Thursday, April 25, 2024

మహాకావ్యాలు-ముక్తిసోపానాలు

”వేదోఖిలో ధర్మ మూలమ్‌”

సకల ధర్మాలకు మూలం వేదమే. అంటే ధర్మాధర్మములకు ప్రమాణం వేదం. అయితే ”అనంతా వై వేదా:”. వేదములు అనంతములు. ఆ అనంతములైన వేదాలను ఋక్‌, యజు, సామ, అధర్వణ వేదాలు అని నాలుగుగా వింగడించి వేదవ్యాసుడు లోకాన్ని తరింపచేశాడు. ఆ నాలుగు వేదా లను కూడా సాకల్యంగా అధ్యయనం చేసి, వాటిలో చెప్పబడిన ధర్మాలను తీర్మా నంగా తెలుసుకొనే శక్తి సామాన్యులకు ఉండదు కనుక యాజ్ఞవల్క్యాది ఋషు లు వేదధర్మాలను క్రోడీకరించి తమతమ స్మృతి గ్రంథాలను వెలార్చారు. అయి నా శృతి, స్మృతి, పురాణాలను కూడా అధ్యయనం చేసే శక్తి, సమయం నేటి కాలం లో చాలామందికి ఉండదు. కనుక ఒక్కో వేదం నుండి ఒక్కొక్క సారభూతమైన వాక్యాన్ని తీసి నాలుగు మహా వాక్యాలను నిర్ధారించి, కనీసం వాటినైనా క్షుణ్ణం గా అధ్యయనం చేసి తరించమని మనకు ప్రసాదించారు. అవి- ”ప్రజ్ఞానం బ్రహ్మ”, ”అహం బ్రహ్మాస్మి”, ”తత్వమసి”, ”అయమాత్మా బ్రహ్మ”. వీటిని గురించి స్థూలంగా తెలుసుకొందాము.
ప్రజ్ఞానం బ్రహ్మ: ఇది ఋగ్వేదంలోని ఐతరేయ ఉపనిషత్తులోని వాక్యము. దీని అర్థం ‘పరిపూర్ణమైన జ్ఞానమే బ్రహ్మ’ అని. అత్యున్నతమైన జ్ఞానమే బ్రహ్మ. ఇది సృష్టి మూలాన్ని తెలియజేస్తూ, ఈ బ్రహ్మాండము పరబ్రహ్మము నుండి జనించిందనీ ఈ చరాచర సృష్టికి గల శుద్ధ చైతన్యం బ్రహ్మమే అని చెబుతుంది. అంటే చీమ నుండి బ్రహ్మ దాకా వివిధ ఉపాధులలో ప్రకాశించే చైతన్యమే పర మాత్మ లేదా పరబ్రహ్మము. చైతన్యము అంటే జ్ఞానము, చిత్తము, బోధ, అను భూతి అనే అర్థాలున్నాయి. జీవుడు కూడా బ్రహ్మాండములో భాగమే కనుక జీవు నిలోని చైతన్యం కూడా పరబ్రహ్మమే. సృష్టికి పూర్వము, అనంతరమూ కూడా నిలిచి ఉండే శక్తి ఆ పరబ్రహ్మమేనని, తాను ఆ పరబ్ర#హ్మ స్వరూపమేననే అద్వైత భావనను గురువు మొదట తాను అనుభవించి శిష్యునికి ”ప్రజ్ఞానం బ్రహ్మ” (నా లోని చైతన్యము బ్రహ్మమే) అని బోధిస్తాడు. బ్రహ్మ స్వరూపాన్ని గుర్తింప జేసే మహావాక్యమిది. అప్పుడు శిష్యుడు కూడా ఆ బోధను గ్రహంచి, తానూ స్వానుభవంలోకి తెచ్చుకొని, ”అహం బ్రహ్మాస్మి” అనే రెండవ మహా వాక్యాన్ని పలుకుతాడు.
అహం బ్రహ్మాస్మి: ఇది యజుర్వేదంలోని బృహదారణ్యకోపనిషత్తులోని వాక్యము. అంటే ‘నేనే పరబ్రహ్మ’మని జీవుడు భావించడం. జీవుడు పరిభ్రమి స్తున్న అన్ని జన్మలలోనూ బ్రహ్మస్వరూపమే ఆత్మగా ప్రకాశిస్తూ ఉంది. తనకు లభించిన ఉపాధిలో జ్ఞానాన్ని పొంది ”నేనే పరబ్ర#హ్మ స్వరూపాన్ని” అనే సత్యా న్ని దర్శించగలగాలి. జీవాత్మ, పరమాత్మల యొక్క అభేదాన్ని, ఐక్యతను తెలిపే అనుభవ వాక్యం ఈ రెండవ మహావాక్యం. మొదటి వాక్యం ”ఉపదేశ వాక్యం” కాగా రెండవది ”అనుభూతి వాక్యం”. ధర్మాచరణతో కూడిన ఆత్మ శోధన చేత మాత్రమే జీవుడు ఈ అనుభూతిని పొందగలడు.
తత్వమసి: ఈ మాట సామవేదంలోని ఛాందోగ్యోపనిత్తులోనిది. అంటే ఈ చరాచర మంతటా వ్యాపించియున్న శుద్ధచైతన్యం నీలోనే, నీవే అయి ఉన్నదని ఈ వాక్యార్థం. ”ఏకమేవా ద్వితీయం బ్రహ్మ”. ఉన్నది బ్రహ్మ ఒక్కటే. అది నీలో, నాలో, సర్వత్రా వ్యాపించి ఉన్నదనే అద్వైత భావనకు ఈ మూడవ మహా వాక్య మే పునాది. పరమాత్మను తనలోనేకాక, సర్వత్రా, సర్వదా దర్శించుకోగలిగి నప్పుడు మాత్రమే అద్వైత భావన పరిపూర్ణమవుతుంది. అణువణువున, బ్రహ్మాండమంతటా వ్యాపించి ఉన్న పరబ్రహ్మను దర్శించగలగడమే అద్వైత భావనకు పరాకాష్ఠ. ఈ మూడవ వాక్యం ”జ్ఞానబోధకమైన” దర్శన వాక్యం.
అయమాత్మా బ్రహ్మ: ఇది అధర్వణ వేదంలోని మాండూక్యోపనిషత్తు లోని వాక్యము. ఈ అండ పిండ బ్రహ్మాండ రూపంలో ప్రకాశించే సాక్షి చైతన్యమే బ్రహ్మ. సర్వ ఉపాధులలో ఉన్నది ఆ పరమాత్మయే అని తెలుసుకొని, తన లోప ల, వెలుపల, సర్వత్రా, ఆ పరమాత్మను దర్శించి, తన్మయుడై తరిస్తాడు జీవుడు. ఇది సాక్షాత్కార రూపమైన ”దర్శనవాక్యం”.
ఉపదేశం, అనుభవం, దర్శనం, బ్రహ్మానందానుభూతి అనే నాలుగు అంచెల జ్ఞానబోధను కావించే ఈ నాలుగు వాక్యాలు జ్ఞానకాండకు కీలకాలు. వీటిని విస్తరించడమే అద్వైతం. అదే వేదాంత సారం. సద్గురువు వలన ప్రజ్ఞా నమే బ్రహ్మము అనే ఉపదేశాన్ని పొంది, తానే బ్రహ్మమనే అనుభవాన్ని పొంది, బ్రహ్మను సర్వత్రా, సర్వదా దర్శించి, బ్రహ్మానందాన్ని అనుభవించ గలిగితేనే జీవుని జ్ఞానం పరిపక్వమవుతుంది. ఈ బ్రహ్మానందానుభవం అద్వైత సాధనలో పరమమైన చరమ దశ. ఈ దశ అనేక జన్మల సాధనల వలన, గురుబోధనల వలన, భగవత్‌ కృప వల్ల జన్మసంస్కారం వలన మాత్రమే లభిస్తుంది. దేహాభి మానాన్ని త్యజించి, తీవ్ర వైరాగ్య భావమున్న పరమహంసలకే ఈ అద్వైత సిద్ధి అనీ, అలాంటివారు చాలా అరుదు అని, గీతాచార్యుడే చెప్పాడు.
”బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్‌ మాం ప్రపద్యతే
వాసుదేవ: సర్వమితి సమహాత్మా సదుర్లభ:”. ఎన్నో జన్మల సాధన తర్వాతే జ్ఞానసంపన్నుడైన వ్యక్తి, అంతా నేనేనని తెలుసుకొని నన్ను శరణు పొందు తాడు. అలాంటి మహాత్ములు చాలా అరుదు.
అయినా నిరంతరం భగవత్తత్వాన్ని దర్శిస్తూ, దేహాభిమానాన్ని తగ్గించు కొని అంతా భగవదర్పితంగా జీవించగలిగితే సిద్ధిపొందడం అసాధ్యమేమీ కాదని ఎందరో మహనీయులు స్వానుభావంతో బోధించారు. ఈ మహావాక్యా లను గురుముఖత: విశదపరచుకొని, నిరంతర శ్రవణ, మనన, నిధిధ్యాసలతో ప్రయత్నంచేసి మోక్షపథంలో ముందుకు వెళదాం.

Advertisement

తాజా వార్తలు

Advertisement