Tuesday, April 23, 2024

నక్షత్ర వీధులలోజీవనయానము

జీవము నుండి దేవము వరకు గల అనేక అద్భుత విషయములను, రహ స్యములను విశదీకరించిన ఒకే ఒక వాఙ్మయ మహానిధి వేదములు, వాని నుండి ఉద్భవించిన అనేక వేదాంగములు. ప్రపంచ నాగరికతలకు మార్గదర్శి ఈ సనాతన వాఙ్మయము. సృష్టి మొదలు నుండి అంతము వరకు గల, తిరిగి ఆరంభమున జరుగు ప్రణాళికల గురించి వివరించిన విధము అత్యంత విజ్ఞానదాయకము మరియు పరమ సత్యము. ఎందరో ఋషి పుంగవులు అందిం చిన ఈ జ్ఞాన భాండాగారమును నిత్యమూ శోధించి, మధించి, అనేక మానవ ప్రయోజనకర సూత్రములను రూపొందించిన, రూపొందిస్తున్న వేద పండిత శాస్త్రజ్ఞులు మన సనాతన వారసత్వ సంపద. మన సనాతన పురాణ, ఇతిహాసము లలో అనేక అద్భుత విషయాలు చూడవచ్చు.
అందు మత్స్యపురాణములో పంచాగ్ని విద్య- నక్షత్ర పథము. నేటికి పంచా గ్ని విద్యలో నిష్టాగరిష్టులు- ఉపాసకులు గలరు. జీవులు పొందు గతులను వివ రించిన తీరు పరమాద్భుతము. దేవయానము, పితృయానము, మధ్యమ యానము అను మూడు విధములు గలవు. ఇది ఒక రకముగా ఖగోళ శాస్త్ర విజ్ఞా నముగా భావించవచ్చు. ప్రవృత్తి మార్గపరులయిన గృహస్థులు, కర్మానుష్టాన పరులు పొందు పితృయానగతి, నివృత్తి మార్గపరులయిన పరతత్త్వోపాసనా పరాయణులు పొందు దేవయాన గతి వివరించబడినది. ఈ రెండింటియందును లేనివారు జనన మరణ ప్రవాహ రూపమున సంసార గతిలో నానాయోనులందు జనించి తిరుగాడవలసినదే!
అనగా యోగులకు, యతులకు, అవధూతల కు లభించు మోక్ష అవకాశము గృహస్థులకు కూడా గలదని తెలియుచున్నది. దీనిని అపస్తంబ మహర్షి సూత్రములలో ఈ విధముగా విశదీకరించారు.
అష్టాశీతి సహస్రాణి యే ప్రజా మీషిర ఋషయ:
దక్షిణ నార్యవ్ణు: పంథానం తే శ్మశానా నిభేజిరే.

అష్టాశీతి సహస్రాణి యే ప్రజాం నేషిర ఋషయ:
ఉత్తరేణార్యవ్ణు: పంథానం తే మృతత్వం హికల్పతే.

పై శ్లోకములు దేవయాన, పితృయాన, మధ్య యానములను తెలుపుచున్నవి. వీటిని తిరిగి నవ నక్షత్ర వీధులుగా విభజించబడినవి. అవి త్రయా పథములుగా మార్గదర్శనం చేయుచున్నవి. ఐరా వత పథము, జారద్గవ పథము, వైశ్వానర పథము లను మార్గత్రయ పథముగా సూచించబడినవి.
ఐరావత పథము ఉత్తమ మార్గమైన దేవయా నము. మధ్యమ మార్గమైనది జారద్గవ పథము. దక్షిణ మార్గమైన పితృయానము వైశ్వానర పథ ము. తిరిగి ఇవి ఏ ఏ నక్షత్ర మండలముల ద్వారా పయనించుచున్నవో తెలిపిన తీరు అద్భుతము. ఈ వివరణ ద్వారా జ్యోతిష్యశాస్త్ర సిద్ధాంతములు రూపొందిం చబడినవి. అనగా ఖగోళ, జ్యోతిష్య శాస్త్రముల ద్వా రా జీవుని జనన మరణ చక్ర భ్రమణ యాత్ర తెలుసుకొనేవారని గ్రహించవచ్చు.
నక్షత్ర మండలమును కొన్ని వీధులుగా విభజించి ఆయా నక్షత్రములలో జన్మించిన జీవుడు చేయు పథయానమును జ్యోతిష శాస్త్రము వివరించుచున్నది. పంచాగ్ని విద్య కూడా సంసారపు నడక, సంస్కారమును బట్టి ప్రవృత్తి మార్గము, నివృత్తి మార్గములను జీవుడు ఎంపిక చేసుకొనునని తెలియజేస్తోంది. వీనిని మరింత పరిశోధన చేయుటకు శాస్త్ర పరిశోధకులు, జ్ఞానులు పూనుకొనవలసిన అవసరమున్నది. యజనము చేయు యజమానులు తమ హవనాదిక వైదిక కర్మ ఫలముగా తాము అర్పించిన జలములు, ద్రవ్యములు ఆదిత్యరశ్ములచే గ్రహింప బడును. ఆవిరి రూపమున అంతరిక్షమునకు చేరునని తిరిగి సోమత్వమును పొంది దేవతాశక్తిని ఆపాదించుకొని పర్జనత్వముతో వృష్టిగా తిరిగి భువిని చేరు ను. వృష్టి నుండి అన్నము దాని నుండి దేహధారి జనించునని తెలియజేస్తోంది. ఈ రహస్యము భగవద్గీతలో కూడా చూడవచ్చు.
ఇక నక్షత్ర వీధులను ఈ విధముగా విభజించుట జరిగినది.
ఉత్తరోత్తరమును నాగవీధిగా అందు భరణి, కృత్తిక, స్వాతి;
ఉత్తర మధ్యమును గజవీధిగా అందు రోహిణి, మృగశిర, ఆర్ద్ర;
ఉత్తర దక్షిణమును ఐరావత వీధిగా అందు పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ;
మధ్యోత్తరమును ఋషవీధిగా అందు పూర్వఫల్గుని, ఉత్తర ఫల్గుని;
మధ్యమధ్యమును గోవీధిగా అందు పూర్వాభాద్ర, ఉత్తరభాద్ర, రేవతి, అశ్విని; మధ్య దక్షిణమును జరద్గవవీధి అందు శ్రవణము, ధనిష్ట, శతభిషం; దక్షిణోత్తరమును మృగవీధిగా అందు హస్త, చిత్ర;
దక్షిణ మధ్యమును అజవీధిగా అందు విశాఖ అనూరాధ;
దక్షిణ దక్షిణమును వైశ్వానర వీధిగా అందు జ్యేష్ట, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢాలను నియమించుట జరిగినది.
ఈ నక్షత్ర వీధులు దేవయాన, పితృయానములు రెండు ప్రక్కలగా పోవుచుండగా మధ్యన సర్వప్రాణియుతమగు మధ్యమ మార్గము ఉన్నట్లు గోచరించును. ఇది యజ్ఞ వేదిక నిర్మాణములో కూడా కనపడుచున్నది.
అజవీధి, మృగవీధి, వైశ్వానర వీధి పితృ యానము.
గోవీధి, జరద్గవ వీధి, ఋషభ వీధి మధ్యమ మార్గము.
నాగవీధి, గజవీధి, ఐరావత వీధి దేవయానముగాను పేర్కొనబడినది. పూర్వజన్మ వాసనలు అనగా సంస్కారములను బట్టి జీవుడు ఆ యాన ములో పయనించునని దీని భావము. ఇటువంటి మహోన్నత సనాతన వాఙ్మయాన్ని స్మరించుకుంటేనే పరమానందము కలుగును కదా!

Advertisement

తాజా వార్తలు

Advertisement