Saturday, April 20, 2024

గీతాసారం(ఆడియోతో…)

అధ్యాయం 8, శ్లోకం 24

24.
అగ్రిర్జ్యోతిరహ: శుక్ల:
షణ్మాసా ఉత్తరాయణమ్‌ |
తత్ర ప్రయాతా గచ్ఛంతి
బ్రహ్మ బ్రహ్మవిదో జనా: ||

తాత్పర్యము : పరబ్రహ్మము నెరిగిన బ్రహ్మవిదులు అగ్నిదేవుని ప్రభావమునందు, కాంతి యందు, పగటియందలి ఏదేని శుభఘడియ యందు, శుక్లపక్షము నందు లేక సూర్యుడు ఉత్తరముగా ప్రయాణించు ఉత్తరాయణము పుణ ్యకాలము నందు ఈ జగమును వీడుట ద్వారా ఆ పరబ్రహ్మమును పొందుదురు.

భాష్యము : ఎప్పుడైతే అగ్ని, జ్యోతి, పగలు మరియు పక్షము అని చెప్పబడినవో అవి వాటిని నిర్వహించు దేవతలను సూచించును. ఆ దేవతలు, జీవుడు ఒక దేహమును వదలి మరొక ప్రదేశమునకు ప్రయాణించు ఏర్పాట్లను చేయుదురు. సహజముగా మృత్యు సమయమున ఆ వ్యక్తి యొక్క మనస్సు నూతన గమ్యమునకు తీసుకొనిపోవును. సిద్ధిని సాధించిన యోగి కాలాన్ని, ప్రదేశాన్ని నిర్ధారించుకోగలడు గాని, అంత పరిణితి చెందని యోగి అకస్మాత్తుగా శరీరమును వదలివేయవచ్చును. ఆ సమయము పైన చెప్పబడినదైతే తిరిగి ఈ మృత్యు ప్రపంచానికి రాడు. కానిచో మరలా ఇక్కడ జన్మించవలసి ఉంటుంది. కాబట్టి పైన చెప్పబడిన పరిస్థితులలో సహజ సిద్ధముగానైనా లేక ఏర్పాటు ప్రకారమైనా శరీరమును చాలించినట్లయితే నిరాకార బ్రహ్మజ్యోతిని చేరుకుంటాడు. అయితే శుద్ధభక్తుడికి ఇటువంటి భయాలు ఉండవు. అతడు ఏ సమయములో ఏ ప్రదేశములో శరీరాన్ని వదలినా తిరిగి ఇక్కడకు వచ్చే ప్రసక్తే లేదు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement