Saturday, April 13, 2024

శ్రీ కాళహస్తీశ్వర శతకం

  1. రాజుల్ మత్తులు వారి సేవ నరక ప్రాయంబు,వారిచ్చు నం
    భోజాక్షీచతురంతయానతురగీభూషాదులాత్మ వ్యథా
    బీజంబుల్,తదపేక్ష చాలు(,బరితృప్తింబొందితిన్,జ్ఞానల
    క్ష్మీజాగ్రత్పరిణామమిమ్ము దయతో శ్రీకాళహస్తీశ్వరా!
    ప్రతిపదార్థం: శ్రీకాళహస్తీశ్వరా!,రాజుల్- రాజులు,మత్తుల్-ఐశ్వర్యము చేత మదించి,పొగరెక్కి ఉన్న వారు. వారి సేవ- ఆ రాజుల కొలువు, నరక ప్రాయంబు- నరకముతో సమానము. వారు-ఇచ్చు- ఆ రాజులు ఇచ్చే, అంభోజ- అక్షీ- పద్మం వంటి కన్నులు కల స్త్రీలును,చతురంతయాన-పల్లకీలును,తురగీ-గుర్రములును, భూష- ఆదులు- నగలు మొదలైనవి,ఆత్మవ్యధా-ఆత్మపరమైన దుఃఖమునకు,బీజంబులు-విత్తనముల వంటివి (అనగా కారణములు),తత్- అపేక్ష- వానిపై వ్యామోహము, చాలు- చాలును. పరితృప్తిన్-పరిపూర్ణమైన సంతృప్తిని,పొందితిన్-పొందాను. దయతో-కరుణతో, నా పై కరుణించి,జ్ఞానలక్ష్మీ- జ్ఞానము అనే సంపదల వలన జాగ్రత్-మేలుకొనుచుండునట్టి, పరిణామము-క్రమవికాసమును, ఇమ్ము-ప్రసాదింపుము.
    తాత్పర్యం;శ్రీకాళహస్తీశ్వరా! రాజులు తమ సంపదల ఆధిక్యముతో పొగరెక్కికన్నుమిన్నుకానకున్నారు. అటువంటి రాజుల కొలువు నరకముతో సమానము. ఆ సేవకి ప్రతిఫలంగా వారిచ్చేటువంటిసుందరీమణులు ( పరిచారికాజనము),పల్లకీలు ్స (భోగాలు), గుర్రాలు ( ఆడంబరాలు),బంగారునగలు మొదలైనవి జీవునికి‘ఆత్మ’ వ్యధను కలిగించటానికి మూలములు. అవి కావాలనే కోరిక అంతమైంది. వాటి నన్నింటిని పొంది, అనుభవించి, సంతృప్తి పొందాను. ఇంక జ్ఞానము అనే సంపద వలన మేలు కొనేటువంటి క్రమ వికసమునుఅనగా జ్ఞానము వలన పొందదగిన ముక్తిని ప్రసాదింపుము.
    విశేషం: ఈ పద్యంలో రాజనిరాసనము కనపడుతుంది. ఇది ధూర్జటి యొక్క, అతడిని ఆదరించి పోషించిన శ్రీకృష్ణదేవరాయల యొక్క వ్యక్తిత్వాలకి నిలువుటద్దం. రాజులని మత్తులు అనటానికి ధూర్జటికి ఎంత ధైర్యం ఉండాలో, వినటానికి, విని ఊరకోవటమే కాదు సన్మానించటానికి రాయలకంతకంటే గొప్ప ఔదార్యం ఉండాలి. రాజులిచ్చే సంపదలు లౌకిక మైనవి. లౌకికవాంఛలనుపెంచేవి. కాని,శ్రీకాళహస్తీశ్వరుడు,జ్ఞానప్రసూనాంబికాపతి ఇచ్చే సంపద అనగా జ్ఞానం అలౌకిక మైనది, దివ్యమైనది. దాని వలన లభించేది శాశ్వతమైన సంపద – ముక్తి.
    ధూర్జటి రాజులిచ్చే సంపదలు, భోగాలు,అన్నింటిని అనుభవించి,చాలునని సంతృప్తి చెంది, అవి ‘ఆత్మ’కు వ్యథ కలిగిస్తాయని గుర్తించి, శాశ్వతమైన దానిని,ఆత్మవికాసము కలిగించే దానిని కోరాడు.
డాక్ట‌ర్ అనంత ల‌క్ష్మి
Advertisement

తాజా వార్తలు

Advertisement