Sunday, November 10, 2024

ఒంటరితనం – ఏకాంతం

ఆధ్యాత్మిక సాధనలో ఎప్పుడూ ఏకాంతమే బలమయిన ఆయుధం. దానిని సద్వినియోగపరుచుకోవాలే కాని అధ్బుతాలు సృష్టించవచ్చు… దర్శించవచ్చు. ఎప్పుడూ ఎవరో ఒకరితో కలిసి ఉండేవారు ఒంటరిగా ఉండాలని అనుకుంటూ ఉంటారు. ఒంటరిగా ఉండేవాళ్ళేమో ఎవరో ఒకరితో కలిసి ఉండాలని అనుకుంటారు.
స్నే#హంగా ఉండగలిగితే ఎవరూ ఎప్పటికీ ఒంటరిగా ఉండలేరు. శక్తిమంతంగా ఉండాలనుకొంటే ఒంటరిగా ఉండటాన్ని ఆనందంగా అనుభవించాలి. ఇది అందరికీ కుదిరేపని కాదు. ఒంటరితనం బాధిస్తుంది. ఎంతో వేదనకు గురిచేస్తుంది. శృతిమించితే మానసిక వ్యాధిగా పరిణమిస్తుంది. సంబంధాలు అంతంతమాత్రమే. ప్రతివ్యక్తీ ఒక ద్వీపంలా తనంతట తానుగా ఉంటున్నాడు. ఒంటరితనానికి పరిస్థితుల ప్రభావమూ ఉంటుంది. కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఒంటరితనం బాధించవచ్చు. విడిపోవటమో, ప్రియమైన వ్యక్తి మరణించటమో ఒంటరితనానికి గురిచేయవచ్చు. మానసికమైన ఒంటరితనం ఆత్మన్యూనత వల్లకావచ్చు. .
ఒంటరిగా ఉన్నామనుకొనే ఇంకో వర్గం వృద్ధులది అని చెప్పవచ్చు. కాలం ఉరుకులతో పరుగులతో ముందుకు పోతూ వీరిని వెనుక విడిచి పెట్టేస్తుంటుంది. వృద్ధాప్యమంటే దయ, కరుణ లభ్యమవుతాయేమో గాని స్నే#హం లభ్యం కాదు. భావోద్వేగాల ఒంటరితనం ఎప్పుడు బాధిస్తుందంటే జీవితంలో జరుగుతున్న విషయాలు, భావాలు పంచుకోటానికి ఎవరూ లేనప్పుడు ఏకాకిగా మిగిలిపోయినటనిపిస్తుంది.
ఆధ్యాత్మిక భావాలున్న వారూ ఏకాంతాన్ని కోరతారు. ఒంటరితనంతో ఎలా ఉండాలి? ధ్యానం చేయండి. మౌనంగా కూర్చుని పరిసరాలను వీక్షించండి. శ్వాస తీసుకోండి. ప్రతిభావోద్వేగాన్ని, ఆలోచనను, భావనను గుర్తించండి. మీపట్ల మీరు మృదువుగా వ్యవహరించండి. ఒంటరితనంలో కొన్నిరకాలున్నాయని మనస్తత్వ శాస్త్రవేత్తలు గుర్తించారు.
నీ పట్ల నీకున్న దృక్ఫథమే నీకు ఇతరుల పట్ల ఏర్పడుతుందని, నీకు నువ్వు స్నే#హంగానే ఉంటేనే ఇతరుల పట్ల స్నే#హంగా ఉండడం సాధ్యమవుతుందని స్పష్టం చేస్తాడు మాక్స్‌వెల్‌. ఆనందానికి ఒంటరితనం అవరోధంగా ఉంటుంది. ఆనందంగా ఉండాలంటే దగ్గరి సంబంధాలు ఉండాలి. ఎవరో ఒకరు మనకు ఆసరాగా, మనం వారికి ఆసరాగా ఉండాలి. ఒంటరిగా ఉండటం, ఒంటరి తనం అనుభవించటం, ఏకాంతంగా, ప్రశాంతంగా ఉండటం ఒకటి కాదు. ఏకాంతం ఆనందాన్నిస్తుంది. ఒంటరితనం దు:ఖాన్నిస్తుంది. సృజనాత్మకత ఉన్నవాళ్ళు ఒంటరి తనాన్ని కోరుకొంటారు. సేవని జీవితలక్ష్యంగా చేసుకుంటే భయాన్ని తొలగిస్తుంది. మనస్సును ఏకాగ్రం చేసి, నువ్వు చేస్తున్న పనికి ఒక ప్రయోజనాన్ని కల్పించి, దీర్ఘకాలంపాటు ఆనందాన్నిస్తుంది. ఆనందంగా లేని ప్రతిసారీ, కష్టంలో, ఒంటరిగా ఉన్నానని అనిపించినప్పుడల్లా శాంతికోసం ప్రార్థించటమే మనిషి చేయగలిగే పని. అలాచేసిన మరుక్షణం ముఖంపై చిరునవ్వు చిగురిస్తుంది.

– తరిగొప్పుల విఎల్లెన్‌ మూర్తి

Advertisement

తాజా వార్తలు

Advertisement