Thursday, April 25, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 13, శ్లోకం 34
34
యథా ప్రకాశయత్యేక:
కృత్న్సం లోకమిమిం రవి: |
క్షేత్రం క్షేత్రీ తథా కృత్న్సం
ప్రకాశయతి భారత ||

తాత్పర్యము : ఓ భరతవంశీయుడా! ఒక్కడేయైన సూర్యుడు లోకమునంతటిని ప్రకాశింపజేయునట్లు, దేహము నందలి ఆత్మ సమస్త దేహమును చైతన్యముతో ప్రకాశింపజేయును.

భాష్యము : సూర్యుడు ఒక్క చోటనే ఉండి అంతటినీ కాంతివంతము చేసినట్లు, ఈ శరీరము యొక్క హృదయములో ఉండు అతి సూక్ష్మమైన ఆత్మ, శరీరమునంతటినీ చైతన్యవంతము చేస్తుంది. సూర్యరశ్మిని బట్టి సూర్యుని ఉనికిని గుర్తించినట్లు, చైతన్యమును బట్టి ఆత్మయొక్క ఉనికిని గుర్తించవచ్చును. ఆత్మ ఉన్నంతవరకు శరీరమంతటా చైతన్యము ఉంటుంది. అదే ఒకసారి ఆత్మ వెళ్ళిపోతే శరీరము అచేతనమవుతుంది. తెలివిగలవారు ఈ విషయాన్ని గుర్తించవచ్చు. కాబట్టి చైతన్యమనేది భౌతిక మూలకాల సమ్మేళనము వలన ఉద్భవించినది కాదు. అది ఆత్మ యొక్క లక్షణము. అయితే ఆత్మ యొక్క చైతన్యము ఆ శరీరానికే పరిమితమైతే, అతని స్నేహితునిగా కొనసాగే పరమాత్మ అన్ని శరీరాల చైతన్యమును కలిగి ఉంటుంది. కాబట్టి వారివురూ చైతన్యవంతులే అయినా ఈ భేధమును కలిగి ఉంటారు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement