Monday, November 11, 2024

శరన్నవరాత్రుల్లో హైలెట్‌గా పురాణపండ మంత్ర పేటికలు

విజయవాడ, (ఆంధ్రప్రభ) : విజయవాడ, తిరుమల, రాజమహేంద్రవరం, కాకినాడ, విశాఖపట్నం, హైదరాబాద్‌ వంటి నగరాల్లో శరన్నవ రాత్రులు శ్రీచక్ర కుంకుమార్చనలు, చండీహోమాలు, యాగాలు, పారాయణాలతో అద్భుతంగా జరిగాయి. ఈ నేపథ్యంలోనే మంగళప్రదంగా అరిష్టాలు పోగొట్టే మహామంత్ర రాశుల్ని స్తోత్రమంత్ర కలశాలుగా ఆయా ప్రాంతాలన్నింటిలోనూ ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్‌ రచనా సంకలనాలు వేలాదిమంది భక్తులకు పంచడం, పవిత్ర పారవశ్యపు జ్ఞాపకంగా మిగిలిందని పండిత భక్తబృందాలు పేర్కొంటున్నాయి.

ప్రముఖ రచయిత, శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారు పురాణపండ శ్రీనివాస్‌ అమోఘ భక్తిసాధనాలుగా అందించిన దుర్గే ప్రసీద, దేవీం స్మరామి, సౌభాగ్య, శ్రీనిధి, హరేహరే.. పులకిత గ్రంథాలు ఈసారి శరన్నవరాత్రోత్సవాల్లోనే ఆవిష్కరణలు జరుపుకోవడం, భక్తకోటికి చేరడం పురాణపండ శ్రీనివాస్‌ పుర్వజన్మ సుకృతంగా పేర్కొంటున్నారు.

దేవీం స్మరామి, దుర్గేప్రసీద గ్రంథాలను బెజవాడ శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం డిప్యూటీ కలెక్టర్‌ ఆవిష్కరించగా, తిరుమల శ్రీవారి మహోత్సవ బ్రహ్మోత్సవం సందర్భంగా శ్రీనివాసుని లావణ్య వైభవంగా అందించిన హరేహరేని ఆంధ్రప్రదేశ్‌ దేవాదాయ శాఖా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆవిష్కరించి పురాణపండ శ్రీనివాస్‌ అవిశ్రాంత పవిత్రకృషిని ప్రశంసించారు.

సౌభాగ్య గ్రంథాన్ని దగ్గరుండి విజయవాడ ఎమ్మెల్యే సుజనాచౌదరి, ఎంపీ కేశినేని చిన్ని భక్తులకు పంచడం ఆకర్షించింది. ఈవొ రామారావు మాట్లాడుతూ ఈ సంవత్సరం వందలకొలది వేదపండితులు, రాజకీయ ప్రముఖులకు పురాణపండ శ్రీనివాస్‌ రచన సంకలనాలు పవిత్ర కానుకలుగా అమ్మవారి సన్నిధానంలో బహూకరిస్తుంటే, వారి పారవశ్యం, ఆనందం ఆశ్చర్యపరచిందని, అది పురాణపండ కృషికి నిదర్శనమని తెలిపారు.

ఏదేమైనా ఈసారి తెలుగురాష్ట్రాల్లో ప్రధానశాక్తేయ ఆలయాలతో పాటు తిరుమల బ్రహ్మోత్సవాల్లో సైతం పురాణపండ రచనలకు అటు బెజవాడ దుర్గమ్మ, ఇటు తిరుమల వేంకటేశ్వరుని అనుగ్రహం కూడా పుష్కలంగా లభించిందని సాక్షాత్తూ రామనారాయణరెడ్డి తెలపడం విశేషం. రాజమహేంద్రవరం దేవీచౌక్‌ ఉత్సవాల్లో వందలమంది సౌభాగ్య గ్రంథాన్ని స్వీకరించి, పొందిన ఆనందం మాటల్లో చెప్పలేనిదని దేవీ ఉత్సవ కమిటీ సభ్యులు సంతోషం వ్యక్తం చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

- Advertisement -

ఇక హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ లోని కొన్ని ప్రధాన ఆలయాల్లో ఈ గ్రంథాలకు దక్కిన గౌరవం అంతాఇంతా కాదు. ఆణిముత్యాలాంటి గ్రంథ వైభవాలతో, సౌందర్యలహరులు పొంగించి వ్యాఖ్యానాలతో తెలుగు ప్రజల మనస్సుల్లో ఒక పవిత్ర స్థానాన్ని మహా సంకల్పంతో.. రేయింబవళ్లు కృషితో, నిస్వార్థంగా గెలుచుకుంటున్న పురాణపండ శ్రీనివాస్‌ పవిత్ర గోదావరి జిల్లా వాసి కావడం మరొక ముఖ్యాంశంగానే చెప్పాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement