Friday, April 26, 2024

మనసారా… మొక్కులు

ఉమ్మడి వరంగల్‌ /భూపాలపల్లి ప్రతినిధి, ప్రభన్యూస్‌ బ్యూరో: మేడారం సమ్మక్కసారలమ్మ జాతర చివరి అంకానికి చేరుకుంది. ఆదివాసీల ఆరాధ్య దైవాలు భక్తుల కొంగు బంగారం సమ్మక్క సారలమ్మలు గద్దెల పై కొలువు దీరారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ నలుమూలల నుండి లక్షలాదిగా భక్తులు తరలివచ్చి తల్లులకు మొక్కులు తీర్చుకున్నారు. బుధవారం కన్నెపల్లి నుండి సారలమ్మ రాగా గురువారం చిలుకల గట్టు నుంచి సమ్మక్క గద్దెకు చేరడంతో తల్లి బిడ్డల దర్శణం కోసం గద్దెల ప్రాంగణం భక్తులతో కిక్కిరిసి పోయింది. తల్లులిద్దరు కొలువుదీరిన తర్వాతనే దర్శణం చేసుకునేందుకు భక్తజనంతో పాటు కేంద్ర పర్యాటక సాంస్కృతిక ఈశాన్య రాష్ట్రాల అభివృధ్ధి శాఖల మంత్రి జి. కిషన్‌ రెడ్డి , కేంద్ర గిరిజన శాఖ మంత్రి రేణుక సింగ్‌ తల్లులను దర్శించు కుని నిలువెత్తు బంగారాలు సమర్పించుకున్నారు. అలాగే రాష్ట్ర మత్స్యశాఖ పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ , కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగులా కమలాకర్‌ ,తెలంగాణ తొలి స్పీకర్‌, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూధానాచారి , స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డి, మహబూబాబాద్‌ ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్‌, పెద్ది సుదర్శన్‌ రెడ్డి, నన్నపునేని నరేందర్‌, గండ్ర వెంకట రమణారెడ్డి తదితరులు తల్లులకు నిలు వెత్తు బంగారంతో పాటు పూలు పండ్లు, చీరె సారే, గాజులు, పసుపు కుంకుమ సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్‌ పార్లమెంట్‌ సభ్యులు బండి సంజయ్‌ వనదేవతలను దర్శిం చుకుని మొక్కులు చెల్లించుకున్నారు. రూపాలు లేని ఆదిపరాశక్తులుగా భక్తుల ఆరాధ్య దైవాలుగా కొలువబడుతున్న సమ్మక్క సారలమ్మలు కోట్లాది మంది భక్తుల మొక్కులను స్వీకరించారు. దట్టమైన కీకారణ్యంలో చెట్టుకొకరు పుట్టకోకరు అన్నట్లుగా విడిది చేసినప్పటికి కనీసం చిన్న చీమ కూడా హాని తలపెట్టకుండా మూడు రోజుల పాటు మేడారంలో భక్తులు బస చేస్తున్నారటే అదంతా తల్లుల మహిమ వల్లనే అని భక్తుల ప్రగాఢ విశ్వాసం నమ్మకం. సంతానం లేని వారికి సంతానం కల్పిస్తూ , అనారోగ్యంతో బాధపడే వారికి ఆరోగ్యం కల్పిస్తూ రక రకాల సమస్యలతో వచ్చే భక్తుల కష్టాలను కన్నీళ్ళను తుడుస్తూ వారికి సంపూర్ణమైన ఆశీర్వాదం ఇస్తున్నారు. ధనిక ,పేద తారతమ్యం లేకుండా తమ వద్దకు వచ్చే భక్తులందరు ఒకే విధంగా మొక్కులు చెల్లించుకోవడం ఇక్కడ ఆనవాయితి. నిరుపేద భక్తులు పెద్దమొత్తంలో కానుకలు సమర్పించుకోవడం సాధ్యం కాదు కాబట్టే బెల్లన్నే బంగారంగా భావించి తమ కానుకగా స్వీకరించి భక్తుల కొరికలను ఆ మహిమాన్విత తల్లులు తీరుస్తున్నారు. గురువారం రాత్రి నుండి లక్షలాది మంది భక్తులు తల్లుల దర్శణాలు చేసుకుని మొక్కులు సమర్పించుకుంటున్నారు. జాతరలోని భక్తుల దర్శణార్ధంతో పాటు వివిధ ప్రాంతాల నుండి వచ్చే ప్రముఖుల దర్శనాలను రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు, రాష్ట్ర దేవాదయా శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి దగ్గరుండి పరిశీలించారు. కేంద్ర మంత్రులు కిషన్‌ రెడ్డి, రేణుకా సింగ్‌లు రాగా వారికి స్వాగతం పలుకడంతో పాటు దగ్గరుండి తల్లుల దర్శణం చేయించారు. అదె విధంగా రాష్ట్ర మంత్రులు మల్లారెడ్డి, శ్రీనివాస్‌ యాదవ్‌, గంగుల కమలాకర్‌ రాగా వారికి కూడా తల్లుల దర్శణం చేయించారు. గద్దెల ప్రాంగణ ంలో భక్తుల మొక్కులతో పాటు ఎలాంటి తొక్కిసలాట లేకుండా మీడియా పాయింట్‌ నుండి మంత్రి దయాకర్‌రావు స్వయంగా భక్తులకు పలు సూచనలు చేశారు.
వాయిదా పడిన సీఎం కేసీఆర్‌ పర్యటన
వన దేవతలను దర్శించుకునేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ వస్తారని రాష్ట్రమంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు,అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి, అధికార యంత్రాంగం విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. శుక్రవారం 11.00 గంటలకు మేడారం చేరు కున్న సీఎం మద్యాహ్నం 3 .00 గంటల వరకు ఇక్కడే ఉంటారని మంత్రి దయాకర్‌రావు సీఎం టూర్‌షెడ్యూల్‌ను గురువారం ప్రకటించారు. శుక్రవారం తల్లుల దర్శణానికి వచ్చిన కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డితో పాటు శ్రీనివాస్‌ యాదవ్‌, గంగులా కమలాకర్‌, ఎర్రబెల్లి దయారకర్‌రావులు ఏదిఏమైనా ముఖ్యమంత్రి సమ్మక్క జాతరకు వచ్చి వెళతారని ప్రకటించారు. కానీ చివరి నిమిషంలో అనివార్యకారణాలతో సీఎం కేసీఆర్‌ పర్యటన వాయిదా పడటం, భక్తులను, ఈప్రాంత ప్రజలను కొంత నిరాశకు గురిచేసింది. సీఎం కేసీఆర్‌ వచ్చి నట్లయితే మేడారం కేంద్రంగా నర్సింగ్‌కళాశాల మంజూరు చేయించుకోవాలని స్థానికశాసన సభ్యురాలు దనసరి సీతక్క ఎదురు చేశారు. అదేవిధంగా జాతరలో శాశ్వత ఏర్పాట్లకు నిధుల కేటాయింపుకు ఈ ప్రాంత అభివృధ్ధికి ప్రత్యేక నిధులు ఇస్తారనే ఆశతో ఈ ప్రాంత ప్రజలు ఎదురు చూడగా సీఎం రాకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు.

నేడు వన ప్రవేశం
తల్లుల వన ప్రవేశంతో చివరి ఘట్టం ముగియనున్నది. బుధవారం కన్నెపల్లి నుండి సారలమ్మ, పునుగండ్ల కామారం నుండి పగిడిద్ద రాజు, కొండాయి నుండి గోవింద రాజుల రాకతో మొదలయ్యే మహాజాతర గురువారం సమ్మక్క రాకతో జాతర ప్రధాన ఘట్టంగా భక్తులు భావిస్తారు. తల్లిబిడ్డలు గురు వారం రాత్రికి గద్దెల పై కొలువుదీరడంతో భక్తులు తల్లులిద్దరికి తమ మొక్కులను మనసారా చెల్లించుకుంటారు. గురువారం రాత్రి మొదలైన మొక్కులు శనివారం మధ్యా హ్నం వరకు నిరంతరా యంగా గంగా ప్రవాహంలా మొక్కులు కొనసాగుతూనే ఉంటాయి. శనివారం మధ్యాహ్నం తర్వాత గద్దెలను శుద్ది చేసి ఆదివాసి సంస్కృతి సాంప్రదాయాలతో తల్లులను గద్దెల పైకి తీసుకువచ్చే సమయంలో ఏ విధమైన పూజాతంతు నిర్వహిస్తారో తిరిగి వన ప్రవేశం కోసం కూడా గద్దెల పై కూడా అదే విధమైన పూజా కార్యక్రమాలు నిర్వహించి సాయంత్రంకల్లా వన ప్రవేశం కార్యక్రమం పూర్తి చేస్తారు. యధావిధంగా సమ్మక్కను చిలుకల గట్టును సారలమ్మను కన్నెపల్లికి, పగిడిద్దరాజును పునుగండ్ల కామారంకు, గోవింద రాజును కొండాయికి తీసుకువెళ్లడ ంతో జాతర మహా ఘట్టం పూర్తవుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement