Wednesday, April 24, 2024

గీతాసారం(ఆడియోతో…)

అధ్యాయం 8, శ్లోకం 15

15.
మాముపేత్య పునర్జన్మ
దు:ఖాలయమశాశ్వతమ్‌ ||
నాప్నువంతి మహాత్మాన:
సంసిద్ధిం పరమాం గతా: ||

తాత్పర్యము : భక్తియోగులైన మహాత్ములు నన్ను పొదిన పిమ్మట సంపూర్ణత్వమును పొందినవారగుటచే దు:ఖాలయమైన ఈ అనిత్య జగమునకు ఎన్నడును తిరిగిరారు.

భాష్యము : అశాశ్వతమైన ఈ భౌతిక ప్రపంచము బహు దు:ఖములతో కూడుకొని ఉంటుంది. ఇచ్చట జన్మ, మృత్యు, జరా వ్యాధి తప్పవు కనుక అత్యున్నత స్థితియైన కృష్ణలోకమునకు చేరుకున్న భక్తుడు సహజముగా ఇక్కడకు తిరిగి రావలెనని ఎప్పుడూ కోరుకొనడు. వేదాలు ఆ ఉన్నత లోకాన్ని అవ్యక్తమని, అక్షరమని పరమగతి అని కొనియాడుచున్నవి. అనగా నిజమైన భక్తులు కృష్ణుని సందేశాలను శుద్ధ భక్తుల నుండి విని భక్తిని పెంపొందించుకుని కృష్ణుడు, అతని సాంగత్యాన్ని తప్ప మరేదానిని కోరరు. ఉన్నత లోకాలు గాని, ఆధ్యాత్మిక లోకాలు గాని వారిని ఆకర్షించవు. కృష్ణున్నే కోరుకునే మహాత్ముల గురించి ఇక్కడ ప్రత్యేకముగా ప్రస్థావించబడినది.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement