Wednesday, April 24, 2024

బాబా ఆశీర్వాద ఫలం…

సాకోరి అనే గ్రామంలో నివసించే హంస రాజు అనే వ్యక్తికి భయంకరమైన ఉబ్బసం రోగం సంక్రమిం చింది. ఎంతమంది డాక్టర్ల చుట్టూ తిరిగినా, ఎన్ని రకాలుగా వైద్యం చేయించుకున్నా ప్రయోజనం శూన్యం. అంతేకాక దురదృష్టవశాత్తూ పది సంవత్సరాలయినా అతనికి సంతానం కలగలేదు. డాక్టర్ల వలన ఏం ప్రయోజనం కలగకపోయేసరికి అతను నాసిక్‌లోని ఒక ఆశ్రమంలో వున్న నరసింగ్‌ మహారాజు అనే ఒక సిద్ధ పురుషుడిని దర్శించి తనను పట్టి పీడిస్తున్న రెండు బాధలను తొలగించమని దీనంగా వేడుకున్నాడు. ఆ సిద్ధ పురుషుడు ధ్యానంలో అంతా తెలుసుకొని, పూర్వజన్మలో ఒక వ్యక్తికి చేసిన హాని కారణంగా ఆ వ్యక్తి హంసరాజు శరీరంలో మరణానంతరం భూతమై ప్రవేశించి అతనిని పట్టి పీడిస్తున్నాడని, ఆ భూతాన్ని వెడలగొట్టే శక్తి తనకు లేదని కనుక శిరిడీలో కొలువై వున్న కలియుగ దైవం, భక్తుల పాలిటి ఆశ్రిత కల్ప వృక్షం అయిన శ్రీ సాయి నాధుని శరణు వేడమని సలహా ఇచ్చాడు.
ఆ సిద్ధపురుషుడు చెప్పినట్లే హంసరాజు 1911వ సంవత్సరంలో సకుటుంబ సపరివార సమేతంగా శిరిడీ వెళ్ళి శ్రీ సాయిని దర్శించి తన మనసులోని బాధ చెప్పబో యేంతలో శ్రీ సాయి హంసరాజు చెంపలపై రెండు దెబ్బలు కొట్టి ”ఓసి దుష్ట గ్రహమా? బయటకు పో” అని అరిచారు. తర్వాత కొద్దిసేపటికి శాంతించి ”నిన్ను పట్టి పీడిస్తున్న రెండు బాధలు వెంటనే తొలగిపోయాయి, వెళ్ళి హాయిగా జీవించు” అని ఆశీర్వదించారు. బాబా ఆశీర్వాదం ఫలితం గా ఎంతో మంది సుప్రసిద్ధ వైద్యులచే నయం కాని హంస రాజు ఉబ్బస రోగం వెంటనే తగ్గిపోయింది. అంతేకాక షిరిడీ వెళ్ళివచ్చిన కొంత కాలానికే అతనికి సంతానం కలిగింది.
మరొక సందర్భంలో దహను గ్రామంలో నివసించే కార్నిక్‌ అనే సాయి భక్తుడు 1917వ సంవత్సరంలో గురు పూర్ణిమనాడు సాయిని దర్శించి, ఆయన ఆశీర్వాదం తీసుకొని మశీదు మెట్లు దిగి వెళుతుండగా సాయిని ఒక రూపాయి దక్షిణగా ఇస్తే బావుండుననిపించింది. కాని శిరిడీలో నియమం ప్రకారం ఒకసారి బాబా సెలవు తీసుకున్నాక తిరిగి ఆయనను దర్శించరాదని శ్యామా చెప్పడంతో ఇక చేసేదిలేక కార్నిక్‌ నిరుత్సాహంతో తిరిగి వెళ్ళిపోయాడు. అతను నాసిక్‌కు వచ్చి కాలారాముడి ఆలయంలో దర్శనార్ధం ప్రవేశిస్తుండగా ఆ ఆలయంలో భక్తులతో సద్గోష్టి చేస్తున్న నరసింగ మహారాజు ఉన్న పళాన లేచి బయటకు వచ్చి కార్నిక్‌ చేయి పట్టుకొని ”నా రూపాయిని నాకు ఇవ్వు” అని అన్నారు. ఆయన రూపంలో శ్రీ సాయే తాను ఇవ్వదలచుకున్న రూపాయిని స్వీకరిస్తున్నారని ఆనందించిన కార్నిక్‌ ఎంతో సంతోషంతో ఆ మహరాజుకు రూపాయిని సమర్పించుకొని ఆయన ఆశీర్వాదములను అందుకొని తన ఊరికి వెళ్ళిపోయాడు. తన భక్తుల సత్సంకల్పాలను శ్రీ సాయి నెరవేర్చే విధం అపూర్వం, అసమాన్యం, అద్వితీయం.
సర్వం శ్రీ సాయినాథ పాదారవిందార్పణమస్తు.

Advertisement

తాజా వార్తలు

Advertisement