Thursday, October 10, 2024

మాండుక్యోపనిషత్‌ : జీవా గురుకులం వారి సౌజన్యంతో… (ఆడియోతో…)

మాండూక్యోపనిషత్తు సర్వం తానైన ఓంకారపు విశిష్టతను వివరిస్తుంది.

ఓం భద్రం కర్ణేభి: శృణుయామ దేవా: భద్రం పశ్యేమాక్షభిర్యజత్రా |
స్థిరైరంగైస్తుష్టువాగ్‌ం సస్తనూభి:| వ్యశేమ దేవహితం యుదాయు: |
స్వస్తి న ఇంద్రో వృద్ధ శ్రవా:| స్వస్తి న: పూషా విశ్వావేదా:|
స్వస్తి నస్తార్‌క్ష్యో అరిష్టనేమి:| స్వస్తి నో బృహస్పతిర్ద ధాతు ||

ఓమిత్యేతదక్షరం ఇదం సర్వం,
తస్యోపవ్యాఖ్యానం, భూతం భవత్‌
భవిష్యదితి సర్వమ్‌ ఓంకార ఏవ
యచ్చాన్యత్‌ త్రికాలాతీతం తదప్యోంకార ఏవ

ప్రణవాన్ని ఓం కారమంటారు. ఈ ప్రణవాన్ని ప్రతిపాదించేది పరబ్రహ్మమునే. ఈ ప్రణవాన్ని నాలుగు పాదములుగా విశ్లేషణం చేస్తారు. అకార, ఉకార, మకార, నాదములనే ప్రణవములోని నాలుగు అంశాములు. ఈ నాలుగు అంశములకు కూడానూ ప్రతిపాద్యమైన వస్తువు పరమాత్మయే. అనిరుద్ధ, ప్రద్యుమ్న, సంకర్షణ, వాసువేద శబ్దములచే చెప్పబడు పరమాత్మ వ్యస్త ప్రణవ ప్రతిపాద్యము. పరంబ్రహ్మ, నారాయణ, పురుషోత్తమ మొదలైన శబ్దములచే చెప్పబడు పరమాత్మ సమస్త ప్రణవ ప్రతిపాద్యుడు.

- Advertisement -

ఓంకారమును సమస్త ప్రణవమని, అఖండ ప్రణవమని అంటారు. సమస్త, వ్యస్త ప్రణవములు రెండునూ పరమాత్మనే ప్రతిపాదిస్తాయి. ఓమ్‌ అని ఏ బ్రహ్మ చెప్పబడుచున్నదో దానిని అక్షరము అందురు. ‘న క్షరతి ఇతి అక్షరం’ అని వుృత్పత్తి అర్థము. అనగా ఎప్పుడూ కూడా స్వరూపమును బట్టి కానీ, స్వభావమును బట్టికానీ ఎటువంటి మార్పునకు లోనుకానిది అని అర్థము. ఎల్లప్పుడూ ఒకేలా ఉండునది కనుక ఆ పరమాత్మతత్త్వము సత్యము అని ఉపదేశించబడుచున్నది. అటువంటి పరమాత్మ తత్త్వమును నచికేతునికి ఉపదేశింపదలచి యమధర్మరాజు కఠోపనిషత్‌లో ‘హే నచికేతా! వేదములన్నియూ ప్రాప్యమైన ఏ పరమాత్మ తత్త్వమును సమగ్రంగా నిరూపించుచున్నవో, ఉపనిషత్తులన్నియూ ఏ బ్రహ్మతత్త్వమునే వివరించుచున్నవో ఆ పరమాత్మ తత్త్వమును నీకు ఒక్కమాటలో చెప్తాను అంటూ ‘సంగ్రహేణ బ్రవీమి ఓమ్‌ ఇత్యేతత్‌’ అనే ప్రణవమే పరంబ్రహ్మతత్త్వమని ఉపదేశించడమే కాక, ఆ తత్త్వాన్ని పొందాలంటే కూడా ఈ ప్రణవమనే ఆశ్రయించమని, ధ్యానానికి దీనికి మించిన మరొక మంత్రము లేదని ‘ ఏతదాలంబనం శ్రేష్ఠం, ఏతదాలంబనం పరం, ఏతదాలంబనం జ్ఞాత్వా బ్రహ్మలోకే మహీయతే’ అని ‘ఈ ప్రణవోపాపన చేసినవారు వైకుంఠలోకమున పూజనీయుడగునని’ వివరిస్తాడు. అంతేకాక సాక్షాత్తుగా శ్రీకృష్ణభగవానుడే భగవద్గీతలో ‘ఓమ్‌ ఇతి ఏకాక్షరం బ్రహ్మ’ (8వ అ, 13 శ్లో). ఓంకారము పరబ్రహ్మవాచకమని చెప్పి ఉన్నాడు. కనుక పరమాత్మతత్త్వము సమస్త ప్రణవ ప్రతిపాద్యము.

‘ఓమ్‌’ అనగా ‘ ఓతం జగత్‌ అస్మిన్‌’ అని వుృత్పత్తి చెప్పుదురు. ఈ చేతన-అచేతనాత్మక ప్రపంచం ఎవనియందు అధారపడి ఉన్నదో వానిని ‘ఓమ్‌’ అని అనవచ్చును. ‘మయ సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ’ – ఈ సమస్తమైన చిదచిత్‌ వస్తు సమూహము అంతా అంతర్యామినైన నాయందు ఆధారపడినది. ఒకే దారంలో కూర్చబడిన రత్నములలాగా అని కృష్ణభగవానుడే (8వ అధ్యాయము-7వ శ్లో.) స్వయంగా చెప్పాడు. ఈ చేతనాచేతన ప్రపంచానికి ఆధారమైన పరతత్త్వము తానే అని. కనుక, ‘ఓమ్‌’ అనగా ఈ చిదచిదాత్మక ప్రపంచమునకు ఆధారభూతుడయిన పరమాత్మ అని అర్థము.

ఈ పరమాత్మయే సర్వశబ్దవాచ్యుడు. పరమాత్మ విడచిన వస్తువేదియు ప్రపంచమున లేదు. కనుక నామరూపములుకల ప్రాచీన వస్తుజాతమంతయూ పరమాత్మయే ఆత్మగా కలది కనుక శాండిల్య విద్యలో ‘సర్వం ఖల్విదం బ్రహ్మ’ అని చెప్పినట్లు ఇచట మాండూకోపనిషత్‌లో కూడా ‘సర్వం ఓంకార ఏవ’. ఓం అనునదే ఇది అంతయూ అని చెప్పబడుచున్నది. ఈ ఓంకార ప్రతిపాద్య పరమాత్మతత్త్వమే గడిచిపోయిన కాలమునందున్నది, వర్తమాన కాలమునందున్నది, రాబోవు (భవిష్యత్‌) కాలమునందుండునదని, మూడుకాలములకు సంబంధించినదని విశేషించి చెప్పవచ్చును. లేదా భూతకాలములో ఉన్న వస్తువులన్నింటికీ ఈ ప్రణవ ప్రతిపాద్య పరమాత్మయే ఆత్మగానున్నాడు.

వర్తమాన కాలములోని వస్తువులన్నింటికీ పరమాత్మయే ఆత్మగా ఆధారమై ని లిచి ఉన్నాడు. రాబోయే కాలములోని ఆగామి వస్తువులన్నింటికినీ ఈ పరమాత్మయే ఆత్మగా ఆధారభూతుడై ఉంటాడని భూతవర్తమాన భవిష్యత్‌ కాలీన వస్తువులను విశేషించి చెప్పవచ్చును. ‘విశిష్య ఆఖ్యాయతే ఇతి వ్యాఖ్యానం’- విశేషించి చెప్పునది అనికదా ‘వ్యాఖ్యానము’కు వుృత్పత్తి. ఇట్లు కన్పడే ఈ చేతనాచేతనాత్మక ప్రపంచమునకంతటికీ ఆధారభూతమైనది. ఓంకార వ్యాచమైన బ్రహ్మయేనా? మరొకటి ఏదైనా కలదా? అనెడు సందేహాన్ని తొలగించడానికి ‘సర్వం ఓంకార ఏవ’ అని ఏ వకారము ద్వారా అవధారణ చేయబడుతోంది. అవధారణమనగా ఇతర యోగవ్యవచ్ఛేదము. పరమాత్మ త త్త్వముకంటే వేరయిన దేనికీ సకల జగత్తునకు ఆత్మగానుండి ఆధారభూత మవడంలో సంబంధములేదని, పరమాత్మ మాత్రమే ఇలా కాగలడని ఇక్కడి ‘ఏవ’ కారము యొక్క తాత్పర్యము.

అందువలన కాలపరిచ్ఛేదము లేనట్టి త్రికాలాతీతమైనట్టి చేతనవర్గము కూడా పరమాత్మనే ఆత్మగా కలిగియుంది. కనుక, ఈ కన్పడే చేతనాచేతన ప్రపంచమంతయూ సమస్త ప్రణవ ప్రతిపాద్యమైన పరమాత్మయే అని మొదటిమంత్ర తాత్పర్యము.

Advertisement

తాజా వార్తలు

Advertisement