Wednesday, April 24, 2024

మల్లికార్జున జ్యోతిర్లింగము


శ్రీశైల సంగే విబుధాతి సంగే
తులాద్రి తుంగేపి ముదావసంతం!
తమర్జునం మల్లిక పూర్వమేకం
నమామి సంసార సముద్ర సేతుమ్

భావము: శ్రీశైలములో దేవతలందరూ కలసి వున్న చోట తులాద్రి శిఖరము పైన సంతోషముగా నివసిస్తున్నవాడూ సంసారమనే సముద్రానికి వారధి వంటివాడూ అయిన మల్లికార్జునుడికి నమస్కరిస్తున్నాను.

పురాణ‌గాథ‌…
విఘ్నేశ్వరుడు, కుమారస్వామి యుక్తవయసు వారగుటచేత వారికి వివాహము చేయాలని పార్వతీపరమేశ్వరులు సంకల్పించారు. వారిద్దరినీ పిలచి భూప్రదక్షిణము చేసి రమ్మనమని, ముందుగా వచ్చిన వారికి మొదట వివాహము చేస్తామని చెప్పారు. కుమారస్వామి తన నెమలి వాహనం మీద భూప్రదక్షిణమునకు బయలుదేరాడు. విఘ్నేశ్వరుని వాహనం ఎలుక కదా! అది నెమలిలా వేగముగా ప్రయాణించ లేదు. కదా! వేగముగా ఎలా వెళ్ళిరాగలడు. దానికి తోడు భారీ శరీరము. వినాయకుడు బాగా ఆలోచించాడు. పూజ్యభావంతో మనస్ఫూర్తిగా తల్లిదండ్రులకు ప్రదక్షిణం చేస్తే భూప్రదక్షిణ చేసినట్లే అనే పురాణ వాక్యం స్ఫురించింది. వెంటనే తల్లిదండ్రులైన పార్వతీపరమేశ్వరులను భక్తిభావంతో స్మరిస్తూ వారికి ప్రదక్షిణ చేశాడు. అలా తల్లి దండ్రులకు అతడు ప్రదక్షిణ చేస్తూండడం చేత అన్ని నదులలోను, సముద్రములలోను తనకంటే ముందే అతడు స్నానము చేసి వస్తూండడమును చూచి కుమార స్వామి ఆశ్చర్యపోయాడు. మొట్టమొదట భూప్రదక్షిణ పూర్తి చేసినవాడుగా వినాయకుడు నిలిచాడు.

అప్పుడు పార్వతీ పరమేశ్వరులు వినాయకునికి సిద్ధి, బుద్ధి అను ఇద్దరు కన్యలతో వివాహం చేశారు. తను అంత కష్టపడి తిరిగి వచ్చినా, యేమీ కష్టపడని వినాయ కుడికి ఫలితం దక్కడంతో కుమార స్వామికి అలకవచ్చింది. అతడు కైలాసమును వదలి దక్షిణమునవున్న క్రౌంచపర్వతము (శ్రీశైలము) నకు వెళ్ళిపోయాడు. కుమారునిపై గల ప్రేమతో తల్లియైన పార్వతి అక్కడికి వెళ్ళింది. ఆమె కోసం ఈశ్వరుడు వెళ్ళాడు. ఇలా పార్వతీ పరమేశ్వరులు భ్రమరాంబ, మల్లికార్జునులనే పేరుతో శ్రీశైలం చేరారు.

పూర్వం శిలాదుడనే ఋషి సంతానము కోసం శివుని గూర్చి తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షము కాగా ‘నీపై భక్తిగల ఇద్దరు కుమారులను ఈయుము’ అని కోరాడు. శివుని వరము వలన శిలాదునికి నంది, పర్వతుడు అను పుత్రుడు కలిగాడు.

వారు శివుని గూర్చి తపస్సు చేశారు. శివుడు నందికి ప్రత్యక్షమై వరము కోరు కొమ్మనగా నంది ‘స్వామీ! నీవెల్లపుడు నాపై నివసించాలి. నిన్ను మోసే భాగ్యం నాకు కలిగించు’ అని కోరాడు. ఇంకా నేను తపస్సు చేసిన ఈ స్థలంలో’ పర్వతలింగ’ మనే పేరుతో వెలసి, ఈ పర్వత శిఖరం చూసినంత మాత్రాన భక్తులకు పునర్జన్మ లేకుండా మోక్షము కలగాలి. సమస్త తీర్థాలూ, సకల దేవతలూ ఇక్కడ కొలువుండాలి.’ అని కోరాడు. పర్వతుడు శ్రీ పర్వతముగా, పర్వత లింగము మల్లికార్జున లింగముగా అయ్యింది.

వృద్ధ మల్లికార్జునుడు:
పూర్వం ఒక రాకుమారి శివుని పెండ్లాడాలను కొంది – శివుని మల్లిపూవుల తోను, అర్జున పుష్పాలతోను పూజించేది. ఒక రోజు శివుడు ఆమె కలలో కనిపించి ఒక తుమ్మెదను చూపించి అది వాలిన చోట తన కోసం వేచి వుండమనీ, తానే వచ్చి వివాహమాడతాననీ చెప్పాడు. ఆమెకి మెలకువ వచ్చి కళ్ళు తెరిచే సరికి ఒక భ్రమ రము ఎగురుతూ కన్పించింది. ఆమె ఆ తుమ్మెదను అనుసరిస్తూ శ్రీశైల ప్రాంతములోని అడవిలో ఒక పొద మీద తుమ్మెద వాలడం చేత ఆ పొద క్రింద శివుని ధ్యానిస్తూ శివుని కోసం నిరీక్షించ సాగింది. ఆ అడవిలోని చెంచులు పాలు, పండ్లు, తేనె మొద లైన వాటిని ఆమెకు ఆహారంగా ప్రతిరోజూ ఇచ్చేవారు.

ఒక రోజు శివుడు పార్వతితో కలసి ఆ ప్రాంతానికి వచ్చేడు. పార్వతికి రాకుమారిని చూపించి ఆమె నన్ను పెండ్లాడదలచుకొన్నదని శివుడు చెప్పేడు. దానికి పార్వతి హేళన చేసింది. శివుడు తన మాటలను నిరూపింపదలచి ఆ రాకుమారి దగ్గరకు ఒక ముసలివాని రూపంలో వెళ్ళి ‘రాకుమారీ, నీ కోసం వెతుకుతూ ముసలి వాడనయ్యాను ఇంత కాలానికి నిన్ను చేరాను. “నా ముసలి రూపమును లెక్క చేయక నన్ను పెళ్ళాడుతావా?’ అని అడిగాడు. అందుకామె ఒప్పుకొన్నది. ఆమెను తమ స్వంత బిడ్డవలె సాకిన చెంచులు వద్దంటున్నను వినక శివుని పెండ్లాడింది. ఆ సందర్భంగా చెంచులు కొత్త అల్లుని కొరకు మద్య‌, మాంసాలతో విందు ఏర్పాటు చేశారు. శివుడు ఆ విందును అంగీకరించలేదు. రాకుమార్తె ఎంతగా నచ్చచెప్తున్నా విన బడనట్లు అలిగి శివుడు వెళ్ళిపోసాగాడు. ఆమె మల్లయ్యా… ఓ చెవిటి మల్లయ్యా! ఆగు… నిలబడు అని గట్టిగా పిలిచింది. అయినా శివుడు లెక్కచేయలేదు. అప్పుడా రాకుమార్తె ‘రాయిలాగ మాట్లాడవేమి? అక్కడే లింగముగా మారిపో’ అని శపించింది. వృద్ధుడైన శివుడు అక్కడే అదే రూపంలో రాయిగా మారిపోయాడు. అందుకు పార్వతి రాకుమారిని చూచి ‘ఓసీ! భ్రమరమును వెంబడించి వచ్చిన నీవు తుమ్మెదగా మారి పోవుదువు గాక’ అని శపించింది. దాంతో ఆమె శివుని భార్యయైన భ్రమరాంబగా నిలచిపోయింది. భక్తులు ఇప్పటికీ వృద్ధ మల్లికార్జున స్వామిని వృద్ధ మల్లయ్య, ముసలి మల్లయ్యా, చెవిటి మల్లయ్యా అని పిలుస్తూ ఉంటారు.

భ్రమరాంబాదేవి:
ఒకప్పుడు అరుణాసురుడనే రాక్షసుడు బ్రహ్మను గూర్చి తపస్సు చేసి రెండు కాళ్ళ ప్రాణుల నుండి గాని, నాలుగు కాళ్ళజీవుల నుండి గాని తనకు మరణం లేకుండా వరం పొందాడు. వరగర్వంతో అతడు అన్ని లోకాలనూ బాధించసాగాడు. అతనిని సంహరించమని దేవతలంతా ఆదిశక్తిని కోరారు. అప్పుడామె అరుణాసురునితో యుద్ధానికి తలపడింది. ఆమె వేలాది తుమ్మెదలను సృష్టించి అరుణాసురుని సంహరించమని పంపింది. ఆరుకాళ్ళ జీవులైన ఆ తుమ్మెదలు అరుణాసురుని కుట్టి సంహరించాయి. దేవతల కోరికపై ఆదిశక్తి భ్రమరాంబికగా అక్కడ వెలసింది. అందుకే కాబోలు అమ్మవారి ఆలయం వెనుక గోడల నుండి భ్రమరముల ఝం కారము వినిపిస్తూ ఉంటుంది.

18 శక్తి పీఠాలలో మహా మహిమాన్వితమైనది భ్రమరాంబా శక్తి పీఠమే. అష్టా దశ (18) శక్తి పీఠాలలో శ్రీశైల పీఠాన్ని అధిష్టించిన భ్రామరీశక్తి భక్తుల కోరికలను తీర్చటంలో ప్రఖ్యాతి పొందింది. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన మల్లికార్జున లింగము అనే పేరుతో శివుడు, అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటిగా పరిగణింపబడి భ్రమరాంబిక పేరున ఆదిశక్తియైన పార్వతి ఈ శ్రీశైలంలో వెలసి ఉండడం శివ భక్తులకు, శాక్తేయులకు విశేష ఆనందదాయకము.

చరిత్ర: కృతయుగంలో హిరణ్యకశిపుడు, త్రేతాయుగంలో శ్రీరాముడు శ్రీశైలాన్ని దర్శించారు.
ద్వాపరయుగంలో పాండవులు (కీ॥పూ॥ 3120 ప్రాంతంలో) శ్రీశైలాన్ని దర్శించి వారి పేర్లతో లింగాలను ప్రతిష్టించారని ఇతిహాసాలు, పురాణాలు వలన తెలుస్తోంది. ఇక చరిత్రలో- పతంజలి మహర్షికంటే ముందు యోగశాస్త్రాన్ని బోధిం చిన గోరక్ నాథుడు, ఆది శంకరాచార్యులు, ఆచార్య నాగార్జునుడు శ్రీశైలమును దర్శించారనీ, అక్కడ కొంతకాలం తపస్సు చేశారనీ తెలుస్తోంది. తర్వాత వివిధరాజు వంశాలవారు శ్రీశైలాన్నభివృద్ధి చేశారు.

శాతవాహనులు:
శాతవాహనుల కాలంలో శ్రీశైలాని ‘సిరిధాన్’ అని వ్యవహరించే వారు. పులమావి (క్రీ॥శ॥ 102-130) నాసిక్ గుహలలో చెక్కించిన శాసనాలలో దీని ప్రస్తావన వుంది. 3వ శతాబ్ది వరకు పాలించిన శాతవాహనులు దీని పోషణ చూసే వారు.
ఇక్ష్వాకులు:
ఇక్ష్వాకులు 3వ శతాబ్దిలో ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. వారిలో ‘వశిష్ఠపుత్ర క్షాంతమూలుడు’ కుమారస్వామి భక్తుడు, శివభక్తుడు. ఇతని కాలంలో శ్రీ శ్రీశైలం అభివృద్ధి చెందింది. శాతవాహనుల కాలంలో ‘సిరిధాన్’గా పిలువ బడిన క్షేత్రము ఇక్ష్వాకుల కాలంలో శ్రీశైలముగా, శ్రీపర్వతముగా పిలువబడింది. ఇక్ష్వాకులు శ్రీ పార్వతీయులుగా పిలువబడ్డారు.
పల్లవులు:
ఇక్ష్వాకు రాజైన పురుషదత్తుని గెలిచి సింహవర్మ అనే పల్లవరాజు శ్రీశైలాన్ని తన రాజ్యంలో కలుపుకున్నాడు. ఇతని వంశస్థుడైన త్రిలోచన పల్లవుడు శ్రీశైల ప్రాంతపు అడవిని కొంత కొట్టించి బ్రాహ్మణులకు నివాసాన్ని ఏర్పరచాడు. పల్లవులు 4వ శతాబ్ది వరకు శ్రీశైలాన్ని పరిపాలించారు. తర్వాత ‘కరికాల చోళుడుస‌ అనునతడు త్రిలోచన పల్లవుని ఓడించి అతడు తలపెట్టిన అభివృద్ధి పనులను హిందూస్థానీ పని వారితో చోళుడు పూర్తి చేయించాడు.

విష్ణు కుండినులు:
4వ శతాబ్ది చివరిభాగంలో శ్రీశైలము విష్ణుకుండినుల అధీనంలోకి వెళ్ళింది. వారున్ను, వారి బంధువులైన ‘వాకాటకులు’ను శ్రీశైలాభివృద్ధికి కృషిచేశారు.

కదంబులు:
6వ శతాబ్ది మొదటి భాగంలో పల్లవులు తిరిగి రాజ్యానికి వచ్చారు. తర్వాత వారిని మయూర వర్మ అనే కదంబరాజు జయించి శ్రీశైలాన్ని తన అధీనం లోకి తెచ్చుకున్నాడు.
చోళులు: 6వ శతాబ్ది మధ్య నుండి 8వ శతాబ్ది వరకు రాజ్య పరిపాలన చేసిన చోళ వంశములలో రేనాటి చోళులు శ్రీశైలమును పాలించారు.

రాష్ట్ర కూటులు: 8వ శతాబ్దిలో రాష్ట్రకూటుడైన దంతిదుర్గుడ నువాడు కీర్తివర్మను జయించి కర్ణాటకకు రాజయ్యాడు. అతడు, అతడి వంశస్థుల పాలనలో క్రీ॥ శ॥ 973 వరకు శ్రీశైలము వుంది.
చాళుక్యులు: క్రీ॥ శ॥ 973లో ఒక చాళుక్యుడు రాష్ట్రకూటులను జయించి శ్రీశైలాన్ని తిరిగి చాళుక్యుల పాలనలోకి తెచ్చాడు. ఇతని వంశస్థులను చాళుక్యులనీ, కళ్యాణి చాళుక్యులనీ అంటారు. వీరికి, దాక్షిణాత్య చోళులకూ మధ్య కలహాలను అవకాశముగా తీసుకొని రెండవ గోంక వెలనాటి ప్రతినిధి శ్రీశైలాన్ని ఆక్రమించాడు. క్రీ॥ శ॥ 1162 వరకు శ్రీశైలం ఇతని కొడుకు వశములో వుంది.

కాకతీయులు: క్రీ॥శ॥ 1162 నాటికి శ్రీశైలం కాకతీయుల చేతిలోకి వచ్చింది. ఆనాటి నుండి 1323 వరకు శ్రీశైలం కాకతీయుల అధీనంలోనే యుండి అభివృద్ధి చెందింది.

కొండవీటిరెడ్డి రాజులు: క్రీ॥శ॥ 1326 నుండి అద్దంకిని పాలించిన ప్రోలయ వేమారెడ్డి అధీనంలోకి శ్రీశైలం వచ్చింది. ఈ ప్రోలయ వేమారెడ్డి 1335 సంలో పున శ్రీశైలానికి మెట్లు కట్టించాడు. 1335-1346 మధ్య పాతాళగంగకు మెట్లు కట్టించినట్లు శాసనాలు చెప్తున్నాయి. ఇవి ఇప్పటికీ బాగానే వున్నాయి. అయినా 1393-94లో రెండవ దేవరాయల భార్య విఠలాంబ కట్టించిన పాతాళగంగ మెట్లనే భక్తులు వాడుతున్నారు. 1364లో రాజ్యానికి వచ్చిన అనవేమారెడ్డి 1377లో వీరశిరో మండపాన్ని కట్టించినట్లు 9-1-1378న వేయించిన ఒక స్తంభ శాసనం వలన తెలుస్తోంది. ఇతని తర్వాత కుమారగిరిరెడ్డి (1378-1407 రాజ్యకాలం) శ్రీశైల శిఖరానికి మెట్లు కట్టించాడు. ఇతని మంత్రి కాటయవేముడు 1398లో ఈ మెట్లు వేయించినట్లు శాసనమున వున్నది.
విజయనగర రాజులు: విఠలాంబ పాతాగంగకు మెట్లనేకాక విఠలేశ్వరాలయాన్ని కూడ కట్టించినట్లు తెలుస్తోంది. క్రీ॥శ॥1405లో రెండవ హరిహర రాయలు ఆలయ 3 ముఖమండపాన్ని, దక్షిణపు వైపు గోపురాన్ని నిర్మింపజేశాడు. 1456లో సాళువ తిరుమలయ్య శ్రీశైలానికి చాలా దానాలు చేశాడు. 1457-58లో ప్రౌఢ దేవరాయల పరిచారిక కొన్ని దానాలు చేసింది. 1468లో ప్రౌఢ

మహామండలేశ్వర పర్వతయ్య (వీరనర సింహరాయల వంశము వాడు) భూములు, తోటలు, కట్టడాలు దానం చేశాడు. – 18 వ పెదమల్లప్ప రాజు ఒక చెరువును తవ్వించాడు. 1513లో శ్రీకృష్ణ దేవరాయలు గర్బాలయపు రాగిరేకుకు, ముఖమండపానికి బంగారుపూత పూయిం 56లో రాయల సేవకుడు మల్లప్ప కొన్ని కానుకలిచ్చాడు. రాయల మంత్రి ‘చంద్రశేఖరామాత్యుడు’ కళ్యాణ మండపాన్ని కట్టించి గర్భాలయ ద్వారాలకు బంగారు. రేకులు పొదిగించాడు. క్రీ॥ శ॥ 1529 నవంబరులో – ఆలయ విమానానికి చుట్టూ కొంతభాగం బంగారుపూత పూయించాడు. 14-1-1531న బంగారు నందిని చేయించాడు. పవళింపు సేవామందిరానికి ముందు మండపాన్ని కట్టించి అందులో శ్రీకృష్ణదేవరాయలు, తిమ్మరుసులు విగ్రహాలను పెట్టించాడు.

శివాజీ: మహారాష్ట్రుడైన ఛత్రపతి శివాజీ క్రీ॥శ॥ 1674-77లో శ్రీశైలాన్ని దర్శించి, ఉత్తర గోపురాన్ని నిర్మింపజేసి, ఆలయ రక్షణ కోసం కొంతమంది మరాఠీ సైనికులను నియమించాడని, రోహిల్లాల దండు ఆలయంపై దండెత్తినపుడు ఆ మరాఠీ సైనికులలో చివరివాడు కూడా చనిపోయే వరకూ వారితో పోరాడినట్లును తెలుస్తోంది. ఆ సైనికుల సంతతి వారిప్పటికీ ప్రతి సంవత్సరము శ్రీశైలము వచ్చి తమ పెద్దలకు ధూపం వేస్తుంటారు.

శివాజీ శ్రీశైలంలోని భ్రమరాంబాదేవిని సేవించి ఆమెను ప్రసన్నము చేసికొని ఖడ్గమును కానుకగా పొందినాడనీ, నాటినుంచీ ‘ఛత్రపతి శివాజీ’ అని పిలువబడ్డాడని చరిత్ర.

నవాబులు:
ఔరంగజేబు ఈ ప్రాంతాన్ని జయించి రాజాభీమ్ సింగును గవర్నరుగా నియమించాడు. ఈ ప్రాంతము అప్పటి సేనాని దావూద్ ఖాన్ కు జాగీరుగా ఈయబడింది. తర్వాత అతని తమ్ముడు ఇబ్రహీంఖానుకు సంక్రమించింది. ఇబ్రహీంఖాన్ శ్రీశైల దేవాలయం క్రింద అనుభవంలోనున్న గ్రామాలను, ఆస్తులను 1712లో తిరిగి పట్టాలిచ్చి వారికి స్వాధీనం చేశాడు. తర్వాత ఇది హైదరాబాదు నవాబుల అధీనమయ్యింది. 8-4-1782లో నైజాం ఆలీఖాన్ అసఫ్ జా దస్తావేజులను పునరుద్ధరిస్తూ దేవస్థాన పరిపాలనను శ్రీ శృంగేరీ జగద్గురువులకు అప్పగించాడు. తర్వాత అది ఈస్ట్ ఇండియా కంపెనీ స్వాధీనమయింది. వారు 1840లో పుష్పగిరి పీఠాధిపతులకు అప్పగించారు. 100 సం॥ల కాలం వారి ఆధీనంలో నున్నా యెట్టి అభివృద్ధి లేకపోగా ఆలయాలు జీర్ణావస్థకు చేరుకున్నాయి. పుష్పగిరి పీఠం ఆలయ నిర్వహణ సరిగా చేయకపోవడం చేత ఆనాటి ప్రభుత్వం దీనిని కొంతకాలం జిల్లా కోర్టు వారధీనంలో వుంచి, 1929లో శ్రీ పాణ్యం రామయ్య గారి అధ్యక్షతన ఒక బోర్డు నేర్పరచి వారికి అప్పజెప్పారు. ఆ బోర్డు వారు 1949లో దేవాదాయ ధర్మాదాయ అప్పజెప్పారు. ఈశాఖ వారు నేడు యెన్నో అభివృద్ధి కార్యాలు చేస్తున్నారు.

శ్రీశైల దేవాలయానికి చేయబడిన దానములు
శాసనములను బట్టి యెందరో భక్తులు చాలా దానాలు చేసినట్లు తెలుస్తోంది. ఇక్కడ కొన్నిటిని వివరిస్తున్నాము. 1412లో ‘లింగయ్య’ అనునతడు గుడి చుట్టూ గల ప్రాకారంలో కొంతభాగం కట్టించాడు. ‘అప్పనయ్యం గారు’ నంది మండపం నుండి భ్రమరాంబా ఆలయం వరకు మెట్లు కట్టించాడు. 16లో చోళమండల రాజ్యపు గవర్నరు బంగారు ధ్వజస్తంభాన్ని ప్రతిష్టించాడు. 1462లో బైరాగి ‘శాంతయ్య’ పూలతోటను దానమిచ్చాడు. 1505లో వీరప్పయ్య భార్య లక్కమ్మ ముఖమండప దక్షిణ ద్వారానికి గల రాగిరేకుకు బంగారు పూత వేయించింది.

1517లో పర్వతయ్య, అతని భార్య భీముని కొలనుకు దగ్గరలో ఒక చెరువును త్రవ్వించారు. 1529లో శ్రీశైలంలో కరణముగా పని చేస్తున్న వాని కొడుకులు అన్నపూర్ణ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. 1530లో లింగయ్య అనునతడు మల్లికార్జున స్వామి కవచానికి బంగారుపూత పూయించాడు. తిరుమల రాయల అనుచరుడైన ”శాలకరాజు’ యజ్ఞశాలా మండపాన్ని కట్టించాడు. ‘మల్లప్ప నాయుడు’ పెద్ద గంటను దానమిచ్చాడు. 1585లో నందరాయ పట్టణమునకు చెందిన ‘కుమార వీరప్పయ్య దేవుడు’ అనునతడు స్వామి వారికి పెద్ద గంటలను ఇచ్చాడు.

1592లో కృష్ణప్ప నాయకుడు ‘గంగైకొండనాడు’లోని రెండు గ్రామాలను ఆలయానికి బహూకరించాడు. 1594లో ‘సితాపిఖాన్’ అనువాడు గుడి ఉత్తరపు వాకిలికి ఎదురుగా బంగారు ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేశాడు. 1634లో ‘అన్నమరాజు’ బంగారు స్తంభాన్ని పాలించాడు. ‘మన్నెపు నాయకుడు’ దక్షిణ ప్రాకారాన్ని పునరుద్ధరించాడు. చరిత్రలో ఇంకా ఎంతమంది ఏవేవి బహూకరించారో? ఎంతమంది భ్రమరాంబా మల్లికార్జునులను సేవించి తరించారో!..

Advertisement

తాజా వార్తలు

Advertisement