Wednesday, April 24, 2024

గీతాసారం(ఆడియోతో…)

అధ్యాయం 8, శ్లోకం 8

8.
అభ్యాసయోగయుక్తేన
చేతసా నాన్యగామినా |
పరమం పురుషం దివ్యం
యాతి పార్థానుచింతయన్‌ ||

తాత్పర్యము : ఓ పార్ధా! మనస్సును ఎల్లవేళలా నా స్మరణయందే నియుక్తము జేసి ఏ మాత్రము మార్గము తప్పక నన్నే దేవదేవునిగా ధ్యానము చేసెడివాడు నన్ను తప్పక చేరగలడు.

భాష్యము : ఈ శ్లోకములో శ్రీకృష్ణుడు తనను స్మరించుటము యొక్క ఆవశ్యకతను తెలియజేస్తూ ఉన్నాడు. ‘హరే కృష్ణ’ మహా మంత్రాన్ని జపించుట ద్వారా కృష్ణుణ్ణి జ్ఞప్తికి తెచ్చుకొనవచ్చును. ఈ విధముగా నాలుక, మనస్సు, చెవులను వినియోగించవచ్చును. భగవంతుణ్ని చేరుకొనుటకు ధ్యానము చాలా సులభమైనది. ప్రతి జీవి బద్ధస్థితిలో తానే పురుషున్ని అని, ఆనందించవలసిన వ్యక్తిని అని భావించవచ్చునేమోగాని, నిజానికి మనమందరమూ ఆనందింపచేయవలసిన వ్యక్తి పరమపురుషుడని ఇచ్చట స్పష్టముగా తెలియజేయటమైనది. ఆ పరమ పురుషుడు నారాయణుడుగా, వాసుదేవుడుగా, రాముడుగా, కృష్ణుడుగా వ్యక్తమగును. ‘హరేకృష్ణ’ మంత్ర జపము ద్వారా వీరిలో ఎవరినైనా కొలవవచ్చును, భగవద్ధామమునకు చేరవచ్చును. యోగము యొక్క లక్ష్యము ఏ విధముగా హృదయములోని పరమాత్మను స్మరించుటకు ఉద్దేశించబడినదో అదేవిధముగా ‘హరేకృష్ణ’ మంత్రము కూడా మనస్సును కృష్ణునిపై లగ్నము చేయుటకు ఉద్దేశించిబడినది.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement