Friday, March 29, 2024

శ్రీ కాళహస్తీశ్వర శతకం

32. రోసీ రోయదు కామినీ జనుల తారుణ్యోరుసౌఖ్యంబులన్
బాసీపాయదు పుత్ర మిత్ర జన సంపద్భ్రాంతి, వాంఛా లతల్
కోసీ కోయదు నా మనం బకట! నీకుంబ్రీతిగాసత్క్రియల్
చేసీ చేయదు, దీని త్రుళ్ళడపవేశ్రీకాళహస్తీశ్వరా!
ప్రతిపదార్థం : శ్రీకాళహస్తీశ్వరా!, నా మనంబు- నా మనస్సు, కామినీ జనుల- స్త్రీల, తారుణ్య- యవ్వన సంబంధమైన, ఉరు-గొప్ప, సౌఖ్యంబులన్- సుఖాలని, రోసీరోయదు- ఏవగించు కొంటుంది, ఏవగించుకోదు (ఇష్టం లేనట్టు పైకి కనపడుతుంది కాని, లోపల విరక్తి లేదు), పుత్ర- కుమారుల, మిత్ర- స్నేహితుల, జన- సముదాయాల మీద, సంపత్- ఐశ్వరాల మీద, భ్రాంతి- వ్యామోహం, పాసీపాయదు-విడిచి నట్టు ఉంటుంది కాని విడిచి పెట్టదు, వాంఛాలతల్- కోరికలనే తీగలని, కోసీ కోయదు- త్రెంచి నట్లుందే కాని, త్రెంచదు. నీకున్- నీకు, ప్రీతి-కాన్- సంతోషం కలిగేట్టు, సత్క్రియల్- సత్కార్యాలని, (మంచిపనులని),చేసీచేయదు- చేసి నట్టుఉంటుందేకాని, చేయదు. దీని- ఈ మనస్సు యొక్క, త్రుళ్లు- చాంచల్యాన్ని, అడపవు- ఏ- అణచి వేయవా? (మనస్సుకి స్థిరత్వం ఇవ్వమని భావం.)
తాత్పర్యం:శ్రీకాళహస్తీశ్వరా! నా మనసు స్త్రీల యవ్వనసంబంధమైన సుఖముల ఎడ పూర్తిగా విరక్తం కాలేదు. పుత్రులు, మిత్రులు, సంపదలు మొదలైన వాటిపై భ్రమని పూర్తిగా విడువదు. కోరికలనేలతలని పూర్తిగా తెగ కొట్టదు. నీకు సంతోషం కలిగేట్టుపుణ్యకార్యాలు చేయదు. నా మనస్సు యొక్క పొంగును అనగా చాంచల్యాన్ని అణచి స్థిరత్వాన్ని ప్రసాదించు.
విశేషం: మానవమనస్తత్వాన్ని గూర్చి, ఎంతో శోధించి చెప్పిన మాట ఇది. పెద్దలమాట, గ్రంథపఠనం మొదలైనవి సదాలోచనలని(పురాణ, ప్రసూతి, స్మశాన వైరాగ్యాదాదులు) కలిగించినా, వాటి ప్రభావం తాత్కాలికంగా ఉండి అంతరాంతరాలలో, అసలైన సహజలక్షణమే ఉండి, బయటపడుతూ ఉంటుంది. మూలంలో మార్పు కలిగించ మని ధూర్జటి ప్రార్థన. మనోవ్యాపారము నడచి, చిత్తానికి స్థిరతని కల్పించ మని వేడుకున్నాడు ధూర్జటి.

డాక్ట‌ర్ అనంత ల‌క్ష్మి
Advertisement

తాజా వార్తలు

Advertisement