Monday, September 25, 2023

శ్రీ కాళహస్తీశ్వర శతకం

34. చావం గాలము చేరువౌటెరింగియున్జాలింప(గా లేక త
న్నేవైద్యుండు చికిత్స( బ్రోవగలడో? ఏ మందు రక్షించునో?
ఏ వేల్పుల్కృప ( జూతురోయనుచునిన్నింతైన( జింతింప( డా
జీవ చ్ఛ్రాద్ధముచేసికొన్నయతియున్శ్రీకాళహస్తీశ్వరా!
ప్రతిపదార్థం : శ్రీకాళహస్తీశ్వరా!, ఆ జీవత్- శ్రాద్ధము-జీవించి యుండగా తనకు తను చేసుకునే అపరకర్మలు, చేసికొన్న-చేసుకున్న, యతియు- సన్యాసి కూడ, చావన్- చచ్చుటకు, కాలము-సమయము, చేరువ- ఔట- దగ్గర పడుచుండుట, ఎరిగియున్- తెలిసికొని కూడ, చాలింప- కాన్- సరిపుచ్చలేక, జీవితాన్ని వదల లేక, తన్ను- తనను, ఏ వైద్యుండు- ఏ భిషక్కు, చికిత్సన్- వైద్యం చేసి, ప్రోవన్- కలడో- రక్షించ గలడో?, ఏ మందు- ఏ ఔషధం, రక్షించును- ఓ- కాపాడుతుందో ?, ఏ వేల్పుల్- ఏ దేవతలు, కృపన్- చూతురు- ఓ- దయ తలుస్తారో?, అనుచు- అనుకుంటూ, నిన్ను- నిన్ను, ఇంత- ఐనన్- కొంచెమైనా, చింతింపడు- తలచుకోడు.
తాత్పర్యం: శ్రీకాళహస్తీశ్వరా! తాను జీవించి ఉండగానే తన శ్రాద్ధంతానే పెట్టుకున్న సన్న్యాసి కూడ, మరణకాలమాసన్నమైనది తెలిసినా, బ్రతుకు మీది తీపి చంపుకో లేక తనను ఏ వైద్యుడు చికిత్సచేసి రక్షిస్తాడా? ఏ మందు రోగం నుండి కాపాడుతుందా? ఏ దేవతలు రక్షిస్తారా? అనిఆలోచిస్తాడే కాని, ఆయువులో మిగిలి ఉన్న కొద్ది సమయం లోనైనా, కొంచెమైనా నిన్ను తలచుకోడు.
విశేషం: సామాన్య మానవులు జీవనభ్రాంతులవటం అజ్ఞానం వల్ల అని సద్ది చెప్పుకోవచ్చు. కాని, సన్న్యాసులు సైతం, చివరిక్షణంలో కూడ బ్రతుకుపై వ్యామోహం వదలలేక పోవటమే ఆశ్చర్యం కలిగిస్తుంది. సన్న్యాసులు దీక్ష తీసుకునేప్పుడే అంతకు ముందు గడిపిన జీవితానికి తిలోదకాలివ్వటం జరుగుతుంది. దీక్షాస్వీకారంమరొకజన్మ. అందుకే ఇంటి పేరు కూడా మారుతుంది. తాను ఒక జన్మ నుండి మరొక జన్మకు మారటం చూసిన వారికే మరణం అంటే అంత భయం ఉంటే, సామాన్యుల కెంత ఉంటుంది? దానిని గెలవటమే మృత్యుంజయత్వం.

డాక్ట‌ర్ అనంత ల‌క్ష్మి
Advertisement

తాజా వార్తలు

Advertisement