Saturday, December 7, 2024

గీతాసారం(ఆడియోతో…)

అధ్యాయం 1, శ్లోకం 32,33,34,35
32

కిం నో రాజ్యేన గోవింద
కిం భోగైర్జీవితేన వా ||
యేషామర్థే కాంక్షితం నో
రాజ్యం భోగా: సుఖాని చ ||
33
త ఇమే వస్థితా యుద్ధే
ప్రాణాస్త్యక్త్వా ధనాని చ |
ఆచార్యా: పితర: పుత్రా:
తథైవ చ పితామహా: ||
34
మాతులా: శ్వశురా: పౌత్రా:
శ్యాలా: సంబంధినస్తథా |
ఏతాన్న హంతుమిచ్ఛామి
ఘ్నతో పి మధుసూదన ||
35
అపి త్రైలోక్యరాజ్యస్య
హేతో: కిం ను మహీకృతే |
నిహత్య ధార్తరాష్ట్రాన్‌ న:
కా ప్రీతి: స్యాజ్జనార్దన ||

32-35తాత్పర్యము : ఓ గోవిందా ! మేమవరి కొరకు రాజ్యమును, సుఖమును, చివరకు జీవనమును సైతము కోరుచున్నామో వారందరును ఈ యుద్ధరంగమున నిలిచియుండగా ఆ రాజ్యాదుల వలన మాకు కలుగు ప్రయోజనమేమి ? ఓ మధుసూదనా ! ఆచార్యులు, తండ్రులు, పుత్రులు, తాతలు, మేనమామలు, మామలు, మనుమలు, బావమరుదులు, ఇతర బంధువులందరును తమ ఆస్తులను మరియు ప్రాణములను విడిచిపెట్టుటకు సంసిద్ధులై నా యెదుట నిలబడి నన్ను చంపగోరినను నేనెందులకు వారిని చంపగోరవలెను? ఓ జనార్థనా ! ఈ ధరిత్రి విషయమటుంచి ముల్లోకములను పొందినను నేను వారితో యుద్ధము చేయుటకు సిద్ధముగా లేను. ధృతరాష్ట్రుని తనయులను వధించుట వలన మేమెట్టి ఆనందమును పొందగలము?

భాష్యము : ఇక్కడ అర్జునుడు కృష్ణున్ని గోవిందా ! అని సంబోధించెను. గోవిందుడు అనగా ఇంద్రియములకు, గోవులకు ఆనందాన్నిచ్చేవాడు అని అర్థము. ఇక్కడ అర్జునుడు కృష్ణుడు తన ఇంద్రియములకు తృప్తిని కలిగించాలని కోరుకొనెను. నిజానికి మనము గోవిందుని ఇంద్రియములను తృప్తి పరచినట్లయితే మనముకూడా ఆనందాన్ని పొందవచ్చునే గాని భగవంతున్ని మనము కోరిన వాటిని తీర్చే దుకాణదారునిగా మార్చకూడదు. భగవంతుడు మన కర్మానుసారము తగిన వాటిని ఇస్తాడే గాని మన గొంతెమ్మ కోరికలన్నింటనీ తీర్చడు. భౌతికముగా ఆలోచించే వ్యక్తి తన సంపదలను బంధుమిత్రులకు చూపాలని, పంచుకోవాలని కోరుకుంటాడు. మరి అటువంటి వారందరూ యుద్ధములో చనిపోతే రాజ్యాన్ని గెలిచి మాత్రము ఏమి ఉపయోగమని అర్జునుడు భావించెను. భక్తుడైనవాడు కృష్ణుని సేవ కోసము దేనినైనా చేసేందుకు స్థిరముగా ఉండాలే గాని తన స్వార్థము చూసుకోకూడదు. అయితే నిజానికి అర్జునుడు భక్తుడు కాబట్టి కరుణతో ఇలా ప్రవర్తిస్తూ ఉన్నాడు. భక్తుడు తనకు హానిచేసిన వారిని సైతమూ క్షమించి వదిలివేస్తాడు. కానీ కృష్ణుడు తన భక్తులకు హానిచేసిన వారిని సహించడు. కాబట్టి కృష్ణుడు కౌరవుల మరణాన్ని అప్పటికే నిర్ణయించినాడు. అర్జునుడు కేవలము తన చేతిలో పరికరము అవ్వమని, కీర్తిని గడించమని కోరుచున్నాడు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement