Friday, March 29, 2024

గీతాసారం(ఆడియోతో…)

అధ్యాయం 8, శ్లోకం 9

9.
కవిం పురాణమనుశాసితారమ్‌
అణోరణీయాంసమనుస్మరేద్య: |
సర్వస్య ధాతారమచింత్యరూపమ్‌
ఆదిత్యవర్ణం తమస: పరస్తాత్‌ ||

తాత్పర్యము : నియమించువాడును, సూక్ష్మము కన్నను సూక్ష్మమైనవాడును, సమస్తమును పోషించువాడును, భౌతిక భావనలకు పరమైనవాడును, అచింత్యుడును, రూపరహితుడును అగు పరమపురుషుని సర్వజ్ఞునిగను మరియు ప్రాచీననిగను ప్రతియొక్కరు ధ్యానము చేయవలెను. సూర్యుని వలె తేజోసంపన్నుడును మరియు దివ్యుడును అగు అతడు భౌతిక ప్రకృతికి అతీతుడు.

భాష్యము : శ్రీకృష్ణుణ్ని ఏవిధముగా స్మరించవచ్చో ఈ శ్లోకము నందు తెలియజేయటమైనది. మొట్టమొదట తెలుసుకోవలసినది ఆయన ఒక వ్యక్తి అని. మనము రాముణ్ని గాని, కృష్ణున్నిగాని తలచుకున్నప్పుడు ఒక వ్యక్తిగా భావిస్తాము. వారిని ఏవిధముగా స్మరించవచ్చునో, వివరాలు ఈ శ్లోకములో ఇవ్వబడినవి. ‘కవి’ అనగా భూత భవిష్యత్‌ వర్తమానాలు తెలిసినవాడని, అనగా సర్వమూ ఎరుగునని అర్థము. అంతేకాక సర్వానికి మూలము కనుక పురాణుడు అని, మానవాళిని పోషించువాడని, వారికి తగిన శాసనాలను చేయువాడని, ప్రతి అణువులోను ప్రవేశించు పరమాత్మగా, అణువుకన్నా, ఆత్మకన్నా సూక్ష్మమైన వాడని, మనము చూచు గ్రహాలన్నింటినీ గాలిలో తేలునట్లు ఏర్పాటు చేయువాడని, అలాగే అచింత్యుడని, అనగా మన తర్కమునకు, వాదనలకు అందని వాడని అర్థము చేసుకొనవలెను. కాబట్టి తెలివిగలవాడు శాస్త్ర ప్రమాణము ఆధారముగా భగవంతుణ్ని స్వీకరించినట్లయితే అతనికి సరైన అవగాహన సాధ్యమవుతుంది.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement