Wednesday, April 24, 2024

శ్రీ కాళహస్తీశ్వర శతకం

35. దినముంజిత్తములో సువర్ణ ముఖరీ తీర ప్రదేశామ్ర కా
ననమధ్యోపలవేదికాగ్రమున, నానందంబునంబంకజా
సన నిష్ఠ న్నినుజూడగన్ననదివోసౌఖ్యంబులక్ష్మీ విలా
సినిమయానటనల్సుఖంబులగునే? శ్రీకాళహస్తీశ్వరా!
ప్రతిపదార్థం : శ్రీకాళహస్తీశ్వరా!, దినమున్- ప్రతిదినమును, చిత్తములోన్- మనస్సులో, సువర్ణ ముఖరీ- స్వర్ణ ముఖీ నదీ, తీరప్రదేశ- ఒడ్డు నందున్న, ఆమ్రకానన- మామిడి తోట, మధ్య-మధ్య నున్న, ఉపల- రాతి, వేదిక- అగ్రమునన్- అరుగు పై భాగాన, పంకజ- ఆసన- నిష్ఠన్- పద్మాసనమున ఏకాగ్రతతో ఉన్న, నిన్ను-నిన్ను, ఆనందంబునన్- ఆనందంతో, చూడన్- కన్నన్- చూడకలిగినట్లైతే, అదివో- అదియే , సౌఖ్యంబు- సుఖం. లక్ష్మీవిలాసిని- లక్ష్మీదేవి, మయానటనల్- భ్రమ గొలిపేవర్తనలు, సుఖంబులు- అగును్శ ఏ- సుఖాన్ని కలిగిస్తాయా?
తాత్పర్యం: శ్రీకాళహస్తీశ్వరా!ప్రతిదినమునుస్వర్ణముఖీనదీ తీరము నందలిమామిడితోటలోనిఱాతి అరుగు మీద పద్మాసనంలో కూర్చుండి, ఏకాగ్రతతో ఆనందస్వరూపుడవైన నిన్ను చూడగలగటంఆనందదాయకమా? లేక చంచల స్వభావి అయిన లక్ష్మీదేవి యొక్క మాయతో కూడిన నటనలు ఆనందాన్ని కలిగిస్తాయా? (కలిగించవు అని భావం)
విశేషం: శివుడు ఆనందస్వరూపుడు. లక్ష్మివిమాయనటనలు. ఎవరి వల్ల జీవులకి ఆనందం లభిస్తుందో స్పష్టమే కదా! నమ్మినదైవం యొక్క చిత్రం ముద్రించబడేది “ ద్రుతచిత్తము” ననే కదా! కనుక మనస్సు మొదలైన పదాలు ఉపయోగించక “చిత్తము” అనటం జరిగింది. ఇంద్రియ వృత్తులు లీనమైన స్థితిలో ఉన్న మనస్సే చిత్తం. యోగసాధనకి అనుకూలమైనది పద్మాసనం. యోగీశ్వరు డైన శివుడు పద్మాసనంలో ఉండటమే సహజం. సాధకుడు కూడా పద్మాసనంలో ఉంటేనే సాధన సవ్యంగా సాగుతుంది. భక్తుల విషయంగా మరొక విధంగా కూడా అన్వయం చేసుకోవచ్చు – చిత్తం అనే పద్మంలో నిష్ఠతో నిలుపుకున్న ఆరాధ్యదైవం అని చెప్పుకోవచ్చు.

డాక్ట‌ర్ అనంత ల‌క్ష్మి
Advertisement

తాజా వార్తలు

Advertisement