Thursday, March 28, 2024

మేడారం జాత‌ర‌కు స‌ర్వం స‌న్న‌ద్ధం

వ‌రంగ‌ల్ : సకల సౌభాగ్యాలను ప్రసాదించే వన దేవతలు సమ్మక్క, సారలమ్మ మహా జాతర అతికొద్ది రోజుల్లోనే ప్రారంభంకానుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు వనదేవతల మహా జాతర జరగనుంది. 18న భక్తులు మొక్కులు తీర్చుకునే కార్యక్రమం, 19న అమ్మవార్ల వన ప్రవేశంతో ఈ జాతర ముగుస్తుంది. కోరిన వరాలు ఇచ్చే వనదేవతల మహాజాతర ఆసియాలోనే అతిపెద్ద జాతర. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి సైతం ప్రజలు అమ్మవారిని దర్శించుకోవడానికి క్యూలు కడుతుంటారు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర తాడ్వాయి మండలంలో ఈ ఏడాది ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు నిర్వహిస్తారు. 2022లో జరిగే మేడారం మహా జాతర సమ్మక్క సారలమ్మ గద్దె ప్రాంగణం పూజారుల సంఘం ప్రకటించింది. విగ్రహాలు లేని అతిపెద్ద జాతర మేడారం జాతర. భారతదేశంలోని అతి పెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందిన ఈ ఉత్సవంలో గిరిజనుల ఆచారాలను సంప్రదాయాలను ఈ సమ్మక్క సారలమ్మ జాతర ప్రతిబింబిస్తుంది. దేశం నలుమూలల నుండి కోట్లాదిమంది జనం తరలివస్తారు. ప్రతి రెండేళ్లకోసారి నిర్వహించే ఈ మహా జాతర మాఘ శుద్ధ పౌర్ణమి రోజున మొదలవుతుంది. ఆ రోజు నుంచి మొదలయ్యే నాలుగు రోజులపాటు ఈ జాతర జరుగుతుంది. కుంభమేళ తర్వాత కోట్ల జనం తరలి వచ్చే ఏకైక జాతర మేడారంగా గుర్తించబడింది. అందుకే భక్త జనాలకు ఎటువంటి సమస్యలు రాకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలను ఏర్పాటు చేస్తోంది. ఈ జాతరకు కోటిన్నరకు పైగా భక్తులు వస్తారని అధికారులు అంచనా వేసారు. కాగా కరోనా విజృంభిస్తున్నవేళ రాష్ట్రప్రభుత్వం ఎన్నో కట్టుదిట్టమైన చర్యలను తీసుకోనుంది. జాతరకు కావాల్సిన అన్ని ప్రణాళికలను సిద్దం చేసే పనిలో పడింది. కాగా ఆ జాతరకు ఇప్పటికే రూ.75 కోట్లను కేటాయించినట్టుగా తెలంగాణ రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్ తెలియజేశారు. జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా అన్ని సౌకర్యాలు చేస్తున్నట్టు ఆమె తెలిపారు. అలాగే మాస్కులు తప్పనిసరిగా ధరించే రావాలని ఆమె సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement