Thursday, April 25, 2024

శ్రీ కాళహస్తీశ్వర శతకం

71. రోసిందేటిది? రోత లేటివి? మనోరోగస్థు డై, దేహి తా(
బూసిందేటిది? పూత లేటివి? మదా పూతంబు లీ దేహముల్
మూసిందేటిది? మూత లేటివి? సదా మూఢత్వమే కాని తా(
జేసిందేటిది? చేత లేటివి? వృథా శ్రీకాళహస్తీశ్వరా!
ప్రతిపదార్థం: శ్రీకాళహస్తీశ్వరా!, దేహి్స దేహధారి అయిన మానవుడు, తాను-తాను, మనోరోగస్థుడు- ఐ- మానసికరోగి అయి (అజ్ఞాని యై), రోసింది- ఏటిది్స విరక్తి చెందినది దేనిపైన?, రోతలు- ఏటివి-అటువంటి వైరాగ్యాలు ఏపాటివి?, పూసింది- ఏటిది- పూసుకున్నది ఏమిటి?, పూతలు- ఏటివి- ఆ విభూతి పూతలుఎటువంటివి?, ఈ దేహముల్- ఈ శరీరాలు, మదాపూతంబులు- మదము ( గర్వం) తో నిండినవి. సదా- ఎల్లప్పుడు, మూఢత్వము- ఏ- మూర్ఖత్వమే, కాని- తప్ప, మూసింది- ఏటిది- మూసింది ఏమిటి, మూతలు- ఏటివి- మూతలు ఎటువంటివి? తాన్- తాను, చేసింది-చేసినటువంటిది ఏమిటి?, చేతలు- ఏటివి- చేష్టలు ఎటువంటివి?, వృథా- అన్నీ వ్యర్థం ( నిష్ఫలం).
తాత్పర్యం: శ్రీకాళహస్తీశ్వరా! మానవుడు మానసికస్వాస్థ్యం లేనివాడై, అంటే, అజ్ఞానంతో, విరక్తి చెందాను అంటాడు. కాని, ఆ విరక్తి దేని మీద? జ్ఞానం లేని ఆ వైరాగ్యం ఎటువంటిది? ఎందుకు? శరీరం మీద విభూతి పూశానుఅంటాడు. శరీరాలు మదంతో పూయబడి( నిండి) ఉండగా విభూతి పూత లెందుకు? ఇంద్రియాలను ముఖ్యంగా కన్నులనిమూశానుఅంటాడు. లోపల ఉన్నది మూఢత్వం అయినప్పుడు కళ్ళని, ఇంద్రియాలని మూసి, అనగా ధ్యానం చేసి, ప్రయోజనం ఏముంది? సత్కార్యాలు చేశాను అనిచెపుతాడు, కాని, అవి నిష్ప్రయోజన మైనప్పుడు ఆ పనులు ఎటువంటివి? అన్నీ వృథ.
విశేషం: ఈ పద్యంలో భక్తి, ధ్యానం మొదలయిన వాటి విషయంలో కనపడే ఆడంబరాలని నిరసించటం ఉంది. వాంఛలు పోనివాడు విరక్తుడైనాననటం, మదం తగ్గనివాడు విభూతి పూత పూయటం, ఆత్మజ్యోతిని దర్శించనివాడు కళ్ళు మూసి ధ్యానం చేస్తున్నానని నటించటం, ఎవరికి ఉపయోగం లేని పనులు చేసి పుణ్యకార్యాలు చేశా ననటంఆడంబరమే కాని నిష్ప్రయోజనం. ఇటువంటి దంభాచారాలువృథ.

డాక్ట‌ర్ అనంత ల‌క్ష్మి
Advertisement

తాజా వార్తలు

Advertisement