Wednesday, December 4, 2024

కార్తిక పౌర్ణమి విశిష్టత

కృత్తికా నక్షత్రంతో కూడిన పౌర్ణమినాడు వచ్చే మాసాన్ని కార్తిక మాసం అంటారు. ఆరోగ్యం, సంపద, వంశవృద్ధి, పుష్టి, విద్య ఇలాంటి భౌతిక అభ్యుదయం, జీవితానంతరం ముక్తి.. వీటిని సాధించే క్రమంలో సాధనకు అనువైనదిగా కార్తిక పౌర్ణమిని పరిగణిస్తారు. ఈ పౌర్ణమినే లింగ పౌర్ణమి, దేవ దీపావళి అనికూడా పిలుస్తారు. సర్వవ్యాపితమూ, అనంతమైన భగవఛ్చక్తిని సాధకుడు శివునిగా, విష్ణువుగా, లలితాదేవిగా గుర్తిస్తూ ఆరాధిస్తూ, ఈ మాసంలో శివకేశవ లలిత ఆరాధనలు చేస్తుంటారు.
కార్తికంలో శివలింగాన్ని అర్చించడం ఉత్తమమైన అర్చనగా చెపుతారు. శివము అంటే అఖండమైన ఆనందము. ”అన్నీ దేనిలో లీనమై ఉన్నాయో, అన్నింటిలో ఏది లీనమై ఉన్నదో దానిని లింగము” అంటారు. అనగా చైతన్యమే అంతటా ఉన్నది. చైతన్యమే లింగరూపంగా అంతటా వ్యాపించి ఉన్నది. ఆ చైతన్యమే పగలుగా రాత్రిగా ప్రకటితమౌతుంది. పగలు శివతత్త్వానికి, రాత్రి విష్ణు తత్త్వానికి ప్రతీకలు. అలాగే అగ్ని తత్త్వం శివునికి, జల తత్త్వం విష్ణువుకు ప్రతీకలుగా నిలుస్తాయి.
పౌర్ణమినాటి వెన్నెలలు అమతత్త్వానికి ప్రతీకలు. వెన్నెలలో తడవడం వల్ల మనస్సు ప్రశాంతమై, ఏకాగ్రమై సాధనకు అనువౌతుందని సాధకులు కౌముదీ పూజలు చేయడం ప్రసిద్ధమైనదే. ఆనందాన్ని కలిగించే చిఛ్చక్తియే శాంభవి. పౌర్ణమినాడా శాంభవీ రూపంలో లలితార్చన వల్ల ముక్తి కలుగుతుంది.
కార్తిక పౌర్ణమినాడు చంద్రోదయం పిమ్మట దీపారాధన చేయాలి. ఆ రోజంతా ఉపవసించి రాత్రివేళలో కౌముదీ పూజ చేసి, చంద్రునికి నివేదించిన అమతమయమైన పాలను ప్రసాదంగా స్వీకరించడం సంప్రదాయం. మన:కారకుడైన చంద్రుని ఆరాధించడం వల్ల మనసు ప్రశాంతమై, సాధనలో ఏకాగ్రత కుదురుతుంది.
కార్తిక పౌర్ణమినాడు శివాలయాలలోనూ విష్ణ్వాలయాలలోనూ దీపారాధన చేయడం విశేష పుణ్యప్రదం. ఆవునేతిలో నానబెట్టిన 365 వత్తులను ఉసిరికాయపై లేదా పిండితో చేసిన ప్రమిదలలో వేసి వెలిగించడం ఉత్తమం. అరటి దొన్నెలలో దీపాలు వెలిగించి నదులలో విడిచిపెట్టడమూ ఆచారమే. దీపం జ్యోతి స్వరూపం. ఆత్మలో వెలిగే జ్ఞాన జ్యోతిని గుర్తించి వెలిగించుకొనే భావనకు ప్రతీకగా బయట దీపాన్ని వెలిగించి దైవారాధాన చేస్తాము.
కార్తికమాసాన శివునికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాలు, కేదారేశ్వర వ్రతాలు చేసుకోవడం ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. అలాగే సముద్ర స్నానం కాని నదీ స్నానం కాని ఉత్తమం. శక్తి కొలది దానధర్మాల వల్ల ఉత్తమ గతులు కలుగుతాయి. కార్తికమాసంలో ఉసిరికచెట్టు సమీపంలో నిర్వహించే ఆరాధనలు సమస్త క్షేత్రాలలో ఆరాధించిన ఫలితాన్ని ఇస్తుంది. వనభోజనాల వల్ల సామాజిక బంధం పటిష్టమవడమే కాక నిర్వహించే పూజాదులలో సమష్టి చైతన్యాన్ని జాగృతం చేసుకునే విధానమూ కనిపిస్తుంది. కార్తికమాసంలో క్షీరాబ్ధి శయన వ్రతమూ చక్కని ఫలితాన్ని ఇస్తుంది.
కాబట్టి ఈ కార్తిక మాస విశిష్టతను గుర్తించి యధాశక్తి, అవకాశ పరిమితులలో నియమాలను ఆచరిస్తూ ఉత్తమ గతులను మనందరమూ పొందాలని కోరుకుంటూ …

  • పాలకుర్తి రామమూర్తి
Advertisement

తాజా వార్తలు

Advertisement