Thursday, November 7, 2024

జీవితంలో మహాభారతం

ఒక వ్యక్తి నిరంతరం తాను ఉన్న స్థితి నుండి ఉన్నతమైన స్థితి వైపు చేసే ప్రయాణమే అభివృద్ధి. అదే జీవన సాఫల్యం. ఈ ప్రయాణంలో ప్రతీ వ్యక్తి ఎదుర్కొనే ముఖ్యమైన 6 సవాళ్ళను జయించగలిగితే గమ్యం చేరగలడని భారతం చెబుతోంది. అతినిద్ర, బద్ధకం, భయం, క్రోధం, అలసత్వం, అంతులేని ఆలోచనలన ఆరుదోషాలను గురించి భారతంలోని ఉద్యోగ పర్వంలో విదురుడు వివరించాడు.
నిజానికి మన జీవితం మన భావోద్వేగాలకు అనుగుణంగా, అనుకూలంగా ఉండదు. భావోద్వేగాలనే జీవితానికి అనుకూలంగా మలచుకోవాలి, నియంత్రించుకోవాలి. మన లక్ష్య సాధనలో భాగంగా నిత్య జీవన పోరాటం లోని ప్రతి ప్రయాణం గమ్యాన్ని చేరుస్తుందని చెప్పలేం. కానీ, ప్రయాణించిన దూరం గమ్యాన్ని దగ్గరగా చేస్తుంది. అనుకున్నది జరగడం, జరగకపోవడం రెండూ సంభవమే. విజయంతో పొంగిపోతే అహంకారం పలకరిస్తుంది. అపజయంలో క్రుంగిపోతే ఆత్మన్యూనత ఆవరిస్తుంది. మన అభివృద్ధికి ఆటంకం కలిగించే దోషాలను వదిలివేయడం, లోపాలను సరిచేసుకొంటూ, ముందుకు సాగడం వల్ల పరిణతి, ఉన్నతి లభిస్తాయి. ఈ క్రమంలో పైన చెప్పిన ఆరు దోషాలను విశ్లేషించుకుంటే.. నిద్రలో శరీరం విశ్రాంతి పొందుతుంది. విశ్వ శక్తి మనలోకి ప్రవేశించి శరీరాన్ని, మనసుని చైతన్య పరుస్తుంది. ఐతే, అతినిద్ర పనికి రాదు. అతినిద్ర లేదా నిద్ర లేమి రెండు వ్యసనాల వలన ఆరోగ్యం పాడవుతుంది.
రెండోది లక్షణం బద్ధకం. ఇష్టమయిన దాని కోసం చేయవలసిన పనిని నిర్లక్ష్యం చేయడం లేదా వాయిదా వేయడం బద్ధకం. దానివల్ల ఏ పనీ సమయానికి పూర్తిచేయలేం. అనుకోని పరిస్థితులు ఎదురైతే వాటిని ఆమోదించలేని స్థితిలో కలిగేది భయం. భయం వల్ల ఏ పనిని సంకల్పించినా.. ”ఇది నాకు సాధ్యం కాదేమో, ఈ పని చేస్తే ఎవరైనా అపహాస్యం చేస్తారేమో… అపజయం కలుగుతుందేమో…” అనే అనుమానాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అనుమానాల వల్ల ఉత్సా#హం తగ్గుతుంది, ధైర్య సాహసాలు సన్నగిల్లుతాయి. బుద్ధి పనిచేయదు, చేసే పని మీద మనసు నిలవదు, ఏకాగ్రత ఉండదు, ఫలితంగా చేయవలసిన పనికి అవసరమైన శక్తి సామర్థ్యాలు మందగిస్తాయి. ప్రయత్నం మధ్యలోనే విడిచిపెడతాం.
ఇక, క్రోధం అన్ని అనర్థాలకూ మూలకారణం. పరిస్థితులు మనం అనుకున్నట్లుగా లేనప్పుడు కోపం వస్తుంది. కోపం మనలోని భావోద్వేగానికి సంకేతం. కోపం సుదీర్ఘమైతే క్రోధంగా మారుతుంది. క్రోధం వల్ల మోహం కలుగుతుంది. మో#హం వల్ల బుద్ధి సరిగా పనిచేయదు. అలసత్వం వల్ల నైపుణ్యం దక్కదు. చేసే పనిలో నైపుణ్యం లేకపోతే ఫలితాలు వ్యతిరేకంగా ఉంటాయి.
ఇక అంతులేని ఆలోచనల వల్ల కార్యాచరణ శూన్యమౌతుంది. కార్యాచరణ లేని ఆలోచనలు ప్రతిబంధకాల వైపు పరుగులు తీస్తాయి. ఆలోచనలు అవసరమే కానీ, అవి ఆచరింపబడితేనే విజయం సాధ్యపడుతుంది. ఈ ఆరు దోషపూరితమైన అలవాట్లనూ వదిలితేనే మానవ జీవితం సార్ధకమౌతుందని చెబుతోంది మహాభారతం.

  • దండంరాజు రాంచందర్‌ రావు
Advertisement

తాజా వార్తలు

Advertisement