష్ఠ గురించి చెప్పటం జరిగింది. ఎంత నిష్ఠ ఉంటే అంత ఫలితం.మనసు పెట్టకుండా ఎంత పూజ చేసినా ఫలితం శూన్యం. “ చిత్తశుద్ధి లేని శివ పూజ” వృధా. ఊరికే మనసులో కోరుకున్నా చాలదు. క్రియ కూడా ఉండాలి. అంటే త్రికరణశుద్ధి ఉండాలి. నోటితో మంత్రం జపిస్తూ, మనసుతో ధ్యానం చేస్తూ, చేతితో పూజ చేస్తూ ఉండాలన్న మాట.
ఈ విషయాన్ని చక్కని అర్థాంతరన్యాసాలంకారంలో చెప్పాడు ధూర్జటి.

డాక్ట‌ర్ అనంత ల‌క్ష్మి
Advertisement

తాజా వార్తలు

Advertisement